శ్రీలంక క్రికెట్‌లో మరో రభస.. వరల్డ్ కప్ జట్టు ఎంపికలో రాజకీయ జోక్యం!

శ్రీలంక క్రికెట్‌లో మరో రభస.. వరల్డ్ కప్ జట్టు ఎంపికలో రాజకీయ జోక్యం!

భారత్ వేదికగా జరిగిన వన్డే 2023 ప్రపంచ కప్‌లో శ్రీలంక దారుణ ప్రదర్శన కనపరిచిన సంగతి తెలిసిందే. ఆఖరికి అఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్  చేతిలో కూడా పరాజయాలను చవిచూసిన లంకేయులు.. ఆ జట్టుకున్న గత వైభవాన్ని పోగొట్టారు. లీగ్ దశలో తొమ్మిదింటిలో కేవలం రెండింట మాత్రమే విజయం సాధించి.. 2025లో పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి అర్హత సాధించలేకపోయారు. లంకేయుల ఈ ప్రదర్శన వెనుక రాజకీయ కోణం ఉన్నట్లు లంక క్రికెట్ బోర్డు(ఎస్‌ఎల్‌సీ) ట్వీట్ చేసింది.

శ్రీలంక వరల్డ్ కప్ జట్టులో వనిందు హసరంగా, దుష్మంత చమీరలను ఎంపిక చేయడానికి క్రీడా మంత్రిత్వ శాఖ అనుమతించలేదని ఆ దేశ క్రికెట్ బోర్డు ట్వీట్ చేసింది. నేషనల్ స్పోర్ట్స్ సెలక్షన్ కమిటీ మెడికల్ క్లియరెన్స్‌ కోరిందని, అది లేకుండా తాము అనుమతించేది లేదని తేల్చి చెప్పిందని బోర్డు ఒక ప్రకటన విడుదల చేసింది. సమయం తక్కువుగా ఉండటం వల్ల అది సాధ్యపడదని చెప్పినా.. అంగీకరించలేదని తెలిపింది.

ఎస్‌ఎల్‌సీ విడుదల చేసిన ప్రకటనలో సెలక్టర్లు సెప్టెంబర్ 5న జట్టును ఎంపిక చేశారని తెలిపింది. అందులో గాయాల నుండి కోలుకున్న హసరంగా, చమీరా ఇద్దరికీ చోటు చోటు కలిపించామని వెల్లడించింది. అయితే అనుమతి కోసం క్రీడలు మరియు యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు బోర్డుకు పంపగా వారు మెడికల్ క్లియరెన్స్ లేదని నిరాకరించారని పేర్కొంది. సాధారణంగా జట్టు ఎంపిక విషయాలు క్రీడా మంత్రిత్వ శాఖకు అవసరం లేదనేది లంక బోర్డు వాదన. తాము చెప్పినట్లు చేసి ఉంటే కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చేవారమని సమర్ధించుకుంది.