బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం.. గత ప్రభుత్భం టన్నెల్ పనులు మధ్యలోనే వదిలేసింది: ఉత్తమ్

బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్లే  ప్రమాదం.. గత ప్రభుత్భం టన్నెల్ పనులు మధ్యలోనే వదిలేసింది: ఉత్తమ్
  • గత సర్కార్ కనీసం కరెంట్ సప్లై కూడా ఇవ్వలేదు
  • దాంతో డీవాటరింగ్‌‌కు ఇబ్బందులు 
  • రెండు మూడ్రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుందని వెల్లడి

ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ, వెలుగు టీమ్: గత బీఆర్ఎస్ సర్కార్ నిర్లక్ష్యం వల్లే ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగిందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి మండిపడ్డారు. ‘‘బీఆర్ఎస్ హయాంలో టన్నెల్ పనులు చేయకుండా మధ్యలోనే వదిలేశారు. ఆనాడు జగదీశ్ రెడ్డి మంత్రిగా ఉండి ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌బీసీకి కరెంటు కట్ చేయడంతోనే డీవాటర్ చేయడానికి ఇప్పుడు ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మీరు సరిగ్గా పని చేసి ఉంటే, ఈ ప్రాజెక్టు పూర్తవుతుండే కదా?” అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నిర్లక్ష్యం వల్ల ఇప్పటికీ ఎస్ఎల్బీసీ వద్ద రూ.3 వేల కోట్ల పనులు ఆగిపోయాయని, 9 కిలోమీటర్ల పనులను చేయకుండా వదిలి పెట్టారని ఫైర్ అయ్యారు. 

టన్నెల్ దగ్గరున్న జేపీ క్యాంప్​ఆఫీస్ వద్ద గురువారం మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. డీవాటరింగ్ చేసేందుకు కనీసం టన్నెల్​వద్ద పవర్ సప్లై కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్‌‌‌‌‌‌‌‌ తీరుపై ఆయన మండిపడ్డారు. అనుమతులు, రిపోర్టుల గురించి మాట్లాడుతున్న హరీశ్ రావు.. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  ఏం పనులు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. టన్నెల్​వద్దకు వచ్చిన బీఆర్ఎస్ నేతలు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ‘‘టన్నెల్​వద్ద సహాయక చర్యలు జరుగుతున్నాయి. 11 ఏజెన్సీలను కోఆర్డినేట్ చేసి పనులు పర్యవేక్షిస్తున్నాం. రెండు, మూడు రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ పూర్తవుతుంది. మూడు నెలల్లో టన్నెల్ వర్క్స్ పునఃప్రారంభించి పెండింగ్​పనులు పూర్తి చేస్తాం” అని తెలిపారు. 

హరీశ్‌‌‌‌‌‌‌‌కు సిగ్గుండాలి.. 

టన్నెల్ దగ్గరికి బీఆర్ఎస్ నేతలను తాము అనుమతించామని ఉత్తమ్ తెలిపారు. ‘‘హరీశ్‌‌‌‌‌‌‌‌రావుకు సిగ్గుండాలి. వాళ్ల హయాంలో ప్రాజెక్టులను చూడడానికి ప్రతిపక్ష నేతలకు అనుమతి ఇవ్వలేదు. కాళేశ్వరం దగ్గరికి ఎవరినీ పోనివ్వలేదు. వాళ్ల హయాంలో రూ.1.80 లక్షల కోట్ల ఖర్చుతో ప్రాజెక్టులు కడితే.. ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. లక్ష కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరం కూలింది. 27 వేల కోట్లతో కట్టిన పాలమూరు ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు. దేవాదుల, ఎస్ఎల్‌‌‌‌‌‌‌‌బీసీ పూర్తి కాలేదు. ప్రాణహిత–చేవెళ్లని వదిలేశారు. తెలంగాణ ప్రాజెక్టులను సర్వనాశనం చేసిన ఘనత కేసిఆర్, హరీశ్‌‌‌‌‌‌‌‌దే. అదే వాళ్లు పదేండ్లలో చేసిన ఘనకార్యం” అని మండిపడ్డారు. 

‘‘శ్రీశైలం పవర్ హౌస్‌‌‌‌‌‌‌‌లో 9 మంది చనిపోతే, అప్పటి బీఆర్ఎస్​ప్రభుత్వం పట్టించుకుందా? రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్తే దారిలో అరెస్టు చేశారు. దేవాదుల టన్నెల్ నిర్మాణంలో ఏడుగురు చనిపోతే.. ఐదేండ్ల తర్వాత అస్థిపంజరాలు దొరికాయి. కాళేశ్వరం నిర్మాణంలో ఆరుగురు చనిపోయారు. పాలమూరులో పంపు కూలి ఆరుగురు చనిపోయారు. వీటి గురించి ఎవరైనా అడిగారా?” అని ప్రశ్నించారు. మాసాయిపేటలో 25 మంది పిల్లలు చనిపోతే.. అప్పటి సీఎం కేసీఆర్, మంత్రులు, బీఆర్ఎస్​లీడర్లు బాధితులను పరామర్శించారా? కొండగట్టు బస్సు ప్రమాదంలో 64 మంది చనిపోతే పట్టించుకున్నారా? అని మండిపడ్డారు.

ఏపీ నీళ్ల దోపిడీకి బీఆర్ఎస్సే కారణం.. 

నాటి ఏపీ సీఎం వైఎస్​జగన్​మోహన్​రెడ్డితో కుమ్మక్కై తెలంగాణకు చెందిన కృష్ణా జలాలను ఏపీకి అప్పగించింది మీరు కాదా? అని హరీశ్​రావును ఉత్తమ్ ప్రశ్నించారు. ‘‘జగన్‌‌‌‌‌‌‌‌ను ఆహ్వానించి విందులు, విలాసాలు చేసుకున్నరు. ఆయన కృష్ణానది మీద అక్రమంగా ప్రాజెక్టులు కట్టిండు. కృష్ణా వాటాలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే కేసీఆర్​పట్టించుకోలేదు” అని ఫైర్ అయ్యారు. కాగా, హెలికాప్టర్ లేదని ఓ మంత్రి టన్నెల్ దగ్గరికి వెళ్లలేదని హరీశ్ చేసిన కామెంట్లపై ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘నేనో పైలెట్‌‌‌‌‌‌‌‌ను. హెలికాప్టర్లపై నాకు మోజు లేదు” అని అన్నారు.