అనుమతి లేకుండా స్లాటర్ హౌస్

అనుమతి లేకుండా స్లాటర్ హౌస్

మెహిదీపట్నం, వెలుగు: జియాగూడలో గుర్తింపు లేకుండానే స్లాటర్​ హౌస్​ల నిర్వహణ జరుగుతోంది. కొందరు వ్యాపారులు బల్దియా ఫేక్ స్టాంప్​లను వాడుతూ మాంసాన్ని అమ్ముతున్నారు. జియాగూడలో స్లాటర్ హౌస్  పర్మిషన్​ను గతంలోనే ప్రభుత్వం తొలగించింది. ఇక్కడ పనిచేస్తున్న వేల మంది కార్మికులు రోడ్డున పడకుండా ఉండేందుకు కేవలం ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన మేకలను మాత్రమే అమ్మడం, కొనేందుకు పర్మిషన్ ఇచ్చింది. కానీ జియాగూడలో అక్రమంగా స్లాటర్ హౌస్ నిర్వహణతో పాటు నాణ్యత లేని మాంసం అమ్మకాలు జరుగుతున్నాయి. ఇటీవల జియాగూడలోని ఓ స్లాటర్ హౌస్​లో బల్దియా వెటర్నరీ డిపార్ట్ మెంట్ అధికారులు తనిఖీలు చేసి బల్దియా ఫేక్ స్టాంప్​ను వాడుతూ ​మాంసం అమ్ముతున్నట్లు గుర్తించారు. జియాగూడకు చెందిన సందీప్ కుమార్​కు చెందిన స్లాటర్​ హౌస్​లో కేవలం మేకలను మాత్రమే  అమ్మాల్సి ఉండగా.. అంబర్ పేట స్లాటర్ హౌస్ పేరుతో బల్దియా వెటర్నరీ డిపార్ట్ మెంట్​కు చెందిన ఫేక్​ స్టాంప్​ను వాడుతూ నాణ్యత లేని మాంసం కూడా అమ్ముతున్నాడు.

ఈ మాంసాన్ని వివిధ హోటళ్లకు, విందులకు , ఫంక్షన్ హాల్స్​కు సప్లయ్ చేస్తున్నాడు.  విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ వెటర్నరీ అధికారులు ఈ నెల 21న అతడి మండీలో తనిఖీ చేశారు. ఫేక్ స్టాంప్ వేసి ఉన్న కల్తీ మాంసాన్ని సీజ్ చేశారు. సందీప్ కుమార్​పై కేసు ఫైల్ చేసి కుల్సుంపురా పోలీసులకు అప్పగించారు. జియాగూడలో కల్తీ దందా ఇంకా జరుగుతోందని, చాలామంది నాణ్యత లేని మాంసం అమ్ముతున్నారని  స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి జియాగూడలోని ఫేక్​ స్లాటర్​ హౌస్​లను గుర్తించి, నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.