ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూకు ఆటంకంగా మారిన లోకో ఇంజిన్‌‌

ఎస్‌‌ఎల్‌‌బీసీ రెస్క్యూకు ఆటంకంగా మారిన లోకో ఇంజిన్‌‌
  • టన్నెల్‌‌లోకి మరోసారి క్యాడవర్‌‌ డాగ్స్‌‌
  • మనోజ్‌‌కుమార్‌‌ డెడ్‌‌బాడీ,రూ. 25 లక్షల చెక్కు 
  • కుటుంబ సభ్యులకు అప్పగింత

అచ్చంపేట, వెలుగు : ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌లో ఉన్న మృతదేహాలను బయటకు తీసేందుకు లోపల చిక్కుకున్న లోకో ఇంజిన్‌‌ అడ్డంకిగా మారింది. ఈ ఇంజిన్‌‌ను తొలగిస్తే తప్ప సహాయక చర్యలు ముందుకు వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇంజిన్‌‌తో పాటు ఉన్న ఒక బోగీని కట్‌‌ చేయడంతో పాటు ట్రాక్‌‌పై ఉన్న మట్టి, శిథిలాలను కొంతమేర తొలగించినట్లు సమాచారం.

సహాయక చర్యలు చేపడుతున్న ప్రాంతంలో తీవ్ర దుర్వాసన వస్తోందని రెస్క్యూ సిబ్బంది చెబుతున్నారు. టన్నెల్‌‌లో చనిపోయిన వారిని గుర్తించేందుకు మరోసారి కాడవర్‌‌ డాగ్స్‌‌ను తీసుకెళ్లారు. సహాయక చర్యలపై ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి గురువారం ఉదయం 10 గంటలకు  ఆర్మీ ఆఫీసర్‌‌ వికాస్‌‌సింగ్‌‌, మేజర్‌‌ డాక్టర్‌‌ విజయ్‌‌కుమార్‌‌, సింగరేణి మైన్స్‌‌ రెస్క్యూ జీఎం బైద్య, కల్వకుర్తి ఆర్డీవో శ్రీనివాసులు, ఎన్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌, ఎస్‌‌డీఆర్‌‌ఎఫ్‌‌, సౌత్‌‌ సెంట్రల్‌‌ రైల్వే, హైడ్రా, జేపీ కంపెనీ, ర్యాట్‌‌ హోల్‌‌ మైనర్స్‌‌తో రివ్యూ నిర్వహించారు.

బాధిత కుటుంబానికి డెడ్‌‌బాడీ అప్పగింత 

ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ ప్రమాదంలో చనిపోయిన జయప్రకాశ్‌‌ అసోసియేట్స్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీ ప్రాజెక్ట్‌‌ ఇంజినీర్‌‌, ఉత్తరప్రదేశ్‌‌కు చెందిన మనోజ్‌‌కుమార్‌‌ డెడ్‌‌బాడీని అతడి భార్యకు అప్పగించినట్లు కలెక్టర్‌‌ బాదావత్‌‌ సంతోష్‌‌ తెలిపారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 25 లక్షల ఎక్స్‌‌గ్రేషియా చెక్కును సైతం మనోజ్‌‌ కుటుంబానికి అందజేశామన్నారు.