మరో రెండు రోజుల్లో ఎస్ఎల్​బీసీ ఆపరేషన్ కొలిక్కి! : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి

మరో రెండు రోజుల్లో ఎస్ఎల్​బీసీ ఆపరేషన్ కొలిక్కి!  : మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి
  • ఘటనా స్థలంలో 200 మీటర్ల పొడవుతో15 ఫీట్ల ఎత్తు వరకు సిల్ట్: మంత్రి ఉత్తమ్​
  • టన్నెల్​ బోరింగ్​ మిషన్​ అడ్డుగా కూరుకుపోయింది
  • రెస్క్యూ టీమ్స్​కు రిస్క్​ ఉండడం వల్లే సహాయచర్యలు లేట్​
  • గ్యాస్, ప్లాస్మా కట్టర్లతో టీబీఎం శిథిలాలనూ తొలగిస్తున్నం
  • స్పీడ్​గా డీ వాటరింగ్.. 2  రోజుల్లో బురద తొలగింపు పూర్తి

నాగర్​ కర్నూల్, వెలుగు: ఎస్ఎల్ బీసీ టన్నెల్​లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్​ మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని ఇరిగేషన్ శాఖ​ మంత్రి ఉత్తమ్​కుమార్​రెడ్డి పేర్కొన్నారు. ఘటనా స్థలంలో 200 మీటర్ల పొడవుతో15 ఫీట్ల ఎత్తు వరకు సిల్ట్​ఉన్నదని, అడ్డుగా టన్నెల్​బోరింగ్​ మిషన్ (టీబీఎం) ​కూరుకుపోయిందని చెప్పారు.

సీపేజ్​భారీగా వస్తుండడం, పెచ్చులు ఊడిపడ్తుండడంతో రెస్క్యూ టీమ్​లకు రిస్క్​ ఉందని ఎక్స్​పర్ట్స్​ హెచ్చరించడంతో సోమవారం సహాయ చర్యలు స్లో చేశామని, మంగళవారం నుంచి ‘లో రిస్క్  రెస్క్యూ’ ఆపరేషన్​ ప్రారంభించామని వెల్లడించారు.  బుధవారం రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న అధికారులతో ఉత్తమ్​కుమార్​రెడ్డి రివ్యూ  నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో  ఆయన మాట్లాడారు. డీ వాటరింగ్ స్పీడప్​చేశామని, 2 రోజుల్లో బురద తొలగింపు పనులు పూర్తిచేస్తామని చెప్పారు.

ఇప్పటికే గ్యాస్, ప్లాస్మా కట్టర్లతో టీబీఎం శిథిలాలనూ తొలగిస్తున్నామని తెలిపారు. ‘‘లోపల చిక్కుకున్న 8 మందిపై పూర్తిగా ఆశలు వదులుకోలేదు. వారంతా బతికే ఉన్నారనే ఆశతో పనిచేస్తున్నాం. 2 రోజుల్లో ఆపరేషన్​ ముగిస్తాం. లోపలికి వెళ్లివచ్చిన ఆర్మీ, నేవీ, ఎన్​డీఆర్​ఎఫ్​, ర్యాట్​హోల్​మైనర్స్​ ఇచ్చిన సమాచారంతో ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని  వెల్లడించారు.

యాక్షన్​ ప్లాన్​ రెడీ..

టన్నెల్ లో సంఘటనా స్థలం దగ్గరిదాకా వెళ్లి వచ్చిన ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్​ ప్రతినిధులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అర్వింద్​ కుమార్, జేపీ అసోసియేట్స్, రాబిన్స్​ ప్రతినిధులు, ర్యాట్​హోల్​మైనర్స్​తో మాట్లాడిన  తర్వాత లోపలి పరిస్థితిపై బుధవారం ఒక అంచనాకు వచ్చామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. ఇందులో భాగంగానే ‘రెస్క్యూ, రిలీఫ్​ యాక్షన్​ ప్లాన్’ రెడీ చేశామని వెల్లడించారు.

రెస్క్యూ టీమ్స్​కు తక్కువ రిస్క్​ ఉండేలా చూసుకుంటూ రాబోయే2 రోజుల్లో ఆపరేషన్​ కంప్లీట్​ చేస్తామని చెప్పారు. టన్నెల్​లో నుంచి సిల్ట్​ తొలగించడంతోపాటు ధ్వంసమైన టీబీఎం విడిభాగాలను గ్యాస్, ప్లాస్మా కట్టర్​​తో కట్​ చేసి.. బయటకు తెస్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం నుంచే శిథిలాల తొలగింపు మొదలైందని చెప్పారు. ఈ ఆపరేషన్​ కోసం దేశంలో వివిధ టన్నెల్స్​కోసం పనిచేసిన ఎక్స్​పర్ట్స్​ను, టన్నెల్​ ప్రమాదాల్లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న వారిని పిలిపించినట్టు చెప్పారు.  

వీరంతా ప్రస్తుత రెస్క్యూ ఆపరేషన్​లో తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఘటన జరిగిన 3 గంటల నుంచి మంత్రులంతా ఇక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్​ను పర్యవేక్షిస్తున్నామని  గుర్తుచేశారు.  రాత్రి, పగలు తేడా లేకుండా సహాయక చర్యలను  కో ఆర్డినేట్​చేస్తున్న నాగర్​ కర్నూల్​ కలెక్టర్​ బీ  సంతోష్​, ఎస్పీ గైక్వాడ్​ వైభవ్​ రఘునాథ్​ను మంత్రి ఉత్తమ్​ ప్రశంసించారు. అందరి శ్రమ ఫలించి లోపల చిక్కుకున్నవారు క్షేమంగా బయట పడాలని ఆకాంక్షించారు.  

మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్​ రెడ్డి..జడ్చర్ల ఎమ్మెల్యేతో కలిసి శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్​ నుంచి సిబ్బంది క్షేమంగా బయటపడాలని మల్లన్నను వేడుకున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ ఎంపీ మల్లు రవి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డి తదితరులున్నారు.