
అమ్రాబాద్, వెలుగు: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ వేగవంతంగా కొనసాగుతోంది. డేంజర్ జోన్ డీ 2 వద్ద తవ్వకాలు వేగంగా జరుగుతున్నట్లు టన్నెల్ స్పెషల్ ఆఫీసర్ శివ శంకర్ లోతేటీ పేర్కొన్నారు. మంగళవారం టన్నెల్ వద్ద సహాయక చర్యలను ఆయన పరిశీలించారు. రెస్క్యూ టీమ్ హెడ్స్ తో ఆయన సమావేశమై పరిస్థితులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 53 వ రోజు టన్నెల్ ప్రమాదంలో శిథిలాల కింద చిక్కుకున్న ఆరుగురి ఆచూకీ కోసం నిరంతరం రెస్క్యూ టీమ్ కృషి చేస్తుందన్నారు.
5 ఎస్కవేటర్లు, బాబ్ క్యాట్ లు మట్టిని తవ్వి కన్వేయర్ బెల్ట్ సాయంతో బయటకు పంపుతున్నారన్నారు. టీబీఎం శకలాలను కత్తిరించి లోకో ట్రెయిన్ ద్వారా బయటకు పంపుతున్నామన్నారు. నిరంతరాయంగా వస్తున్న నీటి ఊటను భారీ మోటార్ల ద్వారా బయటకు పంపింగ్ చేస్తున్నట్లు తెలిపారు. సహాయక చర్యలు మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో సింగరేణి మైన్స్ జనరల్ మేనేజర్ బైద్య, ఎస్ఆర్డిఎఫ్, జేపీ కంపెనీ ఇంజనీర్లు, హైడ్రా, తదితరులు పాల్గొన్నారు.