
- 5 సర్కిల్స్ లో వందశాతం పూర్తి
- సర్వే కాగానే 11 అంకెలతో అన్ని ఇండ్లకు యూనిక్ కోడ్లు
- వీటి ఆధారంగా అన్ని రకాల సర్వీస్ లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: జీఐఎస్(జియో ఇన్ఫర్మేషన్ సిస్టం) సర్వే స్లోగా కొనసాగుతోంది. గతేడాది జులైలో ప్రారంభించగా అప్పట్లో ఆరు నెలల్లో పూర్తిచేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఏజెన్సీ నిర్లక్ష్యంతో ఆలస్యం అవుతూ వస్తోంది. నెల కింద వరకు ఈ సర్వే గురించి అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. కొద్దిరోజులుగా ఫోకస్ పెట్టారు. సర్వేతో చాలా ఉపయోగాలు ఉండటంతో వేగంగా పూర్తిచేయాలని భావిస్తున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఏజెన్సీని అధికారులు ఆదేశించారు. ఆ వెంటనే ముంబై తరహాలో ప్రతి ఇంటికి 11 అంకెలతో కూడిన యూనిక్ ఐడీతోపాటు క్యూఆర్ కోడ్ అందించనున్నారు. స్ట్రీట్, వార్డు, సర్కిల్, అసెంబ్లీ కోడ్ లను గుర్తించేలా ప్రతి ఇంటికి ఓ బోర్డుని కేటాయించనున్నారు. దాని ఆధారంగా అన్ని సేవలు అందించనున్నారు.
దేనికీ ఇబ్బంది లేకుండా..
ఈ యూనిక్ నంబర్ తో క్యాబ్ బుక్ చేసినా, ఫుడ్, వస్తువులతో పాటు ఆన్ లైన్ లో ఏది బుక్ చేసినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటికే డెలివరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్డర్లు ఇంటికి అటు, ఇటు లోకేషన్లకు వెళ్తున్నాయి. డెలివరీ బాయ్స్ కి పదేపదే కాల్ చేసి గైడ్చేయాల్సి వస్తోంది. ఈ సమస్యకి కొత్తగా అందుబాటులోకి వచ్చే యూనిక్ ఐడీతో చెక్ పడనుంది. కాలనీల్లో ఉన్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చేందుకు యూనిక్ ఐడీ చాలా ఉపయోగపడనుంది. డైలీ చెత్త ఆటో కూడా వస్తుందో లేదో అధికారులు తెలుసుకునేందుకు వీలుంటుంది.
5 సర్కిళ్లలో వందశాతం సర్వే..
650 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న హైదరాబాద్ మహానగరంలో రెసిడెన్షియల్, కమర్షియల్ భవనాలతో కలిపి సుమారు 19 లక్షల 43 వేల నిర్మాణాలు ఉన్నాయి. అందులో కమర్షియల్ గా 2.7 లక్షల భవనాలు ఉన్నాయి. ఇప్పటికే కాప్రా, ఉప్పల్, ఎల్బీనగర్, హయత్ నగర్, సరూర్ నగర్ 5 సర్కిళ్లలో వందశాతం డ్రోన్ సర్వే పూర్తయింది. కాలనీల్లో డాకెట్ వారీగా ఇంటి విస్తీర్ణంతో పాటు ఆ ఆయా ఇండ్లు కమర్షియల్ లా, రెసిడెన్షియల్ లా అన్న వివరాలు సేకరిస్తున్నారు.
ఏజెన్సీ ఇచ్చిన నివేదిక కరెక్ట్ గా ఉందో లేదా తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ అధికారులు మరోసారి పరిశీలించి ఫైనల్ చేయనున్నారు. ఆ తరువాత యూనిక్ ఐడీ లు జారీ చేయనున్నారు. గ్రేటర్ అంతట సర్వే పూర్తి అయ్యేదందుకు మరో నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది.