SLBC update: డీ2 ఆశలు గల్లంతు..వారం రోజులు కష్టపడి మట్టి, రాళ్లు తొలగించిన రెస్క్యూ టీమ్స్‌‌

SLBC update: డీ2 ఆశలు గల్లంతు..వారం రోజులు కష్టపడి మట్టి, రాళ్లు తొలగించిన  రెస్క్యూ టీమ్స్‌‌
  • ఒక్క డెడ్‌‌బాడీ తప్ప మరే ఆనవాళ్లు దొరకలే...
  • డీ1 పాయింట్‌‌లో తవ్వకాలకు ప్రయత్నాలు
  • అక్కడ నీరు పారుతుండడంతో ఆందోళనలో రెస్క్యూ టీమ్స్‌‌

నాగర్‌‌కర్నూల్‌‌, వెలుగు : ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ ప్రమాదంలో నాలుగు డెడ్‌‌బాడీలు ఉన్నట్లు భావించిన డీ2 పాయింట్ లో వారం రోజుల పాటు తవ్వకాల జరిపినా ప్రయోజనం లేకుండా పోయింది. ప్రమాద స్థలానికి 70 మీటర్ల దూరంలో ఉన్న డీ2 ప్లేస్‌‌లో నాలుగు చోట్ల మానవ అవశేషాలు ఉన్నట్లు జీపీఆర్‌‌ స్కానర్‌‌తో పాటు క్యాడవర్‌‌ డాగ్స్‌‌ గుర్తించాయి. 

దీంతో అక్కడ తవ్వకాలు ప్రారంభించి 8 మీటర్ల ఎత్తులో పేరుకొని, గట్టిపడి సిమెంట్‌‌ కాంక్రీట్ గా మారిన మట్టిని డ్రిల్లింగ్‌‌ చేయడంతో పాటు టీబీఎం బేస్‌‌, ఇతర భాగాలను కట్‌‌ చేశారు. ఇక్కడ ఒక్క గురుప్రీత్‌‌సింగ్‌‌ డెడ్‌‌బాడీ తప్ప మిగిలిన వారి ఆచూకీ దొరకలేదు. దీంతో అక్కడ తవ్వకాలు నిలిపివేయాలని నిర్ణయించారు. 

డీ1 పాయింట్‌‌పై ఫోకస్‌‌

డీ2 పాయింట్ లో డెడ్‌‌బాడీల ఆనవాళ్లు దొరకకపోవడంతో రెస్క్యూ టీమ్స్‌‌ డీ1పై ఫోకస్‌‌ చేశాయి. టన్నెల్‌‌లో ప్రమాదం జరిగిన 14వ కిలోమీటర్‌‌ నుంచి 43.5 మీటర్ల దూరంలో డీ1 పాయింట్ ఉంది. ఇక్కడ 8.85 మీటర్ల ఎత్తులో మట్టి పేరుకొని సిమెంట్‌‌ కాంక్రీట్‌‌లా మారింది. టీబీఎం ముందు భాగంలో ఉండే ఈ ప్రదేశంలో తవ్వకాలు, తరలింపు రెండు హై రిస్క్‌‌తో కూడుకున్నవేనని రెస్క్యూ టీమ్స్‌‌ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

మరోవైపు డీ1 పాయింట్‌‌ డెడ్‌‌ఎండ్‌‌లో నీరు జలపాతంలా దూకుతోంది. దీంతో ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్‌‌ చేయడం కష్టంగా మారింది. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్‌‌ చేయాలంటే 200 మీటర్లు వెనక్కి కొట్టుకొచ్చిన టీబీఎంపై ఉన్న మట్టి, డీవాటరింగ్‌‌ సమస్యలను పరిష్కరిస్తూ తవ్వకాలు జరపాల్సి ఉంటుందని సింగరేణి ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. ఇంత కష్టపడి తవ్వకాలు జరిపినా రిజల్ట్‌‌ ఎలా ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్న ఆపరేషన్‌‌ను కొనసాగించాలా ? లేక తాత్కాలికంగా నిలిపివేయాలా ? అన్న చర్చ నడుస్తోంది. 

పని ప్రారంభించని రోబో

టన్నెల్‌‌ ఆపరేషన్‌‌ కోసం మ్యాన్‌‌పవర్‌‌, మెషినరీ, టెక్నాలజీ ఫార్ములాను అమలు చేస్తున్నారు. టన్నెల్‌‌ లాస్ట్‌‌ పాయింట్‌‌లో మనుషులకు రిస్క్‌‌ లేకుండా పనులు చేసేందుకు ప్రత్యేకంగా రోబోను తెప్పించారు. మెయిన్‌‌ రోబో టన్నెల్‌‌ బయట కంట్రోల్‌‌ రూంలోనే ఉండగా, ఓ రోబోను రెండు రోజుల కింద టన్నెల్‌‌లోకి పంపించారు. కానీ అది ఇంకా పని ప్రారంభించలేదు. మరో రెండు రోబోలు రావడానికి టైం పడుతుందని తెలిసింది. అన్వి రోబోటిక్‌‌ సర్వీసెస్‌‌ సిబ్బందితో శుక్రవారం కలెక్టర్ బాదావత్‌‌ సంతోష్‌‌  చర్చించారు.