- గ్రీన్‌చానల్ కింద నెలనెలా నిధులు: డిప్యూటీ సీఎం భట్టి
- ఇప్పటికే 42 కోట్లు రిలీజ్.. పనులు స్టార్ట్
- గత పాలకుల నిర్లక్ష్యంతో రూ.4 వేల కోట్లకు నిర్మాణ వ్యయం
- పెండింగ్ ప్రాజెక్టులన్నీ మూడేండ్లలో పూర్తిచేస్తామని ప్రకటన
- 2027 సెప్టెంబర్ నాటికి ఎస్ఎల్బీసీ ద్వారా సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ఎస్ఎల్బీసీ పూర్తయితే నల్గొండ సస్యశ్యామలం: మంత్రి వెంకట్‌రెడ్డి
- ఎస్ఎల్బీసీ పనుల పరిశీలన..ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రాజెక్టులపై రివ్యూ
నల్గొండ, వెలుగు : రాబోయే రెండేండ్లలో శ్రీశైలం లెఫ్ట్‌బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ) ప్రాజెక్టును పూర్తిచేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఎప్పుడో వెయ్యి కోట్లతో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం గత బీఆర్ఎస్సర్కారు నిర్లక్ష్యంతో రూ.4 వేల కోట్లకు పెరిగిందని అన్నారు. ఇన్నేండ్లలో పంటలు సాగవక రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. శుక్రవారం నల్గొండ, మహబూబ్‌గర్ జిల్లాలకు సాగునీరు అందించేందుకు మన్నేవారిపల్లి వద్ద నిర్మి స్తున్న ఎస్ఎల్ బీసీ సొరంగ మార్గం పనులను మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి భట్టి పరిశీలించారు.
అనంతరం ఇరిగేషన్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భం గా డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ, ఎస్ఎల్బీసీ టన్నెల్నిర్మాణానికి ప్రతి నెల రూ.14 కోట్లు ఖర్చవుతుందని, గ్రీన్‌చానల్ ద్వారా ప్రతి నెలా ఈ నిధులను ఆర్థిక శాఖకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఇప్పటికే రూ.42 కోట్లు రిలీజ్ చేసి, పనులు మొదలు పెట్టించామని తెలిపారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అమెరికా వెళ్లి బేరింగ్ గురించి మాట్లాడారని, బేరింగ్రాగానే పనులు మరింత స్పీడప్ చేస్తామని చెప్పారు.
ఇంకా బ్యాలెన్స్11 కిలోమీటర్ల సొరంగ మార్గం తవ్వేందుకు ఇరిగేషన్ అంచనా ప్రకారం నెలకు 200 మీటర్లు తవ్వాల్సి ఉంటుందని, ఇందుకోసం రూ.14 కోట్లు ఠంచన్‌గా రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ లెక్కన 20 నెలల్లో ప్రాజెక్టు పూర్తిచేస్తామని కాంట్రాక్టు సంస్థ క్లారిటీగా చెప్పిందని అన్నారు. అదనంగా 3 వందల మీటర్లు పనిచేసినా నిధులు ఇవ్వడానికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రెడీగా ఉన్నట్టు చెప్పారు. దీంతోపాటే నక్కలగండి, పెండ్లిపాకల, ఉదయ సముద్రం, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టులతోపాటు మూసీ పరివాహక ప్రాంతంలోని బునాదిగాని, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువల పనులు కూడా కంప్లీట్చేస్తామని భట్టి పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో చేపట్టిన ఈ ప్రాజెక్టులను తెలంగాణ వచ్చాక కంప్లీట్ చేయాల్సిన బీఆర్ఎస్ ప్రభుత్వం.. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్షల కోట్లు దుర్వినియోగం చేసిందని, అక్కడ గోదావరి, ఇక్కడ కృష్ణా నీళ్లు ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు. కానీ పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను కంప్లీట్ చేసేందుకు తాము ఒక పాలసీ రూపొందించామని, మూడేండ్లలో మొత్తం అన్ని ప్రాజెక్టులు కంప్లీట్ చేసేందుకు ప్రత్యేకంగా క్యాలెండర్ రూపొందించామని తెలిపారు. దాని ప్రకారం ప్రతివారం ప్రాజెక్టుల పురోగతి పై రివ్యూ చేస్తామని, నాలుగేండ్లలో రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని చెప్పారు.
ఎస్ఎల్బీసీ పూర్తయితే 4 లక్షల ఎకరాలకు నీళ్లు : మంత్రి వెంకట్‌రెడ్డి
శ్రీశైలం ప్రాజెక్టు డెడ్‌స్టోరేజ్‌లో ఉన్నప్పటికీ ఎస్ఎల్బీసీ ద్వారా నల్గొండ, నాగర్కర్నూల్జిల్లాలకు తాగు, సాగునీరు అందించాలనే సంకల్పంతోనే నాటి సీఎం వైఎస్సార్‌పైన ఒత్తిడి తెచ్చి సొరంగ మార్గాన్ని సా ధించినట్టు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే నల్గొండ జిల్లాలో 4 లక్షల ఎకరాలు సాగులోకి వస్తుందని తెలిపారు. ఎస్ఎల్బీసీ హైలెవల్ కెనాల్‌కు సంబంధించి నాలుగో పంపు రిపేర్లు కంప్లీట్ చేశామని, మూడు రోజుల్లో నీటిని విడుదల చేస్తామని చెప్పారు. రూ.37 కోట్లు రిలీజ్ చేస్తే బ్రాహ్మణ వెల్లంల కింద భూసేకరణ పూర్తవుతుందని, తద్వారా చెరువులు నింపేందుకు వీలవుతుందని అన్నారు.
వెంటనే నిధులు ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరారు. డిండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా సాగునీరు ఓవర్ ఫ్లో అవుతున్నందున గొట్టిముక్కల, సింగరాజుపల్లి రిజర్వాయర్లను నింపుకోవచ్చని, అలాగే పిళ్లాయిపల్లి కాలువ, బునాధిగాని కాలువ, ధర్మారెడ్డి కాలువలకు వెంటనే నిధులు మంజూరు చేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. డిండి, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర స్థాయిలో ఫారెస్ట్ క్లియరెన్స్‌కు ప్రత్యేక అధికారిని నియమించాలని నల్గొండ ఎంపీ రఘువీర్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పెండింగ్ లో పడ్డాయని తెలిపారు. దేవరకొండ నియోజకవర్గంలో కొత్తగా మూడు లిఫ్ట్ స్కీంలు సాంక్షన్ చేయాలని డిప్యూటీ సీఎంను కోరారు. సమావేశంలో ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ రెడ్డి, వేముల వీరే శం, నేనావత్ బాలూనాయక్, జైవీర్ రెడ్డి, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మందుల సామేలు పాల్గొన్నారు.
రూ.4,400 కోట్లు సాంక్షన్ చేస్తం : మంత్రి ఉత్తమ్
ఎస్ఎల్ బీసీ టన్నెల్ పనులకు సవరించిన అంచనాల ప్రకారం రూ. 4,400 కోట్లు పెంచి కేబినెట్ మీటింగ్ లో మంజూరు చేస్తామని మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. సొరంగం పనుల కోసం అయ్యే ఖర్చును ఏజెన్సీకి సాధ్యమైనంత త్వరగా చెల్లిస్తామని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు ద్వారా 2027 సెప్టెంబర్ 20 నాటికి సాగునీటిని అందిస్తామని స్పష్టం చేశారు. ఇకమీదట డిండి ప్రాజెక్టుపై ప్రతివారం సమీక్ష చేయాలని
పెండింగ్‌లో ఉన్న అటవీ శాఖ అనుమతులు తీసుకొచ్చేందుకు ఢిల్లీస్థాయిలో చర్యలు తీసుకుంటామన్నారు. దీనిపై ఎంపీ రఘువీర్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోరారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువ , బునాదిగానీ కాలువలు గ్రావిటీ ద్వారా నీటిని అందిస్తాయని, ఈ మూడు కాలువల ద్వారా 365 రోజులు సాగునీరు అందించే అవకాశాలు ఉన్నందున, వీటికి వెంటనే ఆమోదం ఇవ్వాలని డిప్యూటీ సీఎంను కోరారు.