వన్డే ప్రపంచ కప్‌లో లంకేయులు మరోసారి విఫలమయ్యారు. బెంగుళూరు, చిన్నస్వామి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 171 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఏదో ఆడాలన్నట్లుగా ఆడారు తప్ప.. గెలవాలన్న కసి వారిలో ఏ మూలాన కనిపించలేదు. ఆఫ్గనిస్తాన్, నెదర్లాండ్స్ వంటి జట్లు విజయం కోసం శక్తికి మించి పోరాడుతుంటే.. లంక ఆటగాళ్లు కనీస పోరాటం కూడా చేయలేదు. ఓవర్‌కు రెండు, మూడు చొప్పున పరుగులు చేస్తూ.. వన్డే మ్యాచ్‌ను కాస్త టెస్ట్ మ్యాచ్‌గా మార్చేశారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ ఐదో బంతికి ఓపెనర్ పథుమ్ నిస్సంక(2) ను సౌథీ పెవిలియన్ చేర్చాడు. అనంతరం ట్రెంట్ బౌల్ట్.. ఒకే ఓవర్లో కెప్టెన్ కుశాల్ మెండిస్(6), సమరవిక్రమ (1)ను ఔట్ చేసి వారిని మరింత కష్టాల్లోకి నెట్టాడు. మరో ఎండ్ నుంచి కుషాల్ పెరీరా(51; 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) ధాటిగా ఆడినా.. అతను ఔటయ్యాక లంక ఇన్నింగ్స్ టెస్ట్ మ్యాచ్‌ను తలపించింది. చరిత అసలంక(8), మాథ్యూస్(0), ధనంజయ డిసిల్వా(4), చమిక కరుణరత్నే(6) వెంటవెంటనే ఔటయ్యారు. ఆఖరిలో మహీష తీక్షణ(39 నాటౌట్), దిల్షాన్ మధుశంక(19) జోడి పోరాడడంతో ఏమాత్రం స్కోరైనా చేయగలిగారు. కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ 3 వికెట్లు పడగొట్టగా.. లాకీ ఫెర్గూసన్, మిచెల్ సాంట్నర్, రచిన్ రవీంద్ర రెండేసి వికెట్లు తీసుకున్నారు.
పాక్ కథ కంచికే!
ఈ మ్యాచ్‌లో లంకేయులు విజయం సాధిస్తే.. పాకిస్తాన్ జట్టు సెమీస్ చేరే అవకాశాలు మెండుగా ఉండేవి. అలాంటిది లంక బ్యాటర్ల పోరాటం చూశాక పాక్ ఆటగాళ్లు మౌనదీక్ష వహిస్తున్నారు. 171 పరుగుల లక్ష్యాన్ని కివీస్ బ్యాటర్లు త్వరగానే ఛేదించి నెట్ రన్‌రేట్‌ను మరింత మెరుగు పరుచుకుంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. దీంతో పాకిస్తాన్ జట్టు తమ తదుపరి మ్యాచ్(నవంబర్ 11న, ఇంగ్లాండ్‌పై)లో విజయం సాధించిన సెమీస్ చేరేది కష్టమే.
Kusal Perera's quickfire fifty and a dogged final stand drags Sri Lanka to 171, but New Zealand are firmly on top at the Chinnaswamy ?https://t.co/xEJ99Eyjiy | #NZvSL | #CWC23 pic.twitter.com/tZbKFG6vwB
— ESPNcricinfo (@ESPNcricinfo) November 9, 2023