మానకొండూరులో ఎలుగుబంటి హల్​చల్​

  •     మత్తు ఇంజక్షన్ ఇచ్చి పట్టుకున్న అధికారులు

మానకొండూరు,  వెలుగు: కరీంనగర్​ జిల్లా మానకొండూర్​లో ఓ ఎలుగుబంటి హల్​చల్ ​చేసింది. చెరువు కట్ట దగ్గర ఉన్న హనుమాన్ దేవాలయం సమీపంలోని వేప చెట్టుపై కూర్చోవడంతో గ్రామస్తులు భయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు గ్రామ పంచాయతీ పక్కన ఉన్న వరంగల్ - కరీంనగర్ మెయిన్​రోడ్డుపై ఎలుగుబంటి వస్తుండగా చూసిన కుక్కలు మొరిగాయి. దీంతో ఎలుగుబంటి రోడ్డు పక్కనున్న ఓ  రేకుల షెడ్డుపైకి ఎక్కి అక్కడి నుంచి వేప చెట్టుపైకి ఎక్కి కూర్చుంది.

ఇది చూసిన స్థానికులు ఫారెస్ట్ ఆఫీసర్లతో పాటు  పోలీసులకు సమాచారమిచ్చారు. వరంగల్ నుంచి మధ్యాహ్నం వచ్చిన రెస్క్యూ టీం ఎలుగు బంటికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడానికి ప్రయత్నించగా అది చెట్టు దిగి మానకొండూరు చెరువు వైపు పొదలోకి వెళ్లింది. అక్కడున్న సిబ్బంది పటాకులు పేల్చడంతో బయటకు వచ్చిం ది. అప్రమత్తమైన వెటర్నరీ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గన్ సాయంతో మత్తు ఇంజక్షన్ వేశారు. కొంత దూరం పరిగెత్తి స్పృహ తప్పి పడిపోవడంతో  వ్యాన్ లోకి ఎక్కించి వరంగల్ తరలించారు