
నాగర్ కర్నూల్/మహబూబ్ నగర్/అమ్రాబాద్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్ చివరి వరకు రెస్క్యూ బృందాలు చేరుకున్నాయి. టన్నెల్ లోపలి విజువల్స్ తాజాగా బయటికొచ్చాయి. SLBC టన్నెల్లో కార్మికులు చిక్కుకున్న ప్లేస్కు మరో అర కిలోమీటరు దూరంలోనే రెస్క్యూ టీమ్స్ ఉన్నట్లు తెలిసింది.
ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. రెస్క్యూ ఆపరేషన్లో మార్కోస్ టన్నెల్ టీం కూడా భాగమయింది. ఇండియన్ మెరెయిన్ కమాండో ఫోర్స్ నేల, నీరు, ఆకాశంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేస్తుంటుంది. ఆపరేషన్ మార్కోస్ రంగంలోకి దిగిన క్రమంలో టన్నెల్లో చిక్కుకున్న కార్మికులు బయటకు వస్తారని అందరూ ఆశిస్తున్నారు.
ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకునేందుకు సొరంగంపై నుంచి కాని, పక్క నుంచి కానీ వెళ్లే మార్గాలను కూడా అన్వేషిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. శనివారం (ఫిబ్రవరి 22) ఉదయం కూలిపోయిన టన్నెల్లో ఎనిమిది మంది చిక్కుకున్నారు. వారితో ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు ఉన్నారు. ప్రమాదం జరిగిన తర్వాత కొన్ని వందల టన్నుల బరువున్న టన్నెల్ బోరింగ్ మెషిన్ దాదాపు 200 మీటర్ల దూరం కొట్టుకుపోయిందని, నీరు ఉప్పొంగడం వల్ల ఇది జరిగిందని అధికారులు చెబుతున్నారు.
రెస్క్యూ టీమ్లు లోపలికి వెళ్లిన ప్రతిసారి దాదాపు ఐదు గంటల వరకు అక్కడే వర్క్ చేస్తున్నాయి. ఒక షిఫ్ట్ టీమ్ అర్ధరాత్రి 2 గంటలకు లోపలికి వెళితే తిరిగి ఉదయం 8 గంటలకు బయటకు వస్తోంది. మరో టీం మధ్యాహ్నం 12 గంటలకు లోపలికి వెళితే రాత్రి తిరిగొస్తుంది. శిథిలాలను తీసేందుకు హిటాచీని తీసుకెళ్లారు. వెంట 30 మంది కార్మికులు కూడా వెళ్లారు.
సహాయక చర్యల్లో పాల్గొంటున్న రెస్క్యూ టీమ్మెంబర్స్కు అక్కడే భోజనం, నీరు అందిస్తున్నారు. టన్నెల్ ఉన్న ప్రాంతం వద్దకు వెళ్లడానికి మెయిన్ రోడ్డు నుంచి నాలుగు కిలోమీటర్లు అటవీ మార్గంలో వెళ్లాల్సి వస్తోంది. దీంతో అక్కడ సెల్ఫోన్ సిగ్నల్స్లేకపోవడంతో ఓ ప్రైవేట్కంపెనీ టవర్ను ఏర్పాటు చేసింది. అలాగే టన్నెల్లో సగం వరకే సిగ్నల్ వస్తుండడంతో వాకిటాకీలు వినియోగిస్తున్నారు.