
ఎస్ఎల్బీసీ నుంచి వెలుగు టీం:ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఆదివారం ఎరక్టర్ ఆపరేటర్గురుప్రీత్ సింగ్ డెడ్‌బాడీని వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగిలిన వారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సౌత్ సెంట్రల్ ర్వైల్వే బృందం సభ్యులు మూడు షిప్టుల్లో గ్యాస్, థర్మల్, ప్లాస్మా మెషీన్లతో టీబీఎం వెనక భాగాన్ని కట్ చేస్తున్నారు. కట్‌చేసిన విడిభాగాలను లోకో ట్రైన్ ద్వారా బయటకి తరలిస్తున్నారు. పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను కన్వేయర్ బెల్ట్ ద్వారా పంపుతున్నారు.
టన్నెల్లో నీటిని తోడి వేసేందుకు ప్రతి రెండు కిలోమీటర్లకు డీవాటరింగ్ డ్రైన్లు ఏర్పాటు చేశారు. 13.500 కిమీల వద్ద ఒక అడుగు ఎత్తులో నీటి ఊట వస్తోంది. ఈ నీటిని తరలించేందుకు మూడు 3హెచ్‌పీ, ఒక 5 హెచ్ పీ, ఒక 7 హెచ్‌పీ మోటార్లను 24 గంటలు నడిపిస్తున్నారు. నిమిషానికి 300 గ్యాలన్ల నీటి ఊట వస్తున్నట్లు అంచనా వేశారు. టన్నెల్ లోపల ఒక నిమిషం మోటర్లు ఆగినా నీటి ప్రవాహం పెరుగుతోందని సింగరేణి రెస్క్యూ టీం ద్వారా తెలిసింది.
మూడవ రోజు టన్నెల్లోకి వెళ్లిన క్యాడవర్ డాగ్ స్క్వాడ్ మాయ, మర్ఫీలు టీబీఎం పరిసరాల్లోనే తిరుగాడాయి. టన్నెల్ వెనక భాగం, నీటి గుంటలో వాసన చూశాయి. టన్నెల్లో మట్టి కూలి పడే ప్రమాదం లేకుండా దుంగలను అడ్డంగా పేర్చుతున్నారు. సింగరేణి నుంచి తెప్పించిన అడ్వాన్స్ హైడ్రాలిక్ ఎక్విప్మెంట్ను ఉపయోగిస్తున్నారు. సింగరేణి రెస్క్యూ టీం జీఎం బైద్య టీబీఎం పక్కన తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట ర్యాట్ హోల్ మైనర్లతో తవ్విస్తున్నారు. 60 మంది గంట సేపు కష్టపడినా రెండు నుంచి మూడు అడుగుల కంటే ఎక్కువ మట్టిని తవ్వలేని పరిస్థితి. సౌత్ సెంట్రల్ రైల్వే ఇంజనీర్ల టీం నీటిలో కూడా మెషీన్లను కట్చేయగలిగే థర్మల్ కట్టర్లను వినియోగిస్తున్నారు.
డి2 ప్రదేశం చాలా రిస్క్..
టీబీఎం పక్కన 8 మీటర్ల మట్టి కింద నలుగురు చిక్కుకుని ఉంటారని ఎన్జీఆర్ఐ జీపీఆర్ స్కానర్లు, కేరళ క్యాడవర్ డాగ్స్ గుర్తించిన డి2 ప్రదేశం హై రిస్క్ ఏరియాగా పేర్కొంటున్నారు. టీబీఎం ఏసీ క్యాబిన్‌ను కట్ చేసి ఇక్కడి నుంచే గురుప్రీత్‌సింగ్ డెడ్‌బాడీని బయటకుతీశారు. మరో ముగ్గురు ఈ ప్రాంతంలోనే కూరుకుపోయి ఉంటారని భావించి తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడికి సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్లను మినహా ఇతరులను అనుమతించడం లేదు. డి1 పాయింట్ వద్ద రెండు ప్రదేశాల్లో మరో నలుగురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నా, ఆ ఏరియా టీబీఎం కింద చూపిస్తోంది. ఇదిలాఉంటే రోబోటిక్ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఎస్ఎల్బీసీకి చేరుకుంటారని సమాచారం.