- కాంగ్రెస్ హైకమాండ్‌కు పార్టీ బీసీ నేతల అల్టిమేటం
- నేడు గాంధీభవన్‌లో సత్యాగ్రహ దీక్ష
- పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో చెప్పినట్లుగా
- 34 సీట్లు కేటాయించాల్సిందే
- రాహుల్‌గాంధీ కూడా బీసీల వాటా బీసీలకే దక్కాలన్నరు
- వాటా దక్కకపోతే పార్టీ అధికారంలోకి వచ్చుడు కష్టమే
- గాంధీభవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టి గొంతెత్తిన బీసీ లీడర్లు
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ పార్టీలో బీసీ నినాదం మరింత జోరందుకున్నది. ‘మా వాటా సీట్లు.. మాకియ్యాల్సిందే’నని బీసీ లీడర్లు తెగేసి చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటికీ ఇంకా అభ్యర్థుల ఎంపికపై పార్టీలో కసరత్తు కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ లిస్టులో 72 మంది పేర్లను ప్రకటించే అవకాశం ఉండటంతో బీసీ లీడర్లు అలర్ట్ అయ్యారు. ఇప్పటికే వివిధ రూపాల్లో తమ గళం వినిపించిన నేతలు.. ఇప్పుడు గాంధీభవన్ వేదికగా సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నట్లు పార్టీ హైకమాండ్‌కు అల్టిమేటం ఇచ్చారు. ‘హలో బీసీ.. చలో గాంధీభవన్’ పేరిట ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్‌లో మాటిచ్చినట్లుగానే తమకు 34 సీట్లు ఇచ్చి తీరాల్సిందేనని బీసీ లీడర్లు తేల్చిచెప్తున్నారు. కొత్తగా పార్టీలో చేరుతున్న వారికి సర్వేల్లో మంచి ఫలితాలు ఎలా వస్తున్నాయని, ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న బీసీలకు అవే సర్వేల్లో నెగెటివ్ ఎలా వస్తుందని మండిపడుతున్నారు. బీసీలకు వారి వాటా వారికి దక్కాలన్నది పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ మాటేనని గుర్తుచేస్తున్నారు. ఆయన మాటకు కూడా విలువ లేకుంటే ఎట్లా అని ప్రశ్నిస్తున్నారు.
బీసీలకు దక్కాల్సిన వాటా దక్కకపోతే రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి రావడం కష్టమని హెచ్చరిస్తున్నారు. గురువారం గాంధీభవన్‌లో బీసీ లీడర్లు చెరుకు సుధాకర్, కత్తి వెంకటస్వామి, జగదీశ్వర్ రావు తదితరులు ప్రెస్‌మీట్ పెట్టి తమ కార్యాచరణను ప్రకటించారు. అభ్యర్థుల ఎంపికపై శుక్రవారం ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ మీటింగ్ జరగనుండగానే.. అదే టైమ్‌లో ‘‘హలో బీసీ.. చలో గాంధీభవన్’’ పేరిట సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని బీసీ నేతలు నిర్ణయించారు. తమ వాటా కోసం శుక్రవారం దీక్షకు దిగుతున్నట్లు మీడియా సమావేశంలో బీసీ లీడర్లు ప్రకటించారు. దీనిపై పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే సీరియస్ అయినట్టు తెలిసింది. ఇలాంటివి మంచిదికాదని ఆయన హెచ్చరించినట్టు సమాచారం. అయితే, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేందుకు ఆయన సూచనలిచ్చినట్టు తెలిసింది.
వాళ్లకెట్లా నెగెటివ్ వచ్చింది?
పార్టీలో కొత్తగా చేరుతున్నోళ్లంతా కేసీఆర్ కోవర్టులేనని బీసీ లీడర్లు మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ పార్టీలో ఉన్న వారికి సర్వేల్లో నెగెటివ్ వచ్చి.. ఇప్పుడు పార్టీలోకి వస్తున్నోళ్లకు పాజిటివ్ ఎలా వస్తున్నదని నిలదీస్తున్నారు. మక్తల్‌లో బీసీ నేత శ్రీహరి కాకుండా.. ఇటీవలే పార్టీలో చేరిన సీతా దయాకర్ రెడ్డి గెలుస్తారని సర్వేలో ఎట్లా వచ్చిందని కత్తి వెంకటస్వామి ప్రశ్నించారు. ఎన్నో ఏండ్లపాటు పార్టీకి సేవలందించిన నందికంటి శ్రీధర్‌కు సర్వేలో ఎట్లా నెగెటివ్ వచ్చిందని, కొత్తగా వచ్చిన మైనంపల్లి హన్మంతరావు గెలుస్తారని ఎట్లా తేలిందని అన్నారు. కాగా, 34 స్థానాల కోసం ఇప్పటికే బీసీ లీడర్లు అధిష్ఠానాన్ని కలిశారు.
ALSO READ : బీజేపీ నుంచి బరిలో సీనియర్లు..అక్టోబర్ 16 తర్వాత ఫస్ట్ లిస్ట్
ఆ భేటీ కాస్తా కేసీ వేణుగోపాల్తోనే సరిపోయింది. ఇటీవల కొందరు కమ్మ సామాజికవర్గం నేతలు ఢిల్లీ వెళ్లగానే ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ ఒక్కరోజులోనే అపాయింట్మెంట్ ఇచ్చారు. తమకు మాత్రం ఐదు రోజులు వెయిట్ చేయించుకుని కూడా హైకమాండ్ లీడర్లు కలవలేదని బీసీ లీడర్లు వాపోతున్నారు.
అందరం దీక్షలో కూర్చుంటం : చెరుకు సుధాకర్
పొలిటికల్ అఫైర్స్ కమిటీలో ఇస్తామన్న 34 సీట్లను బీసీలకు ఇచ్చి తీరాల్సిందేనని చెరుకు సుధాకర్ డిమాండ్ చేశారు. పీసీసీ చీఫ్ దానిపై ఆలోచన చేయాలన్నారు. బీసీలకు సీట్లపై శుక్రవారం గాంధీభవన్‌లో దీక్షలో కూర్చుంటామని చెప్పారు. బీసీలే కాకుండా సామాజిక న్యాయం కావాలనుకునే ఎవరైనా ఈ దీక్షలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. టీం ఓబీసీ లీడర్లంతా కలిసే ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. చలో గాంధీభవన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బీసీలకు ఇస్తామన్న సీట్లు ఇవ్వకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని ఆయన అన్నారు. ‘‘కాంగ్రెస్ గెలుపే లక్ష్యం.. బీసీల వాటానే ముఖ్యం’’ అనే నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు.
హైకమాండ్‌కు వినపడాలి : కత్తి వెంకటస్వామి
తమ ఆవేదన హైకమాండ్‌కు వినపడేలా శుక్రవారం గాంధీభవన్‌లో బీసీ ఆశావహులంతా ఆందోళన చేస్తామని కత్తి వెంకటస్వామి తెలిపారు. ఓబీసీ అభ్యర్థులు ఎక్కువున్నప్పుడే కాంగ్రెస్ గెలుపు అవకాశాలు సులువవుతాయని అన్నారు. పార్టీ తొలి జాబితాలో 72 మందిని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నదని, అందులో బీసీలు 10 మంది కూడా లేరన్న సమాచారం ఉందని ఆయన తెలిపారు. వేరే పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చే వాళ్లతో అభద్రతాభావం ఏర్పడిందని పేర్కొన్నారు. బీసీ లీడర్లకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకుండా ఎమ్మెల్సీ, రాజ్యసభలాంటివి ఇస్తామంటే ప్రజలు నమ్మరని, జనాన్ని ఒప్పించాలంటే ముందుగా చెప్పినట్టు బీసీలకు 34 స్థానాలు ఇవ్వాల్సిందేనని తేల్చి చెప్పారు.