
- టన్నెల్‌లో చిక్కుకున్న ఏడుగురి కోసం కొనసాగుతున్న ఆపరేషన్
- మెషీన్ల వాడకంతో వేగంగా మట్టి, రాళ్లు, బురద తరలింపు
- టన్నెల్‌లో తగ్గని నీటి ఊట
నాగర్‌కర్నూల్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. రెస్క్యూ సిబ్బందితో పాటు యంత్రాల ద్వారా మట్టి, రాళ్లు, బురద, ఇనుము తొలగింపు చేపడుతుండడంతో పనుల్లో వేగం పెరిగింది. డీ1, డీ2, ఏ5 పాయింట్లలో చిక్కుకొని ఉంటారని భావిస్తున్న ఏడుగురి ఆచూకీ కోసం రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
టీబీఎం పరిసరాల్లో మట్టి తవ్వకం, బండరాళ్లు తొలగింపు, కట్ చేసిన టీబీఎం భాగాలను లోకో ట్రాలీలు, కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు తరలిస్తున్నారు. మట్టిని తవ్వే కోద్దీ అన్ని దిక్కుల నుంచి నీటి ప్రవాహం పెరుగుతోంది. అయితే ఏడుగురికి ఆచూకీ ఎలాగైనా కనిపెట్టాలన్న ఉద్దేశంతోనే రిస్క్ ఉన్నప్పటికీ పనులు చేస్తున్నామని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు.
టన్నెల్ లోపల, ప్రమాదకర ప్రదేశంలో జరుగుతున్న సహాయక చర్యలు, తీసుకోవాల్సిన భద్రతా ప్రమాణాలపై ఆంధ్రా సబ్ ఏరియా ఆర్మీ కమాండింగ్ ఆఫీసర్ మేజర్ అజయ్ మిశ్రా, డిజాస్టర్ అండ్ మేనేజ్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రఘునాథ్ సహాయక బృందాల ఉన్నతాధికారులతో సమీక్షించారు. సహాయక చర్యలకు ఆటంకంగా మారుతున్న నీటి ఊటను తరలించేందుకు డీవాటరింగ్ పంపులు, మోటర్ల కెపాసిటీ, సంఖ్యను పెంచుతున్నారు.
టన్నెల్ లోపల సిమెంట్ సెగ్మెంట్ల మధ్య నుంచి ఫోర్స్‌గా వస్తున్న నీటిని తరలించేందుకు పైప్‌లు ఫిక్స్ చేసి వాటికి మోటార్లు ఏర్పాటు చేశారు. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసర్ల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్‌ను ఎన్‌డీఆర్‌ఎఫ్ కర్నల్ సురేశ్, కర్నల్ పరీక్షిత్ మెహ్రా, వికాస్ సింగ్, డాక్టర్ హరీశ్, జీఎస్‌ఐ ఆఫీసర్లు తప్లీయాల్, భట్టాచార్య, శైలేంద్ర, లక్ష్మణ్, సింగరేణి మైన్స్ రెస్క్యూ జనరల్ మేనేజర్ బైద్య పర్యవేక్షిస్తున్నారు.