చివరి అంకానికి రెస్క్యూ ఆపరేషన్..! ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు చేరిన సహాయక బృందాలు

చివరి అంకానికి రెస్క్యూ ఆపరేషన్..! ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు చేరిన సహాయక బృందాలు
  • అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు 
  • ఆక్సిజన్ అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చిన టీమ్​లు
  • గ్యాస్  కట్టర్లతో టీబీఎం శిథిలాల తొలగింపు పనులు ముమ్మరం
  • నేడు లోపల చిక్కుకున్నవారి దగ్గరి దాకా వెళ్లే అవకాశం
  • కూలుతున్న మట్టి పెల్లలతో జాగ్రత్తగా ఉండాలని ఎన్జీఆర్ఐ హెచ్చరికలు
  •  అంతకుముందు ఉత్త చేతుల్తో తిరిగి వచ్చిన ర్యాట్​ హోల్​ మైనర్స్​

 నాగర్​కర్నూల్/మహబూబ్​నగర్/అమ్రాబాద్, వెలుగు: ఎస్ఎల్​బీసీ టన్నెల్‎లో  రెస్క్యూ ఆపరేషన్​చివరి అంకానికి చేరుకుంటోంది. మంగళవారం రాత్రి ఘటనాస్థలానికి 15 మీటర్ల వరకు సహాయక బృందాలు చేరుకున్నాయి. అక్కడంతా బురద, మట్టి పెల్లలతో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్మీ, ఎన్​డీఎఫ్, ఎస్​డీఎఫ్ టీమ్‎లతో పాటు వెళ్లిన కార్మికుల్లో కొందరు ఘటనా స్థలానికి దరిదాపుల్లోకి వెళ్లారు. కానీ, అక్కడ ఆక్సిజన్​అందకపోవడంతో హుటాహుటిన వెనక్కి వచ్చేశారు. నేడు ఆక్సిజన్​సాయంతో ఘటనా స్థలానికి మరింత చేరువగా వెళ్లే అవకాశముందని చెప్తున్నారు. 

మరోవైపు టన్నెల్‎కు అడ్డుగా పేరుకుపోయిన టీబీఎం(టన్నెల్​బోర్​ మిషన్) శిథిలాలను తొలగించేందుకు ఎల్అండ్ టీ, నవయుగ, మేఘా కంపెనీ ఎక్స్‎పర్ట్స్​ శ్రమిస్తున్నారు. మంగళవారం ఉదయం ఎనిమిది గంటలకు వీరంతా టన్నెల్‎లోకి వెల్డింగ్ మెషీన్లు, కట్టర్లను తీసుకెళ్లి ఒక్కొక్కటే కట్ చేస్తున్నారు. బుధవారం ఉదయం కల్లా కన్వేయర్​ బెల్టును పునరుద్ధరించి డెబ్రిస్‎ను బయటకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

మరోవైపు సెగ్మెంట్​బ్లాక్స్​నుంచి ధారాపాతంగా వస్తున్న సీపేజ్, కూలుతున్న మట్టి పెల్లలతో టన్నెల్‎లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో రెస్క్యూ ఆపరేషన్​చాలా డేంజర్ అని స్వయంగా​ఎన్జీఆర్ఐ(నేషనల్​జియో ఫిజికల్​రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్)నిపుణులు హెచ్చరించడంతో సహాయక బృందాలు అత్యంత జాగ్రత్తతో ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. 

రెస్క్యూ ఆపరేషన్‎లో 11 టీమ్‎లు.. 

టన్నెల్‎లో చిక్కుకుపోయిన ఎనిమిది మందిని రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‎కు నాలుగో రోజు మంగళవారం అడుగడుగునా అవాంతరాలు ఎదురయ్యాయి. టన్నెల్​లోంచి గంటకు 3,600 నుంచి 5వేల లీటర్ల దాకా వస్తున్న ఊటనీరు, 200 మీటర్ల మేర పేరుకుపోయిన బురద, ఘటనా స్థలానికి వెళ్లకుండా టన్నెల్‎లో బిగుసుకుపోయిన టీబీఎం శిథిలాలు, కూలిన ఎయిర్​సప్లై పైప్​లైన్, కన్వేయర్​బెల్టు విడిభాగాలతో టన్నెల్​లోపలి దృశ్యాలు భయానకంగా ఉన్నాయని రెస్క్యూ ఆపరేషన్‎లో పాల్గొంటున్న సిబ్బంది వెల్లడించారు. 

మంగళశారం రెస్య్కూ ఆపరేషన్‎లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఫైర్, సింగరేణి, హైడ్రా, ఇండియన్​ ఆర్మీ , ఇంజనీరింగ్​ విభాగం, నేవి, మార్కోస్ కమెండోలతో పాటు ఎల్అండ్​టీ టన్నెల్​ఎక్స్​పర్ట్,​ క్రిస్​కూపర్, రాబిన్స్ కంపెనీ, నవయుగ, మెగా కంపెనీల టీంలు పాల్గొన్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు టన్నెల్‎లోకి వెళ్లిన ఆయా బృందాలు అక్కడే ఉంటూ సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. 

ఘటనా స్థలిలో బురద, మట్టిని తీసేందుకు సోమవారం టన్నెల్‎లోకి పంపిన ఎక్స్​కవేటర్​ను మంగళవారం వెనక్కి తీసుకొచ్చారు. టన్నెల్‎లోకి వెళ్లాక ఇది కదలలేని పరిస్థితి ఉండడంతో ఆ స్థానంలో మధ్యాహ్నం మినీ హిటాచీని లోనికి పంపించారు. లోపలి నుంచి పెద్దమొత్తంలో ఊట నీరు వస్తుండడంతో ఎప్పటికప్పుడు డీ వాటరింగ్​ ప్రక్రియ కొనసాగిస్తున్నారు. ఇందుకోసం మంగళవారం ఆఫీసర్లు  100 హెచ్​పీ కెపాసిటీ ఉన్న భారీ పంపును ఏర్పాటు చేశారు.

వెనక్కి వచ్చిన ర్యాట్​హోల్​ మైనర్స్​..

జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్​ నుంచి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా పిలిపించిన ర్యాట్​హోల్​మైనర్స్ టీమ్​ సభ్యులు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు లోకో ట్రైన్​ద్వారా టన్నెల్‎లోకి బయల్దేరి వెళ్లారు. పెద్దపెద్ద తాళ్లు, సుత్తెలు, పారలు, ఇనుప రాడ్లు వెంట తీసుకుపోయారు. కానీ లోపలి పరిస్థితులను చూసిన తర్వాత చేతులెత్తేశారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో బయటికి వచ్చిన ర్యాట్​ మైనర్స్ టీం లీడర్​ఫిరోజ్​ఖురేషీ  మాట్లాడుతూ.. టన్నెల్​లోపల బురద, నీటి ప్రవాహం ఎక్కువగా ఉందని,  ఇలాంటి పరిస్థితుల్లో పని చేసిన అనుభవం తమకు లేదని తేల్చిచెప్పారు.

వీరి వెంట పాలమూరు–-రంగారెడ్డి ప్రాజెక్ట్​టన్నెల్‎లో పని చేసిన టెక్నికల్​టీంను సైతం లోపలికి పంపించారు. వారు కూడా టన్నెల్​ లోపల పరిస్థితులు ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నాయని వాపోయారు. ఇక ఎస్డీఆర్ఎఫ్‎కు చెందిన స్నిప్ఫర్ డాగ్​టీమ్‎ను కూడా టన్నెల్‎లోకి తీసుకెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఓ డాగ్‎ను లోకో ద్వారా లోపలికి తీసుకెళ్లారు. ఈ డాగ్  టన్నెల్‎లో​చిక్కుకున్న వారి బట్టలు, రక్తం వానసను పసిగట్టి.. వారు ఎక్కడున్నారో ఐడెంటిఫై చేస్తుందని భావించినా బురద నీటి కారణంగా గుర్తించలేకపోయిందని తెలిసింది.

మా వాళ్లు ఎట్లున్నరో..?

ఎస్ఎల్​బీసీ టన్నెల్​ప్రమాదంలో చిక్కుకుపోయిన వారి కుటుంబ సభ్యులు మంగళవారం జేపీ అసోసియేట్స్​క్యాంప్​ఆఫీస్‎కు చేరుకున్నారు. పంజాబ్‎కు చెందిన గురుప్రీత్​సింగ్​బావ సత్యపాల్​సింగ్, జార్ఖండ్‎కు చెందిన సంతోష్​ సాహూ, అంజూ సాహూ, జగదేశ్​కుటుంబ సభ్యులు, ఉత్తరాఖండ్‎కు చెందిన సందీప్ సాహూ తండ్రి జీతూ సాహూ ఉన్నారు. నెలల తరబడి ఇక్కడే పని చేస్తున్న తమవారు వస్తారన్న ఆశతో ఉన్నామని కన్నీరుమున్నీరయ్యారు. టన్నెల్‎లో చిక్కుకున్న వారిలో ఝార్ఖండ్​రాష్ట్రం వాళ్లు ఎక్కువగా ఉండడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం బాధితుల కుటుంబ సభ్యుల వెంట ప్రత్యేక అధికారిని తోడుగా పంపించింది. 

మా బావమరిది భార్యకు ఏం చెప్పాలి..

రాబిన్స్​కంపెనీలో ఆపరేటర్‎గా పనిచేస్తున్న గురుప్రీత్​సింగ్‎కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారని ఆయన బావ సత్యపాల్​ సింగ్​ తెలిపారు. 39 ఏళ్ల వయస్సు ఉన్న తన బావమరిది కుటుంబం కోసం అన్నీ వదులుకుని ఇంత దూరం వచ్చాడని కన్నీటి పర్యంతమయ్యాడు. అసలు ఉన్నాడో లేడో కూడా తెలియడం లేదంటున్నారు. ఆయన భార్య, పిల్లలకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదని వాపోయాడు. తెలంగాణ సీఎం జోక్యం చేసుకుని ఈ బాధ నుంచి విముక్తి కలిగించాలని అభ్యర్థించాడు.

నా కొడుకు ఏమయ్యాడో.. 

కొడుకు ప్రమాదంలో చిక్కుకున్నాడని సమాచారం రావడంతో బంధువులతో కలిసి వచ్చానని టన్నెల్‎లో చిక్కుకున్న సంతోష్​సింగ్​ తండ్రి జీతూసింగ్​ తెలిపారు. నాలుగు రోజులవుతున్నా.. బతికున్నాడో లేదో కూడా చెప్పడం లేదని వాపోయారు. కొడుకు రెక్కల కష్టంపై తమ కుటుంబం బతికిందని, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని పేర్కన్నాడు.