ఒబెసిటీ అనగానే, అందరూ భోజనం, వ్యాయామం, రోజూ చేసే పనులు మాత్రమే కారణాలు అనుకుంటారు. కానీ, నిద్ర లేకపోవటం కూడా శరీర బరువుని ప్రభావితం చేస్తుందట. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురించిన ఒక స్టడీ రిపోర్ట్ ప్రకారం, తక్కువ నిద్ర కలిగిన వారికి, అర్ధరాత్రి ఏదైనా తినాలనే కోరికలు ఎక్కువగా ఉంటాయని, అంతేకాకుండా. ఆ కోరికలను తీర్చుకోవడానికి వారు కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్ధాలు అధికంగా కలిగిన స్నాక్స్ ఎంచుకునే అవకాశం ఉందని
పరిశోధకులు కనుగొన్నారు.
చికాగో విశ్వవిద్యాలయంలో అదే సమయంలో మరొక స్టడీ కూడా జరిగింది. ఇందులో, నిద్ర లేమితో ఎక్కువ బాధపడేవారు, 8 గంటలు లేదా అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోయే వారి కన్నా, ఎక్కువ కొవ్వు ఉన్న స్నాక్స్ ను ఎంచుకునే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాకుండా, వారిలో ఎక్కువ మంది ఎక్కువ బరువుతో ఉన్నారని, వీరు తరచుగా అనేకరకాల జబ్బులతో బాధపడుతున్నారని కూడా తెలిపింది.తక్కువ నిద్రపోతే, మీ మెదడు. తీవ్రంగా శ్రమ పడాల్సి ఉంటుంది. క్రమంగా, ఆ ప్రభావం జ్ఞాపకశక్తి మీద పడి నిర్ణయలోపం పెరుగుతుంది. సరైన నిద్ర లేని వారు అల్జీమర్స్ వంటి మెదడు సంబంధ మైన జబ్బుల బారిన పడుతున్నారని ఎన్నో స్టడీస్ తేల్చాయి.
–వెలుగు, లైఫ్–