
మహబూబ్‌నగర్ / నాగర్‌కర్నూల్ / అమ్రాబాద్: SLBC టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికులను కాపాడేందుకు SLBC సొరంగంలోకి ప్రత్యేకంగా స్నిఫర్ డాగ్స్ను తీసుకెళ్లారు. ఘటన జరిగినప్పటి నుంచి స్పాట్లో డాగ్ స్క్వాడ్స్ ఉన్నాయి. అయితే.. వాసనల్ని పసిగట్టడంలో స్నిఫర్ డాగ్స్ వెరీ స్పెషల్. అతి సూక్ష్మ శబ్దాల్ని కూడా పసిగట్టగలిగే వినికిడి శక్తి స్నిఫర్ డాగ్స్ సొంతం. సొరంగంలో కార్మికుల్ని స్నిఫర్ డాగ్స్ గుర్తిస్తాయనే ఆశతో స్నిఫర్ డాగ్స్ను రంగంలోకి దించారు. 10 నుంచి 12 అడుగుల శిథిలాల కింద వచ్చే వాసనను కూడా స్నిఫర్ డాగ్స్ పసిగడతాయి.
కేరళలోని వయనాడ్ను రాత్రికి రాత్రి వరదలు ముంచెత్తిన తర్వాత శిథిలాల కింద అనేక మందిని స్నిఫర్ డాగ్స్ గుర్తించాయి. ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు మృతదేహాల జాడను పసిగట్టడంలో స్నిఫర్ డాగ్స్ కీలక పాత్ర పోషించిన సందర్భాలు ఉన్నాయి. గతంలో వీఐపీల భద్రత, ల్యాండ్ మైన్స్ కనిపెట్టడానికి, నేరస్తులను గుర్తించడంలోనూ డాగ్ స్క్వాడ్ కీలక పాత్ర పోషించాయి. ఇదిలా ఉండగా.. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది ఆచూకీ కోసం 4 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నారు.
ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్స్ రెస్క్యూ ఆపరేషన్లో తలమునకై పోయాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్‌కు అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నాయి. -ఘటనా స్థలం వద్ద సీపేజ్ఆగకపోవడం, పైనుంచి ఇప్పటికీ మట్టి పడ్తుండడంతో బురద మరింత ముందుకొస్తున్నది. ఆదివారం13.4 కిలోమీటర్ల దాకా వెళ్లిన రెస్క్యూ టీమ్లు.. తాజాగా బురద, శిథిలాలు కొట్టుకురావడంతో వెనక్కి 11వ కిలోమీటర్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి. లోపలికి వెళ్లలేకపోతున్నాయి.
ఢిల్లీ నుంచి తెప్పించిన 12 మంది ర్యాట్ హోల్ మైనర్స్కూడా బురద లోంచి లోపలికి వెళ్లే పరిస్థితి లేదు. దీంతో కొండ పై భాగం నుంచి గానీ, పక్కల నుంచి గానీ హోల్చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగి మూడు రోజులు దాటిపోతున్నా.. ఇప్పటి వరకు రెస్క్యూ టీమ్స్స్పాట్వద్దకు చేరుకోలేకపోయాయి. ఆదివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో మంత్రి జూపల్లి కృష్ణారావు.. యాక్సిడెంట్ జరిగిన స్పాట్ నుంచి తిరిగి వచ్చినప్పుడు 200 మీటర్ల వరకు ఉన్న మట్టి, బురద, శిథిలాలు.. సోమవారం ఉదయం 11వ కిలోమీటరు వరకు కొట్టుకొచ్చింది. ప్రమాదం జరిగిన స్పాట్ నుంచి 11వ కిలోమీటరు వరకు కొట్టుకొచ్చిన బురద, శిథిలాలు నాలుగు మీటర్ల ఎత్తుకు చేరింది.
ఆదివారం 13.5 కిలోమీటరు వరకు అందుబాటులో ఉన్న కన్వేయర్ బెల్టు కూడా తాజాగా బురదలో కూరుకుపోయింది. దీంతో రెస్క్యూ టీమ్స్ముందుకు వెళ్లలేకపోతున్నాయి. బయటి నుంచి లోపలికి వెళ్లడానికి అనువైన మార్గం దొరకక సహాయ బృందాలు ఇబ్బందులు పడ్తున్నాయి. ప్రమాదం జరిగిన చోట దాదాపు ఐదు వేల క్యూబిక్ మీటర్ల మట్టి పేరుకుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం టన్నెల్లో రోజుకు వంద క్యూబిక్ మీటర్ల మట్టిని తోడిపోసే వ్యవస్థ మాత్రమే ఉంది. దీంతో ప్రస్తుతం మట్టి, బురదను టన్నెల్ నుంచి బయటకు తరలించడం రెస్క్యూ టీమ్స్కు సవాల్గా మారింది.