సర్వర్ డౌన్ అవుతుండడంతో అనేక సార్లు ఆటంకాలు
రేషన్ షాపుల ముందు గంటల తరబడి జనం బారులు
చాలా చోట్ల కనిపించని సోషల్ డిస్టెన్స్
డోంట్ వర్రీ.. నెలంతా పంపిణీ చేస్తామంటున్న ఆఫీసర్లు
హైదరాబాద్, వెలుగు: లాక్డౌన్ నేపథ్యంలో పేదలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న 12 కిలోల బియ్యాన్ని తీసుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మాటిమాటికీ సర్వర్ డౌన్ అవుతుండడంతో రేషన్ పంపిణీ నిలిచిపోతోంది. దీంతో జనం గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూడాల్సి వస్తోంది. అసలే కరోనా ప్రభావం ఉండండటం.. జనం క్యూ లైన్లలో గంటల తరబడి నిలబడాల్సిరావడం.. చాలాచోట్ల సోషల్ డిస్టెన్స్ పాటించకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది.అనేకచోట్ల ఉదయం 5 గంటలకు వస్తేనే టోకెన్ దొరికే పరిస్థితి నెలకొంది. ప్రభుత్వ సూచనల ప్రకారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు బియ్యాన్ని పంపిణీ చేయాలి. అది కూడా అంతకు ముందుగానే టోకెన్లు సరఫరా చేసిన వారికి మాత్రమే ఇవ్వాలి. కానీ సర్వర్ ప్రాబ్లంతో ఆటంకాలు ఎదురవుతున్నాయి. అయితే.. నెలంతా రేషన్ ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందొద్దని అధికారులు అంటున్నారు.
సర్వర్లో సమస్య
ఈ–పాస్ సర్వర్లో సమస్య తలెత్తుతోంది. దీంతో రేషన్ షాపుల్లోని బయోమెట్రిక్ యంత్రాలు సరిగ్గా పనిచేయడంలేదు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ రేషన్ పంపిణీకి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ఉచిత బియ్యం పంపిణీని ఈ నెల 1న రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించారు. మొదటి రోజు నుంచి ఈ సమస్యలు మొదలయ్యాయి. శుక్రవారం చాలా చోట్ల ఇవే తిప్పలు. ప్రతి రేషన్ షాప్ వద్ద పర్యవేక్షణ కోసం ఒక ఆఫీసర్ను నియమించారు. లబ్ధిదారుల కార్డు పరిశీలించి వివరాలు రికార్డ్ చేసుకొని ఆ అధికారే వారికి అప్రూవల్ ఇస్తున్నారు. బయోమెట్రిక్ లేకుండా సరఫరా చేస్తే డీలర్లు అక్రమాలకు పాల్పడే అవకాశం ఉండడంతో ప్రభుత్వం ఈ నిరయ్ణం తీసుకుంది. కానీ సర్వర్ డౌన్ అవుతుండడంతో పంపిణీ ఆలస్యమవుతోంది.
జీహెచ్ఎంసీ పరిధిలో
సర్వర్ డౌన్ తో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో తీవ్ర సమస్య తలెత్తుతోంది. చాలా చోట్ల చాంతాండంత క్యూలైన్లు కనిపిస్తున్నాయి. సర్వర్
డౌన్ కావడంతో కుత్భుల్లాపూర్ పాటిగడ్డ రోడ్డులోని ఓ రేషన్ షాప్ ను డీలర్ మూసేశాడు. అయినా లబ్ధిదారులు అక్కడి నుంచి వెళ్లలేదు. రోడ్డుపై బస్తాలను పెట్టి మరీ లైన్ ఫాలో అయ్యారు. ఎంతకీ సర్వర్ రాకపోవడంతో టోకెన్లు ఇచ్చి తర్వాత పంపిణీ చేస్తామని డీలర్, అధికారి చెప్పారు. ఇక హయత్ నగర్ శాంతినగర్ లో రేషన్ కోసం ముప్పుతిప్పలు పడాల్సి వచ్చింది. శుక్రవారం ఉదయం 6 నుంచే షాప్ ముందు జనం బారులు తీరారు. ఉదయం 10 దాటినా రేషన్ షాప్ తెరవకపోవడంతో డీలర్ పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటితోపాటు అంబర్ పేట, గోల్నాక, మెహిదీపట్నం, లంగర్ హౌస్ తదితర ప్రాంతాల్లో రేషన్ కోసం ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు.
86 లక్షల కుటుంబాలు
రాష్ట్రవ్యాప్తంగా 86 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్ ఉన్నారు. వీరితోపాటు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో చిక్కుకున్న
3 లక్షల 40 వేల మంది వలస కూలీలకు కూడా ఉచితంగా 12 కిలోల బియ్యం ఇవ్వాలని నిర్ణయించారు. లాక్డౌన్ నేపథ్యంలో మన రాష్ట్రానికి చెందిన రేషన్ కార్డు హోల్డర్స్ కుటుంబానికి రూ. 1,500 చొప్పున, వలస కూలీలకు రూ. 500 చొప్పున ఆర్థికసాయం కూడా ప్రకటించారు. రేషన్ తీసుకుంటేనే రూ. 1,500 ఇస్తారనే తప్పుడు ప్రచారం జరగడంతో అందరూ ఎగబడుతున్నారు. ఈ ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదని, రేషన్ తీసుకోని వారికి కూడా రూ. 1,500 ఇస్తామని సివిల్ సప్లై ఆఫీసర్లు చెబుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 14 లక్షల మంది లబ్ధిదారులకు 12 కిలోల ఉచిత రేషన్ ఇచ్చినట్లు వివరించారు.
ఒకేసారి వస్తుండడంతో..
ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5.30 గంటల వరకు రేషన్ పంపిణీ చేస్తున్నం. రోజూ వంద మందికి బియ్యం అందిస్తున్నం. సర్వర్ డౌన్ తో పాటు ప్రజలు ఒకేసారి వస్తుండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నయ్. సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నం. – బీఎస్.మహేందర్, రేషన్ డీలర్, గోల్నాక, జీహెచ్ఎంసీ
సమస్య పరిష్కరిస్తం
రేషన్ లబ్ధి దారులు ఆందోళన చెందొద్దు. అందరికీ రేషన్ అందుతుంది. ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఒకేసారి పెద్దసంఖ్యలో
రేషన్ షాపుల వద్దకు రావొద్దు. ప్రజలు గుమిగూడవద్దు. సర్వర్ డౌన్ సమస్య పరిష్కరించి సప్లై వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నం. రెండురోజుల్లో హైదరాబాద్లోని అన్ని రేషన్ షాపుల ద్వారా పంపణీ మొదలవుతుంది.
– తలసాని శ్రీనివాస్ యాదవ్, మంత్రి
మెషిన్ లేకుండా ఇయ్యాలి
సర్వర్ డౌన్ తో ఇబ్బంది అవుతోంది. మెషిన్ తో సంబంధం లేకుండా పంపిణీ చేయాలి. శుక్రవారం జనం భారీగా వచ్చారు. గంటల
తరబడి క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది.
– జెన్న సుధాకర్, లంగర్ హౌస్
లోడ్ ఎక్కువవడం వల్లే..
రాష్ట్రమంతటా ఒకేసారి రేషన్ సరఫరా ప్రారంభమైంది. దీంతో సర్వర్లపై లోడ్ పెరిగింది. మెషిన్లు మొరాయిస్తున్నయ్. – ఎంకె.రాథోడ్, సివిల్ సప్లైస్ ఆఫీసర్
For More News..