
‘కలిసి ఉంటే కలదు సుఖం’ అని చెప్తుంటారు మన పెద్దలు. కానీ.. ‘విడిగా పడుకుంటేనే ఉంది సుఖం’ అంటున్నారు ఈ తరం దంపతులు. అందువల్లే స్లీపింగ్ డైవర్స్ అనే కొత్త ట్రెండ్ వెలుగులోకి వచ్చింది. అందులోనూ మూడుముళ్ల బంధానికి ఎంతో విలువనిచ్చే మనదేశంలోనే ఈ ట్రెండ్‌ని ఎక్కువమంది ఫాలో అవుతున్నారు. ఇంతకీ ఏమిటీ ట్రెండ్. ఇది ఎందుకు మొదలైంది? దీనివల్ల నష్టాలేంటి? లాభాలేంటి?
‘‘దాదాపు నెల క్రితం నా భర్తకు దగ్గు మొదలైంది. నిద్రలో కూడా బాగా దగ్గేవాడు. నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ముఖ్యంగా మధ్యరాత్రి అప్పుడు చాలా చిరాకుగా అనిపించేది. అలా రెండు మూడు రోజులు గడిచాక ఒకరోజు తెల్లవారుజామున 2 గంటలకు నేను మంచం మీద నుంచి లేచి నా వర్క్ రూమ్‌లోకి వెళ్లా. ఆ గదిలో గెస్ట్‌లు వచ్చినప్పుడు పడుకోవడానికి చిన్న పార్టిషన్ చేయించి, చిన్న బెడ్ వేయించాం. రెండు మూడు వారాల క్రితం ఇంటికి వచ్చిన గెస్ట్‌లు అక్కడ పడుకున్నారు. దుప్పట్లు కూడా శుభ్రంగా లేవు.గది కూడా చాలా చిన్నది. అయినా.. అవేవీ పట్టించుకోకుండా అక్కడే పడుకున్నా. ఆ రోజు చాలా బాగా నిద్రపట్టింది. మరుసటి రోజు నుంచి అక్కడే పడుకోవడం అలవాటైంది. నా భర్తకు దగ్గు తగ్గిన తర్వాత కూడా నాకు ఒంటరిగానే పడుకోవాలి అనిపించింది.అయితే.. కొన్నాళ్లకు దీనివల్ల మా మధ్య
సమస్యలు వస్తాయేమో అనే ఆందోళననాలో మొదలైంది. అప్పుడే గూగుల్లోస్లీప్ డైవర్స్ గురించి వచ్చిన కొన్ని రీసెర్చ్ల గురించి తెలుసుకున్నా. అప్పటినుంచి నేను విడిగానే పడుకుంటున్నా. దీనివల్ల ఇద్దరమూ సంతోషంగానే ఉంటున్నాం” అంటూ చెప్పుకొచ్చింది రిత్విక.
ఇలా.. రకరకాల కారణాల వల్ల భాగస్వామితో కాకుండా ఒంటరిగా నిద్రపోవడానికి ఇష్టపడేవాళ్లు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. క్వాలిటీ స్లీప్ ఉపయోగాల మీద అవగాహన పెరుగుతున్న కొద్దీ ఇలాంటివాళ్ల సంఖ్య పెరుగుతోందని పరిశోధనల్లో తేలింది. రెస్‌మెడ్ అనే సంస్థ చేసిన గ్లోబల్ స్లీప్ స్టడీ–2025 ప్రకారం.. మన దేశంలో 70 శాతం మంది దంపతులు స్లీప్ డైవర్స్‌ని ఫాలో అవుతున్నారు. మన తర్వాత చైనాలో 67 శాతం, దక్షిణ కొరియాలో 65 శాతం మంది ఈ ట్రెండ్ ఫాలో అవుతున్నారు. యునైటెడ్ కింగ్‌డమ్, యునైటెడ్ స్టేట్స్‌లోని జంటల్లో 50 శాతం మంది ఎప్పుడూ కలిసి నిద్రపోతుండగా.. మిగతా 50 శాతం మాత్రం అప్పుడప్పుడు విడివిడిగా నిద్రపోతున్నారు. దాదాపు 30 వేల మందిపై చేసిన ఈ సర్వేలో ప్రపంచం స్లీప్ క్రైసిస్‌ని ఎదుర్కొంటోందని తెలిసింది.
ఎందుకిలా?
దంపతులు విడిగా నిద్రపోవడం కొందరికి అసాధారణమైన విషయంగా అనిపించొచ్చు. కానీ దీనివల్ల స్లీప్ క్వాలిటీ పెరిగిందని చాలామంది చెప్తున్నారు. ఇలా వేరుగా పడుకోవడానికి ప్రధాన కారణాలు... భాగస్వామి గురక పెట్టడం, బిగ్గరగా శ్వాస తీసుకోవడం, విశ్రాంతి లేకపోవడం, దంపతుల స్లీపింగ్ షెడ్యూల్స్ వేరువేరుగా ఉండడం, బెడ్ మీద ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల లాంటివి వాడడం. అయితే.. ఈ కారణాల వల్ల విడిగా పడుకుంటున్నవాళ్లు క్వాలిటీ స్లీప్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేయడంతోపాటు వాళ్ల మధ్య బంధాలు బలపడ్డాయని, వాళ్ల లైంగిక జీవితం కూడా బాగుందని చెప్తున్నారు.
కలిసి నిద్రపోతే..
దంపతులు కలిసి నిద్రపోవడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్పర్ట్స్. ముఖ్యంగా ఇద్దరూ ఒకేచోట నిద్రపోయినప్పుడు సాధారణంగా లవ్ హార్మోన్ అని పిలిచే ఆక్సిటోసిన్ విడుదల అవుతుంది. దీనివల్ల డిప్రెషన్, యాంగ్జైటీ, ఒత్తిడిలాంటివి కాస్త తగ్గుతాయి. అలాగే జీవితం, బంధాల పట్ల సంతృప్తి పెరుగుతుంది. ఒక స్టడీలో.. ఒకే మంచం మీద నిద్రపోయే దంపతులు ఎన్నో ఎమోషనల్ బెనిఫిట్స్‌ని పొందుతారని తేలింది. ఫ్రాంటియర్స్ ఇన్ సైకియాట్రీ స్టడీ ప్రకారం.. కలిసి నిద్రపోవడం వల్ల వేగవంతమైన కంటి కదలిక (ఆర్ఈఎం) 10 శాతం పెరుగుతుందని తేలింది. దీనివల్ల బ్రెయిన్ యాక్టివిటీ పెరుగుతుంది. భాగస్వామి పక్కన పడుకోవడం వల్ల కలిగే ఫీలింగ్స్ గురించి అడిగినప్పుడు... 53 శాతం మంది ప్రేమ, 47% ఓదార్పు, 41% రెస్ట్, 27% ఆనందం, 21% ప్రశాంతత దొరుకుతాయని చెప్పారు.
నిద్ర లేమి సమస్య
నేటి టెక్ ప్రపంచంలో చాలామందికి క్వాలిటీ స్లీప్ కరువైంది. అందుకే దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ స్లీప్ డైవర్స్‌ని ఎంచుకుంటున్నారు. సెల్ఫ్ కేర్‌తోపాటు కుటుంబం, సామాజిక అంచనాలను బ్యాలెన్స్ చేసుకోవడం, ఒత్తిడి, యాంగ్జైటీ, ఆర్థిక సమస్యలు, మానసిక అనారోగ్యం.. లాంటి సమస్యలు నిద్రలేమికి కారణాలవుతున్నాయి. ముఖ్యంగా 69% మంది భారతీయులు ఒత్తిడి వల్ల నిద్రకు దూరమవుతున్నామని చెప్పారు. ఈ లిస్ట్‌లో తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా (67%), థాయిలాండ్ (65%), సింగపూర్ (65%), జర్మనీ (61%) ఉన్నాయి. జెన్ జెడ్లలో మాత్రం 53 శాతం మంది నిద్ర లేమికి యాంగ్జైటీ ప్రధాన కారణమని చెప్పారు. నిద్రలేమి సమస్యను గుర్తించినప్పటికీ దాదాపు 22 శాతం మంది దాన్ని పరిష్కరించుకోవడం మీద దృష్టి పెట్టడం లేదు. నిద్రలేమి వల్ల మానసికంగా బలహీనపడడం, ఏకాగ్రత తగ్గడం, సంబంధాలు దెబ్బతినడం, వర్క్ ప్లేస్ ఫెర్ఫార్మెన్స్ తగ్గడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. ఇది ఎక్కువ కాలం కొనసాగితే.. హార్ట్ ఫెయిల్యూర్, షుగర్, స్ట్రోక్ లాంటివాటికి దారితీసే ప్రమాదం ఉంది. అందుకే కనీసం ఏడు గంటలు నిద్రపోవాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
స్లీప్ హెల్త్‌లో అసమానతలు
మన దేశంలో మహిళల కంటే మగవాళ్లే ఎక్కువ క్వాలిటీ స్లీప్ అనుభవిస్తున్నారు. ఆడవాళ్లు సగటున వారానికి 3.83 రాత్రులు, మగవాళ్లు 4.13 రాత్రులు హాయిగా నిద్ర పోతున్నారు. నిద్ర విషయంలో హార్మోన్లలో వచ్చే మార్పులు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి. మగవాళ్లలో 29% మంది, ఆడవాళ్లలో 38% మంది నిద్రపోవడంలో ఇబ్బంది పడుతున్నారని స్టడీలో తేలింది. ఇక ఉద్యోగాలు చేసే ఆడవాళ్లలో 17% మంది, మగవాళ్లలో 12% మంది నిద్రలేమి కారణంగా సిక్ లీవ్స్ తీసుకుంటున్నారు.
నిద్రలేమి చాలా పెద్ద సమస్యగా మారుతోంది. అందుకే ఇప్పుడు చాలామంది స్లీప్ హెల్త్‌కి ప్రాధాన్యత ఇస్తున్నారు. దానివల్లే ప్రపంచవ్యాప్తంగా ఈ స్లీప్ డైవర్స్ ట్రెండ్ మొదలైందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. చాలా జంటలకు విడిగా నిద్రపోవడం ఒక చక్కని పరిష్కారంగా మారింది.