
SLBC టన్నెల్ రెస్క్యూలో కీలక పరిణామం చోటు చేసుకుంది.. టన్నెల్లో టిబిఎం ముందు భాగంలో ఒక డెడ్ బాడీ గుర్తించినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద ఒక కార్మికుడి చెయ్యి ని గుర్తించినట్లు రెస్క్యూ బృందాలు తెలిపాయి. డ్రిల్లింగ్ చేస్తూ మృతదేహాన్ని బయటకు తీసేందుకు తవ్వకాలు కొనసాగిస్తున్నాయి రెస్క్యూ బృందాలు. 16రోజులుగా జరుగుతున్న టన్నెల్ రెస్క్యూలో ఇది కీలక పరిణామం అని చెప్పాలి.
ఇదిలా ఉండగా టన్నెల్ రెస్క్యూ పనులను సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం... ఐఐటీ ఎక్స్‌పర్ట్స్‌తో పాటు కేరళ నుంచి క్యాడవర్ స్నిఫర్ డాగ్స్‌ను కూడా తెప్పించింది. కేరళలోని వయనాడ్‌లో ఇటీవల సంభవించిన వరదలకు బురదలో కూరుకుపోయిన వారి ఆచూకీ కనిపెట్టడంలో క్యాడవర్ డాగ్స్ ముఖ్య పాత్ర పోషించాయి.
మానవ శరీర అవశేషాలు, కుళ్లిపోయిన మృతదేహాలు, 15 అడుగుల కింద బురదలో కూరుకుపోయిన డెడ్‌బాడీలను సైతం గుర్తించడం, గాలిలో, భూమిలోపల వాసనను పసి గట్టగలిగే సామర్థ్యం కలిగి ఉండడం ఈ డాగ్స్ ప్రత్యేకత.
ఈ డాగ్స్‌ను ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రెండు హెలికాప్టర్లలో కేరళ నుంచి దోమలపెంటలోని టన్నెల్ వద్దకు గురువారం తీసుకొచ్చారు. టన్నెల్‌లోని 13.600 కిలోమీటర్ వద్ద, టీబీఎం పరిసరాల్లో మట్టి, బురదలో కూరుకుపోయిన వారిని ఈ డాగ్స్ గుర్తిస్తాయని భావిస్తున్నారు.