స్లాట్ బుకింగ్‌‌తో తొలిరోజు 626 రిజిస్ట్రేషన్లు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

స్లాట్ బుకింగ్‌‌తో తొలిరోజు 626 రిజిస్ట్రేషన్లు : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • రాష్ట్రవ్యాప్తంగా 22 సబ్ రిజిస్ర్టార్ ఆఫీసుల్లో అమల్లోకి.. 
  • క్యూ లైన్లలో నిలబడే పరిస్థితికి చెక్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా 22 సబ్​రిజిస్ట్రార్​ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ విధానం గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. తొలిరోజు ఈ విధానానికి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 626 మంది స్లాట్ బుకింగ్ ద్వారా రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖలో ఏ సంస్కరణ చేపట్టినా, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజల కోణం నుంచే ఉండాలని అధికారులకు సూచించారు. 

స్లాట్ బుకింగ్ విధానం ద్వారా గంటల తరబడి క్యూ లైన్లలో నిలబడే పరిస్థితికి చెక్ పెట్టడంతో పాటు సమయం ఆదా కావడం, పారదర్శకత పెరగడం జరుగుతుందన్నారు. “త్వరలోనే క్యూలైన్లకు గుడ్‌‌బై చెప్పే రోజులు వస్తాయి. దళారుల ప్రమేయం కూడా పూర్తిగా తొలగిపోతుంది” అని చెప్పారు. ఈ విధానంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్లాట్ బుకింగ్ ద్వారా కేవలం 10 నుంచి 15 నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతున్నదని, దీంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. 

‘‘రిజిస్ట్రేషన్ శాఖ అధికారిక వెబ్‌‌సైట్ registration.telangana.gov.inలోని స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ప్రజలు తమకు అనుకూలమైన రోజు, సమయాన్ని ఎంచుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ విధానంతో సేవల్లో జాప్యం, సిఫార్సులు, దళారుల జోక్యం లేకుండా మెరుగైన సేవలు అందుతాయి” అని వివరించారు.  

కొత్త విధానం బాగుంది.. 

స్లాట్ బుకింగ్ విధానం బాగుంది. ఎలాంటి అద‌‌న‌‌పు ఖ‌‌ర్చులు లేకుండా రిజిస్ట్రేషన్ పూర్తయింది. రిజిస్ట్రేష‌‌న్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుని, మేడ్చల్ స‌‌బ్ రిజిస్ట్రార్ ఆఫీసుకు నిర్ణీత స‌‌మ‌‌యానికి వెళ్లాం. తొలిరోజైన‌‌ప్పటికీ కేవ‌‌లం 20  నిమిషాల వ్యవ‌‌ధిలోనే రిజిస్ట్రేషన్ పూర్తయింది. మేమే రిజిస్ట్రేష‌‌న్ మాడ్యూల్‌‌లో డాక్యుమెంట్లను అప్‌‌లోడ్ చేశాం. అన్నీ ఆన్‌‌లైన్‌‌లోనే జ‌‌రిగినందున ఎక్కడా ఇబ్బంది ప‌‌డ‌‌లేదు. మాకు స‌‌మ‌‌యం ఆదా అయింది. రిజిస్ట్రార్ కార్యాలయ అధికారులు, సిబ్బంది కూడా స‌‌హ‌‌క‌‌రించారు.    -  గ‌‌ట్టు శ్రీ‌‌నివాస్