
నాగర్ కర్నూల్: ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహయక చర్యలు మరింత వేగవంతం అయ్యాయి. ప్రమాదానికి గురైన టన్నెల్ కన్వేయర్ బెల్ట్‌ను అధికారులు శాయశక్తులా ప్రయత్నించి ఎట్టకేలకు పునరుద్ధించారు. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరణతో రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అయ్యింది. టన్నెల్లో పేరుకుపోయిన బురద మట్టిని బయటకు పంపిస్తున్నారు. గంటకు 800 టన్నుల మట్టిని బయటికి డంపింగ్ చేస్తున్నారు.
ఎస్ఎల్బీసీ రెస్య్కూ ఆపరేషన్ క్లిష్టతరం కావడంతో ఢిల్లీ నుంచి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రతినిధుల బృందం రంగంలోకి దిగింది. టన్నెల్ వద్ద ప్రమాద ఘటన స్థలాన్ని పరిశీలించి.. సహయక చర్యల బృందాలకు కీలక సూచనలు చేసింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న సహయక చర్యలు.. కన్వేయర్ బెల్ట్ పునరుద్ధరించడంతో మరో ఒకటి, రెండు రోజుల్లో రెస్య్కూ ఆపరేషన్లో కీలక పురోగతి సాధించినున్నట్లు అధికారులు చెబుతున్నారు.
కాగా, నాగర్ కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ దగ్గర 2025, ఫిబ్రవరి 22 ఉదయం ప్రమాదం జరిగింది. రిటైనింగ్ వాల్ కడుతుండగా 14వ కిలో మీటర్ వద్ద 3 మీటర్ల మేర పైకప్పు కుంగిపోయింది.. రిటైనింగ్ వాల్ కూలి టన్నెల్‌లో రింగులు విరిగిపడడంతో.. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ ఘటనలో 8 మంది కార్మికులు టన్నెల్లో చిక్కుకుపోయారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు టన్నెల్లో చిక్కుకుపోయిన కార్మికులను కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. టన్నెల్లో భారీగా బురద, నీరు ఉబకడంతో పాటు టన్నెల్ బోరింగ్ మిషన్ పరికరాలు రెస్య్కూ ఆపరేషన్ ఛాలెంజింగ్‌గా మారాయి. అయినప్పటికీ సహయక బృందాలు తీవ్రంగా కృషి చేసి ఘటన స్థలం వద్దకు చేరుకున్నాయి. టన్నెల్ వద్ద 11 రోజులుగా సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. కన్వేయర్ బెల్ట్ పునరుద్దరించడంతో సహయక చర్యలు ఊపందుకున్నాయి.