
- టన్నెల్‌లో పరిస్థితిని పరిశీలించిన చెన్నై ఐఐటీ ఎక్స్‌పర్ట్స్
ఎస్‌ఎల్‌బీసీ నుంచి వెలుగు టీం :ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో చిక్కుకున్న ఎనిమిది మంది జాడ కనిపెట్టేందుకు రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే వివిధ రకాల టీమ్స్ సహాయక చర్యల్లో పాల్గొంటుండగా, తాజాగా ఐఐటీ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు కేరళ నుంచి క్యాడవర్ స్నిఫర్ డాగ్స్‌ను తీసుకొచ్చారు.
మరో వైపు టన్నెల్ లోపల 12వ కిలోమీటర్ వరకే ఉన్న కన్వేయర్ బెల్ట్‌ను 13.300 కిలోమీటర్ వరకు పొడిగించేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, సింగరేణి టీమ్స్ ప్రయత్నిస్తున్నాయి. జేపీ కంపెనీలో ప్రాజెక్ట్ ఇంజినీర్‌గా పనిచేస్తూ, టన్నెల్‌లో చిక్కుకున్న శ్రీనివాస్ కుటుంబ సభ్యులు గురువారం కంపెనీ క్యాంప్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఉత్తర్‌ప్రదేశ్ నుంచి వచ్చిన తాము, ఏ విషయం తెలియకుండా ఎన్ని రోజులు ఉండాలని ప్రశ్నించారు.
ప్రమాదస్థలాన్ని పరిశీలించిన ఎక్స్‌పర్ట్స్
టన్నెల్ వద్ద రెస్క్యూ ఆపరేషన్‌లో ఉన్న మద్రాస్ ఇంజినీరింగ్ రెజిమెంట్‌కు అదనంగా డోగ్రా రెజిమెంట్‌కు చెందిన సభ్యులు సైతం గురువారం టన్నెల్ వద్దకు చేరుకున్నారు. వీరంతా కలిసి మధ్యాహ్నం మూడు గంటల టైంలో టన్నెల్ లోపలికి వెళ్లి అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ప్రమాదం జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు మొత్తం 13 రోజుల్లో చేసిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రెస్క్యూ ఆపరేషన్ యాక్షన్ ప్లాన్‌పై చర్చించారు. శుక్రవారం ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ మొదలు పెట్టనున్నారు. చెన్నై ఐఐటీ ఎక్స్‌పర్ట్స్, నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ, ఎన్‌జీఆర్‌ఐ సైంటిస్ట్‌లు టన్నెల్ లోపల 14వ కిలోమీటర్ వద్ద రాతి, మట్టి నమూనాల సేకరణతో పాటు, నీటి ఊట జాడలపై అధ్యయనం చేస్తున్నారు.
టన్నెల్ వద్దకు క్యాడవర్ డాగ్స్
కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన వరదలకు బురదలో కూరుకుపోయిన వారి ఆచూకీ కనిపెట్టడంలో క్యాడవర్ డాగ్స్ ముఖ్య పాత్ర పోషించాయి. మానవ శరీర అవశేషాలు, కుళ్లిపోయిన మృతదేహాలు, 15 అడుగుల కింద బురదలో కూరుకుపోయిన డెడ్‌బాడీలను సైతం గుర్తించడం, గాలిలో, భూమిలోపల వాసనను పసి గట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండడం ఈ డాగ్స్ ప్రత్యేకత.
ఈ డాగ్స్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లలో కేరళ నుంచి దోమలపెంటలోని టన్నెల్ వద్దకు గురువారం తీసుకొచ్చారు. టన్నెల్‌లోని 13.600 కిలోమీటర్ వద్ద, టీబీఎం పరిసరాల్లో మట్టి, బురదలో కూరుకుపోయిన వారిని ఈ డాగ్స్ గుర్తిస్తాయని భావిస్తున్నారు.