శ్రీలంక క్రికెట్ (SLC) జూలై నెలాఖరులో భారత్‌తో జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌ల షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించింది. టీమ్ ఇండియా ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో భాగంగా మూడు టీ20 మ్యాచ్ లు ముగిసాయి. ఆదివారం (జూలై 14)తో ఈ సిరీస్ ముగుస్తుంది. ఈ సిరీస్ తర్వాత మన క్రికెట్ జట్టు శ్రీలంకలో పర్యటించనుంది.
జూలై 26 తొలి టీ20తో నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. ఆగస్టు 7 న మూడో వన్డే తర్వాత లంక టూర్ ముగుస్తుంది. వరల్డ్ కప్ లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన తర్వాత శ్రీలంకకు ఇదే తొలి సిరీస్. జూలై 26 న మొదటి టీ20.. జూలై 27 న రెండో టీ20.. జూలై 29 న మూడో టీ 20 జరుగుతాయి. నాలుగు రోజుల వ్యవధిలోనే మూడు టీ20 మ్యాచ్ లను నిర్వహించారు.
ఈ సిరీస్ తర్వాత ఆగస్టు 2,4,7 తేదీల్లో వరుసగా మూడు వన్డే మ్యాచ్ లు జరుగుతాయి. పల్లెకెలె అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మూడు టీ20 మ్యాచ్ లకు ఆతిధ్యం ఇవ్వనుంది. ఇక మూడు వన్డేలు కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరుగుతాయి. ఈ సిరీస్ ద్వారా టీమిండియా హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్ భారత జట్టులో చేరతాడు.
మరోవైపు క్రిస్ సిల్వర్‌వుడ్ పదవికి రాజీనామా చేయడంతో శ్రీలంక తాత్కాలిక ప్రధాన కోచ్‌గా సనత్ జయసూర్యను లంక క్రికెట్ నియమించింది. ప్రస్తుతం జింబాబ్వే పర్యటనలో ఉన్న భారత క్రికెటర్లు లంక సిరీస్ కు ఎవరు ఎంపికవుతారో ఆసక్తికరంగా మారింది. కొన్ని రోజుల్లో భారత జట్టును ప్రకటిస్తారు. జూలై 2021 తర్వాత ద్వైపాక్షిక సిరీస్ కు టీమ్ ఇండియా శ్రీలంకలో పర్యటించడం ఇదే మొదటిసారి.