చిట్టీలు కడుతుంటారా..? జర భద్రం.. రూ.2 కోట్లతో చేతులెత్తేసిన చిట్ ఫండ్ కంపెనీ..

చిట్టీలు కడుతుంటారా..? జర భద్రం.. రూ.2 కోట్లతో చేతులెత్తేసిన చిట్ ఫండ్ కంపెనీ..

హైదరాబాద్: వికారాబాద్ జిల్లా పరిగిలో SLNK చిట్ ఫండ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఊహించని ఈ పరిణామంతో ఈ చిట్ ఫండ్ కంపెనీలో డబ్బులు పెట్టిన పరిగి ప్రజలు లబోదిబోమంటున్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల చిట్టీ డబ్బులు ఇవ్వకుండా సదరు కంపెనీ ఎగ్గొట్టేసిందని డీఎస్పీకి బాధితులు ఫిర్యాదు చేశారు. 

SLNK సంస్థ చైర్మన్ కౌకుంట్ల అంతారం దేవేందర్ గౌడ్ను బాధితులు ప్రశ్నించగా ఎలాంటి సమాధానం చెప్పడం లేదని బాధితులు ఆరోపిస్తున్నారు. పరిగి SLNK చిట్ ఫండ్ కంపెనీ మేనేజర్ గిరిధర్ రెడ్డిని అడగగా తనకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నాడని, వాళ్ళ ఇంటికి వెళ్లి అడిగితే వాళ్ళ భార్య తమకు ఎలాంటి సంబంధం లేదని బూతులు తిడుతుందని బాధితులు ఆరోపించారు.

రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి.. పైసాపైసా కూడబెట్టుకుని చిట్టీ కట్టామని, పెళ్లిళ్ల కోసం, వ్యాపారాల కోసం జమ చేసుకున్నామని బాధితులు చెప్పారు. అంత కష్టపడి కడితే ఆ డబ్బులు తీసుకుని వాడుకుని ఇప్పుడు లేవంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 

చైర్మన్ పేరు మీద ఉన్న ఆస్తులన్నీ ఆఫీస్ బాయ్ పేరు మీద మార్చి తన దగ్గర ఎలాంటి ఆస్తులు లేవంటూ చెప్పుకొని వస్తున్నాడని బాధితులు ఆరోపించారు. 3 సంవత్సరాల నుంచి కిరాయి కూడా ఇవ్వకుండా, తనతో చిట్టీ వేయించుకొని ఇప్పుడు అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని ఒక బాధితుడు వాపోయాడు. ఈ కంపెనీపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని డీస్పీకి బాధితులు మొరపెట్టుకున్నారు.