Paris Olympics 2024: స్విమ్మింగ్ పూల్‌లోనే కుప్పకూలిన స్విమ్మర్‌.. ఒలింపిక్స్‌లో భయానక ఘటన 

Paris Olympics 2024: స్విమ్మింగ్ పూల్‌లోనే కుప్పకూలిన స్విమ్మర్‌.. ఒలింపిక్స్‌లో భయానక ఘటన 

పారిస్‌ ఒలింపిక్స్‌లో భయానక ఘటన చోటుచేసుకుంది. స్లొవేకియా స్విమ్మర్‌ టమర పొటొక అకస్మాత్తుగా స్విమ్మింగ్ పూల్‌లోనే కుప్పకూలి.. సహచర అథ్లెట్లను కలవర పాటుకు గురిచేసింది. 

అసలేం జరిగిందంటే..?

స్లొవేకియా స్విమ్మర్‌ టమర పొటొకాకు ఇదే తొలి ఒలింపిక్స్‌ కాగా, జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనలతో ఆమె ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. శుక్రవారం(ఆగష్టు 02) జరిగిన మహిళల 200 మీటర్ల వ్యక్తిగత మెడ్లే క్వాలిఫైయింగ్ రౌండ్‌లో ఆమె ఏడో స్థానంలో నిలిచింది. ఇంతవరకూ బాగానే ఉన్నా, రేసు పూర్తయిన ఆమె వెంటనే అస్వస్థతతో పూల్‌లోనే కుప్పకూలిపోయింది. 

హీట్‌ అయిపోయిన వెంటనే పోటోకా.. ఆనందంతో అక్కడే ఉన్న తన కోచ్‌, ఇతరులకు నవ్వుతూ అభివాదం చేసింది. అయితే, పైకి వచ్చేందుకు ఆమెకు శరీరం సహకరించలేదు. అకస్మాత్తుగా పూల్‌లో ఉన్న ఇనుపకడ్డీని పట్టుకుని నీటిలోకి జారుకుంది. పరిస్థితిని గమనించిన సిబ్బంది వెంటనే ఆమెను నీటి నుంచి బయటకు తీసి వైద్య సహాయం నిమిత్తం తరలించారు. ఆ దృశ్యాలు అటు సహచరులో, ఇటు ప్రేక్షకులలో భయాందళోనలు పుట్టించాయి. వైద్యం కోసం ఆమెను తీసుకెళ్లినప్పుడు ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపించింది. ఆ సమయంలో ఆమె స్పృహలో ఉన్నట్లు వైద్య సిబ్బంది తెలిపారు.

ఆస్తమా..

వైద్య చికిత్స అనంతరం పొటొకా స్పృహలోకి వచ్చినట్లు ఆ జట్టు అధికారి ఒకరు తెలిపారు. ఆమెకు ఆస్తమా ఉన్నట్లు వెల్లడించారు. సమయానికి ఆమె వద్ద ఇన్‌హెలర్ లేకపోవడంతో ఊపిరి తీసుకోలేకయారని వివరించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.