
- కాళేశ్వరాన్ని అడ్డదిడ్డంగా నిర్మించిన్రు: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
- అన్ని ప్రాజెక్ట్‌లను బీఆర్ఎస్ గాలికి వదిలేసింది
- ఎమ్మెల్సీ కవిత చేసేవన్నీ దొంగ దీక్షలే అని కామెంట్
దేవరకొండ/కొండమల్లేపల్లి/చింతపల్లి, వెలుగు: నల్గొండ జిల్లాలో ఎస్ఎల్బీసీ టన్నెల్ మార్గాన్ని, డిండి ప్రాజెక్ట్‌ను మూడేండ్లలో పూర్తి చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రూ.3వేల కోట్లు కేటాయించి ఉంటే పాలమూరు, నల్గొండ జిల్లాల్లో కరువు ఉండేది కాదని తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే బాలూ నాయక్‌తో కలిసి దేవరకొండ పట్టణంలో గరుడాద్రి కొండపై నిర్మిస్తున్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో మంత్రి వెంకట్ రెడ్డి పూజలు చేశారు. రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించారు.
ఆపై డిండి క్రాస్ రోడ్డు నుంచి మైనంపల్లి బ్రిడ్జి దాకా రూ.14 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు పనులు ప్రారంభించారు. అంతకుముందు చింతపల్లి మండలంలోని సాయిబాబా ఆలయంలో పూజలు చేసి, ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘‘ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం, డిండి ప్రాజెక్ట్‌లను మూడేండ్లలో పూర్తి చేస్తాం. దేవరకొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటా కంటే ఎక్కువగా ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాను. భద్రాచలం రామయ్య పాదాల సాక్షిగా సోమవారం ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడుతున్నాం’’అని మంత్రి పేర్కొన్నారు.
లక్షల కోట్లు దోచుకున్నరు
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఫ్యామిలీ లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుందని మంత్రి ఆరోపించారు. టానిక్ అనే ఒక్క మద్యం దుకాణానికి అనుమతి తీసుకొని అక్రమంగా 6 వైన్స్ నిర్వహించి కోట్ల రూపాయలను బీఆర్ఎస్ లీడర్లు దోచుకున్నారన్నారు. ‘‘లిక్కర్ కేసు మెడకు బిగుస్తున్నా కొద్దీ.. ఎమ్మెల్సీ కవిత మహిళలపై ఎక్కడా లేని ప్రేమ ఒలకబోస్తున్నది. కేసీఆర్ పాలనలో ధర్నా చౌక్‌ను ఎత్తేసి.. ఇప్పుడు అక్కడే దొంగ దీక్షలు చేయడం సిగ్గుచేటు. గతంలో సీఎం అంటే.. నిజాం రాజు లెక్క ఉండేటోడు. కాళేశ్వరం అడ్డదిడ్డంగా నిర్మించి.. మిగితా ప్రాజెక్ట్‌లు గాలికి వదిలేశాడు. దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన నిరుద్యోగులు ఎక్కువగా ఉన్నరు. వారికి మెడికల్ కాలేజ్, ఇతర సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించేందుకు కృషి చేస్తా’’అని హామీ ఇచ్చారు.