
- డీ1 పాయింట్‌లో ఎనిమిది మీటర్ల మట్టి తొలగింపు
- టన్నెల్‌లో పెరిగిన నీటి ప్రవాహం
నాగర్‌కర్నూల్/అచ్చంపేట, వెలుగు : ఎస్‌ఎల్‌బీసీ రెస్క్యూ ఆపరేషన్ బుధవారంతో 26వ రోజుకు చేరుకుంది. డీ1 పాయింట్‌లో రెండు ఎస్కవేటర్ల సాయంతో సుమారు ఎనిమిది మీటర్ల మట్టి, శిథిలాలను తొలగించారు. డీ1 పాయింట్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో డీవాటరింగ్ కోసం ఉపయోగిస్తున్న నాలుగు మోటర్లు కూడా సరిపోవడం లేదని సమాచారం. మరో వైపు టీబీఎం స్ట్రక్చర్, ఐరన్ పార్ట్స్‌ను థర్మల్ కటింగ్‌తో తొలగిస్తున్నారు. టీబీఎం ప్లాట్‌ఫాం, వెనుక భాగాలను తొలగించడంతో ఎస్కవేటర్లు డీ1, డీ2 పాయింట్ల వద్దకు వెళ్లగలుగుతున్నాయి.
అక్కడ తొలగించిన శిథిలాలను 200 మీటర్ల దూరంలో ఉన్న కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకి పంపుతున్నారు. మట్టి తవ్వకాల్లో కీలకంగా మారిన ర్యాట్‌హోల్ మైనర్లు టన్నెల్ చివర్లో అత్యంత ప్రమాదకరంగా భావిస్తున్న ప్రాంతా నికి చేరుకున్నారు. డీ1, డీ2 ఏరియాల మధ్యన ఉన్న 23 మీటర్ల పరిధిలో డెడ్‌బాడీల ఆచూకీ దొరికే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్‌కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు.