టన్నెల్‌‌లోకి మళ్లీ ఎన్‌‌జీఆర్‌‌ఐ టీమ్‌‌

టన్నెల్‌‌లోకి మళ్లీ ఎన్‌‌జీఆర్‌‌ఐ టీమ్‌‌
  • మరోసారి గ్రౌండ్‌‌ ప్రోబింగ్‌‌ స్కానర్‌‌తో పరీక్షించాలని నిర్ణయం !
  • మొరాయిస్తున్న కన్వేయర్‌‌ బెల్ట్‌‌
  • సిల్ట్‌‌ తొలగింపునకు లోకో ట్రాలీలే దిక్కు   
  • రోబోకు లింక్​ చేయనున్న లిక్విడ్‌‌ రింగ్‌‌ వాక్యూమ్‌‌ పంప్‌‌

నాగర్‌‌కర్నూల్/అచ్చంపేట, వెలుగు : ఎస్ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ ఆపరేషన్‌‌లో నేషనల్​జియోగ్రాఫికల్​రీసెర్చ్​ఇన్‌‌స్టిట్యూట్‌‌ మళ్లీ కీలకం కానుంది. ప్రమాదం జరిగిన టన్నెల్‌‌ చివరి ప్రాంతం నుంచి మృతదేహాలు కూరుకుపోయాయని భావిస్తున్న 14.3 కిలోమీటర్ల  పాయింట్​ దాకా ఎన్జీఆర్ఐకి చెందిన గ్రౌండ్​ ప్రోబింగ్​ స్కానర్‌‌తో పరీక్షించాలని నిర్ణయించినట్లు సమాచారం.

 టీబీఎం ముందు భాగంలో 8 మీటర్ల ఎత్తులో పేరుకుపోయిన మట్టి కింది భాగాలను గుర్తించడానికి ఇదే మార్గమని అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కేరళ క్యాడవర్‌‌ డాగ్స్‌‌ ఐదు మీటర్ల మట్టి లేదా బురద కింద చిక్కుకున్న మానవ అవశేషాలను మాత్రమే పసిగట్టగలుగుతాయి. టన్నెల్​లో 8 మీటర్లపైనే ఉన్న మట్టితో టీబీఎం బేస్​కింద ఆనవాళ్లను గుర్తించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నా ఆశించిన ఫలితాలు రావడం లేదు. 

డీ1 పాయింట్‌‌ను చేరుకోవడానికి టన్నెల్‌‌కు ఉన్న టీబీఎం విడిభాగాలను తొలగించడం పెద్ద టాస్క్‌‌గా మారింది. టీబీఎం మీదుగా అక్కడికి చేరుకోవడానికి సింగరేణి, ర్యాట్‌‌ హోల్‌‌ మైనర్లు మట్టిని తవ్వుతున్నారు. కన్వేయర్​బెల్ట్‌‌ను పునరుద్ధరించినా సాంకేతిక సమస్యతో రోజులో రెండు, మూడు గంటలకు మించి పని చేయడం లేదు. టన్నెల్​లో తొలిగించిన సిల్ట్, విడిభాగాలను 500 మీటర్ల వరకుమోస్తున్నారు. అక్కడి నుంచి లోకో ట్రాలీల ద్వారా బయటికి తెస్తున్నారు.

టన్నెల్‌‌లోకి అన్వి రోబోటిక్‌‌ టీమ్‌‌

అన్వి రోబోటిక్‌‌ సంస్థ ప్రతినిధుల బృందం శనివారం టన్నెల్‌‌ లోపలికి వెళ్లారు. టన్నెల్‌‌లో ఉన్న అటానమస్​హైడ్రాలిక్​పవర్​రోబోతో తవ్వకాలు చేపట్టిన తర్వాత మట్టి, రాళ్లను ఎత్తిపోయడానికి రోబోకు సపోర్ట్‌‌గా 40హెచ్‌‌పీ మోటార్​ కెపాసిటీతో లిక్విడ్​రింగ్​వ్యాక్యూమ్​ పంప్‌‌ను సిద్ధం చేస్తున్నారు. ఎల్ఆర్‌‌వీపీని టన్నెల్‌‌లో కన్వేయర్​బెల్ట్​దగ్గర బిగిస్తారు. 

హైడ్రాలిక్​పవర్​రోబో ఎత్తిపోసే సిల్ట్‌‌ను కన్వేయర్​ బెల్ట్​ ద్వారా గంటకు 630 క్యూబిక్​మీటర్ల వరకు బయటికి తరలించే వెసులుబాటు ఉంటుందని సంస్థ ప్రతినిధులు, అధికారులకు వివరించారు. శనివారం రాత్రి లేదా ఆదివారం ఎల్ఆర్‌‌వీపీని టన్నెల్‌‌లోకి పంపిస్తారని సమాచారం. 

డిజాస్టర్​మేనేజ్‌‌మెంట్‌‌ స్పెషల్​చీఫ్​సెక్రటరీ అర్వింద్​కుమార్, కలెక్టర్​బదావత్‌‌ సంతోష్‌‌, రెస్క్యూ టీం బృందాలతో సమీక్ష నిర్వహించారు. డీ1పాయింట్‌‌లో తవ్వకాలు పూర్తయితే తప్ప మిగిలిన ఏడుగురి ఆచూకీ లభించే అవకాశాలు లేవని సమాచారం. మూడు రోజుల తర్వాత రిజల్ట్​ఉండవచ్చని సింగరేణి రెస్క్యూ టీం జీఎం బైద్య అంచనా వేస్తున్నారు.