
- ఎస్ఎల్బీసీ వద్ద గంటకు 800 టన్నుల మట్టి, రాళ్ల తొలగింపు
- లోకో ట్రాక్ ద్వారా బురద తరలింపు
- ఘటనా స్థలంలో దుర్వాసన, మృతదేహాలదేననే అనుమానం: ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్ లో స్పీడ్ పెరిగింది. టన్నెల్ లో చిక్కుకున్న వారిని బయటకు తీసే ప్రయత్నం చేస్తుండగా.. బురద, మట్టి, నీటి ఊట వల్ల తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఇలాంటి తరుణంలో మంగళవారం మధ్యాహ్నం నుంచి కన్వేయర్ బెల్ట్ అందుబాటులోకి రావడంతో రెస్క్యూ టీమ్‌లకు కొండంత ధైర్యం వచ్చినట్లయింది.
సోమవారం అర్ధరాత్రి నుంచి దీనికి రిపేర్లు చేసిన నిపుణులు.. మధ్యాహ్నం కన్వేయర్‌ను రెడీ చేసి ఆన్ చేశారు. దీంతో గంటకు 800 టన్నుల మట్టి, రాళ్లను బెల్టు ద్వారా టన్నెల్ బయటకు తరలిస్తున్నారు. మ్యానువల్‌గా తవ్వి తీసే బురదను లోకో ద్వారా బయటకు తీస్తుండగా.. ప్రస్తుతం లోకో 11.5 కిలోమీటర్ల వరకే వస్తోంది. కన్వేయర్ అందుబాటులోకి రావడంతో త్వరగా శిథిలాలను బయటకు తరలించి, లోకోను 13.5 కిలోమీటర్ల వరకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. బురద, మట్టి, రాళ్లను ఎత్తేందుకు ఎక్స్కవేటర్, హిటాచీలను వాడుతున్నారు.
ఎన్జీఆర్ఐ గుర్తించిన మూడు పాయింట్ల వద్ద రెస్క్యూ టీములు మంగళవారం 8 మీటర్ల వరకు తవ్వకాలు చేపట్టగా.. అక్కడ టీబీఎం మెషీన్‌కు సంబంధించిన ఇనుప సామగ్రి బయట పడింది. దీంతో మళ్లీ ఈ టీమ్ తాజాగా మరో మూడు చోట్ల స్కాన్ చేసి ఐడెంటిఫికేషన్ మార్కులు చేసింది. ఈ ప్రాంతంలో డెడ్‌బాడీలు డీ కంపోజ్ అయిన వాసన వస్తోంది. అక్కడ తవ్వకాలు ప్రారంభించారు. మంగళవారం అర్ధరాత్రి లేదా బుధవారం మధ్యాహ్నం వరకు కొన్ని మృతదేహాలను బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంది. కాగా.. మంగళవారం నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధులు రెస్క్యూలో జాయిన్ అయ్యారు. అలాగే టన్నెల్లో చిక్కుకుపోయిన 8 మంది బాధితుల కుటుంబ సభ్యులకు మున్ననూర్‌లోని ప్రైవేట్ లాడ్జిలో వసతి కల్పించారు.
టీబీఎం ముందు భాగానికి చేరుకున్నారు: ఎమ్మెల్యే
రెస్క్యూ టీములు మంగళవారం టీబీఎం ముందు భాగం వరకు చేరుకున్నాయని అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రెస్క్యూ టీములు చేరుకున్న ప్రాంతంలో మృతదేహాలు డీ కంపోజ్ అయిన వాసన వస్తున్నట్లు వారు గుర్తించారన్నారు. బుధవారం కొన్ని మృతదేహాలను బయటకు తీసుకురావచ్చని చెప్పారు. డీ వాటరింగ్ స్పీడ్‌గా జరుగుతోందన్నారు. టన్నెల్లో హోల్స్ పెట్టిన చోట నీటి ఊట వస్తుండటంతో.. అక్కడ పంపులు ఏర్పాటు చేసి నీటిని బయటకు తోడుతున్నామన్నారు. నాలుగు షిఫ్టులుగా రెస్క్యూ టీములు పని చేస్తున్నాయన్నారు. లోపల మట్టి గడ్డ కట్టలేదని.. కొద్ది ప్రాంతంలో మాత్రమే కెమికల్, డస్ట్ లవడంతో సిమెంట్ లాగా ఫిక్స్ అయ్యిందని ఆయన వివరించారు.
11 రోజులుగా బడులు బంద్..
దోమలపెంట వద్ద ఉన్న ఎస్ఎల్బీసీ టన్నెల్ దగ్గర గత నెల 22న ప్రమాదం జరుగగా.. 12 రెస్క్యూ టీములతో పాటు ఆయా డిపార్ట్మెంట్లకు చెందిన ఆఫీసర్లు దాదాపు వెయ్యి మంది పగలు, రాత్రి ఇక్కడే ఉంటున్నారు. దీంతో వీరికి వసతి కల్పించడం సమస్యగా మారింది. దోమలపెంటలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ గెస్ట్ హౌస్‌లు, రూములు, లాడ్జీలను కలెక్టర్ అధీనంలోకి తీసుకొని ఉన్నతాధికారులు, రెస్క్యూ టీమ్స్ ప్రతినిధులకు కేటాయించారు.
మిగతా వారికి వసతి లేకపోవడంతో దోమలపెంటలోని గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్, జడ్పీ హైస్కూల్, టీఎస్ జెన్కో డీఏవీ స్కూల్స్‌కు హాలిడేస్ ప్రకటించి, వాటిని రెస్క్యూ బృందాలకు అప్పగించారు. ఈ మూడు స్కూళ్లలో 85 మంది స్టూడెంట్లు చదువుకుంటుండగా.. 11 రోజులుగా వీరు ఇండ్ల వద్దే ఉంటున్నారు. ఈ స్కూల్స్‌కు సంబంధించిన టీచర్లు ఇప్పటి వరకు బడుల వైపు చూడడం లేదు. దీనిపై ఎంఈవోను వివరణ కోరే ప్రయత్నం చేయగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.