స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టెస్టుల సిరీస్‌లో ఇంగ్లండ్ బోణీ కొట్టింది. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. లంక నిర్ధేశించిన 205 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లీష్ బ్యాటర్లు నాలుగో రోజే చేధించారు.
అంతకుముందు కమిందు మెండిస్(113), దినేష్ చండిమాల్(79) రాణించడంతో మ్యాచ్ ఆఖరి రోజు వరకూ వెళ్తుంది అనిపించినా.. ఆతిథ్య బౌలర్లు విజృంభించడంతో లంకేయులకు ఘోర పరాజయం తప్పలేదు. ఇంగ్లండ్ స్టార్ జో రూట్ (62 నాటౌట్) విజయంలో కీలక పాత్ర పోషించాడు. 70 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో.. హ్యారీ బ్రూక్ (32)ఎం జేమీ స్మిత్(39)లతో కలిసి రూట్ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు.
మెండిస్ శతకం
అంతకుముందు రెండో ఇన్నింగ్స్‌లో లంక బ్యాటర్లు గొప్పగా పోరాడారు. ముఖ్యంగా కమిందు మెండిస్(113), మాథ్యూస్(65), చండిమల్(79) త్రయం ఇంగ్లీష్ పేసర్లను ఎదుర్కొన్న తీరుకు ఔరా అనాల్సిందే. పదునైన పేసీ పిచ్‌పై చాలా ఓపిగ్గా బ్యాటింగ్ చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో లంక 326 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.
తొలి ఇన్నింగ్స్‌లో లంక 236కే కుప్పకూలగా.. ఇంగ్లాండ్ 358 పరుగులు చేసింది.
సంక్షిప్త స్కోర్లు
- శ్రీలంక మొదటి ఇన్నింగ్స్: 236/10
- ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్: 358/10
- శ్రీలంక రెండో ఇన్నింగ్స్: 326/10
- ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్: 205/5