SLBC టన్నెల్​టాస్క్ .. అడుగడుగునా ఆటంకాలు

SLBC టన్నెల్​టాస్క్ .. అడుగడుగునా ఆటంకాలు
  • ఆచితూచి అడుగులేస్తున్న రెస్క్యూ టీమ్స్
  • మరో మూడు రోజులు పట్టే అవకాశం  
  • డెడ్​బాడీలు కనిపించాయన్న వార్తతో విషాదంలో బాధిత కుటుంబాలు

ఎస్ఎల్‎బీసీ టన్నెల్​ నుంచి వెలుగు టీం: ఎస్ఎల్బీసీ టన్నెల్​లోపల రెస్క్యూ ఆపరేషన్​చేపడుతున్న వివిధ రంగాలకు చెందిన బృందాలకు అడుగడుగునా సవాళ్లు ఎదురవుతున్నాయి. సిల్ట్,శిథిలాల తొలగింపునకు కనీసం మరో మూడు రోజులు పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. టన్నెల్​లోపల చిక్కుకున్న వారి డెడ్​బాడీలను గుర్తించారన్న వార్తలతో నాలుగు రోజులుగా అక్కడే ఉంటున్న బాధిత కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.

శనివారం ఉదయమే అధికారులు ఎస్ఎల్బీసీ క్యాంప్ ఆఫీస్​సమీపంలో 8 డెడ్​బాడీలను తరలించే వాహనాలను సిద్ధంగా ఉంచారు. దీంతో మధ్యాహ్నం వరకు మృతదేహాలను బయటికి తరలిస్తారన్న అంచనాలు పెరిగాయి. మంత్రులకు తోడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రావడంతో ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందన్న ప్రచారం జరిగింది.

సమస్యగా మారిన బురద, ఊట నీరు..

టన్నెల్ లోపల13.50 కిమీ దాటి ముందుకు వెళ్లిన ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ మద్రాస్​ఇంజనీరింగ్​7వ రెజ్​మెంట్, బార్డర్​రోడ్​ఆర్గనైజషన్, సింగరేణి మైన్స్, హైడ్రా, ఫైర్  సిబ్బందిని ఎవరిని కదిలించినా వారి అనుభవాలను పంచుకుంటున్నారు. టన్నెల్​లోపల 5 మీటర్ల వరకు పేరుకుపోయిన మట్టి, రాళ్లు, ఊట నీళ్లతో బురదగా మారి అడుగు తీసి అడుగేయడానికి కూడా వీలు కావడం లేదని చెబుతున్నారు. టన్నెల్​లోపల13 కిమీ వరకు పేరుకుపోయిన శిథిలాలు, మట్టి, రాళ్లను లోకో బకెట్స్‎​లో వేసి తరలించారు. ధ్వంసమైన ఆక్సిజన్​ప్లాంట్‎ను కట్​చేసిన రెస్క్యూ బృందం వాటిని బయటికి తరలించాయి.

కూలిన ఎయిర్​సప్లై పైప్​లైన్‎ను సరి చేశారు.13.50 కిమీ అవతల గుర్తించిన టీబీఎం వెనక భాగాన్ని దక్షిణ మధ్య రైల్వే బృందాలు ప్లాస్మా కట్టర్లతో కట్​చేస్తున్నారు. కట్​చేసిన విడిభాగాలను బయటకి తరలిస్తున్నారు.​మంత్రులు, సీఎస్​ నిర్వహించిన రివ్యూలో మ్యాప్, ల్యాప్​టాప్​ద్వారా మృతుల ఆనవాళ్లను గుర్తించిన విధానాన్ని, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో వివరించారు. కన్వేయర్​బెల్టు అందుబాటులోకి వస్తే గంటకు 800 టన్నుల వ్యర్థాలను బయటికి తరలించే వీలుంటుందని, దానిని యుద్ధప్రాతిపదికన బాగు చేస్తున్నారు. శనివారం అదనంగా రెండు హిటాచీలు, జేసీబీలను టన్నెల్​ లోపలికి తీసుకుపోయారు. 

నలుగురి ఆనవాళ్లు దొరికినా..

టన్నెల్​ లోపల చిక్కుకుపోయిన 8 మందిలో టీబీఎం వెనక భాగంలో 4 మీటర్ల మట్టి కింద నలుగురు, ముందు భాగంలో రెండు చోట్ల 8 మీటర్ల కింద నలుగురు ఉన్నట్లు గుర్తించారు. సిమెంట్, నీరు కలిసి మూడు మీటర్ల మందంతో కాంక్రీట్ గా మారిన ప్రాంతాన్ని డ్రిల్లింగ్​ చేస్తే వైబ్రేషన్​తో ఎక్కడ పైకప్పు కదులుతుందోనని ఆందోళన చెందుతున్నారు.​

పెరిగిన రెస్క్యూ టీమ్​లు..

18 సంస్థలకు చెందిన 54 మంది అధికారులు, 703  మంది నిపుణులైన సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్​లో పాల్గొనేందుకు శనివారం సింగరేణి మైన్స్​  నుంచి మరో 200 మంది చేరుకున్నారు. వీరితో పాటు భూగర్భ టన్నెళ్లలో ప్రమాదాల నుంచి రక్షించే సిబ్బందిని రప్పిస్తున్నారు. ప్రస్తుతం సొరంగంలో జీపీఆర్​తో గుర్తించిన  సర్ఫేస్ డిస్ట్రబెన్స్  ఫొటోలను విశ్లేషిస్తున్నారు.

పైనుంచి నీళ్లు వచ్చే అవకాశం లేదు..

టన్నెల్​ 14వ కిమీ పైభాగంలో నల్లమల అటవీ ప్రాంతంలోని మల్లెలతీర్థం జలపాతానికి సంబంధించిన నీరు 600 మీటర్ల వరకు కిందికి జారే అవకాశం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్టులు స్పష్టం చేశారు. టన్నెల్​ లోపల భాగం నుంచి వస్తున్న భూగర్బజలాలతో సమస్య ఎదురవుతోందని చెప్పారు. గంటకు 5 వేల నుంచి 12వేల లీటర్ల వరకు సీపేజీ​వాటర్​ వచ్చినట్లు తెలిపారు.