నత్తనడకన ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు

  • నాలుగేండ్లుగా డెడ్​ స్లోగా ఉప్పల్ - నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు
  • భూసేకరణలో జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
  • సర్వీసు రోడ్డుల కోసం భూమి ఇచ్చినోళ్లకు అందని పరిహారం
  • తవ్విపోసిన మట్టి, గుంతలతో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్య 

సికింద్రాబాద్, వెలుగు :ఉప్పల్ నుంచి వరంగల్​వెళ్లే రూట్ లో ట్రాఫిక్​సమస్యను పరిష్కరించేందుకు స్టార్ట్​చేసిన ఎలివేటెడ్​కారిడార్ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. శంకుస్థాపన చేసి నాలుగేండ్లు అవుతున్నా ఇప్పటివరకు పనులు పిల్లర్లు దాటలేదు. ఒకడుగు ముందుకు పడితే.. మూడడుగులు వెనక్కి అన్న చందంగా తయారైంది పరిస్థితి. ట్రాఫిక్​సమస్య పరిష్కారం కాకపోగా పనులు మరింత ట్రాఫిక్​ను సృష్టిస్తున్నాయి. ఫ్లైఓవర్​పనుల కోసం ఎక్కడికక్కడ తవ్విపోసిన మట్టి, రోడ్లపై గుంతలు, వెహికల్స్​వెళ్లే టైంలో రేగుతున్న దుమ్ముతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్​అవుతోంది.

2018లో శంకుస్థాపన..

ఉప్పల్ నుంచి నారపల్లి వరకు రూ.626.76 కోట్ల అంచనా వ్యయంతో ఎలివేటెడ్​కారిడార్ నిర్మించాలని నిర్ణయించగా, 2018 మే నెలలో కేంద్ర మంత్రి నితిన్​గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ఫ్లైఓవర్ రామంతాపూర్ వద్ద ప్రారంభమై నారపల్లి సెంట్రల్​ పవర్​రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ వద్ద ముగుస్తుంది. మొత్తం 148 పిల్లర్లపై 45 మీటర్ల వెడల్పుతో ఆరు లైన్లలో నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఎలివేటెడ్​కారిడార్ కు ఇరువైపులా 150 అడుగుల విస్తీర్ణంతో సర్వీసు రోడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 2022 నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని టార్గెట్​పెట్టుకోగా ఆ స్థాయిలో పనులు జరగలేదు. నాలుగేండ్లలో పిల్లర్లు వరకు మాత్రమే పూర్తిచేశారు. ప్రీ-కాస్ట్ పద్ధతిలో పిల్లర్లపై స్లాబ్​ఏర్పాటు పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.148 పిల్లర్లలో128 పిల్లర్లు వేశారు. మిగిలినవి వేయాల్సి ఉంది. నారపల్లి వద్ద ఓ ఐదారు పిల్లర్లపై మాత్రమే ఇప్పటివరకు స్లాబు వేశారు. కాగా పిల్లర్ల ఏర్పాటు కోసం ఎక్కడికక్కడ తవ్విపోయడంతో రోడ్డంతా గుంతల మయంగా మారింది. వాహనాలు వెళ్తున్నప్పుడు దుమ్ము రేగుతోంది.

లేటుకు ఇవే ప్రధాన కారణాలు

రామంతాపూర్ నుంచి ప్రారంభమవుతున్న ఈ ఎలివేటెడ్ కారిడార్ ఉప్పల్ మెట్రో లైను పైనుంచి నిర్మించాల్సి ఉంది. అయితే మొదట నిర్ణయించిన దానికంటే కారిడార్​ఎత్తును మరింతగా పెంచాలని అధికారులు నిర్ణయించారు. పెంచిన ఎత్తుకు అనుగుణంగా స్టీలు, ఇతర మెటీరియల్ ఖర్చు పెరిగింది. దీంతో పనుల్లో కొంత జాప్యం జరుగుతోంది. అలాగే కారిడార్​కు ఇరువైపులా నిర్మిస్తున్న సర్వీసు రోడ్ల కోసం భూసేకరణ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు భూమి ఇచ్చినవారికి నష్ట పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తోందంటున్నారు. పరిహారాన్ని విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. త్వరగా భూసేరణ చేసి కేంద్రానికి రిపోర్టు ఇవ్వడంలో తాత్సారం చేస్తుందని నిర్వాసితులు చెబుతున్నారు. అలాగే నష్టపరిహారం విషయంలో కొందరు కోర్టును ఆశ్రయించడం కూడా లేటుకు కారణమైంది. మొత్తంగా భూసేకరణ పూర్తయితే గానీ పనుల్లో వేగం పెరగదని అధికారులు చెబుతున్నారు.

ఈ రూటు చాలా కీలకం


హైదరాబాద్​కు తూర్పు వైపున ఉప్పల్– వరంగల్​రూట్​చాలా కీలకం. యాదాద్రి, వరంగల్ వైపు నుంచి వచ్చే, వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు ఇటుగానే ప్రయాణించాలి. రోజూ 30వేల నుంచి 40 వేల వాహనాలు ఈ రూటు గుండా వెళ్తాయి. ఇంత కీలకమైన దారిలో ట్రాఫిక్​లేకుండా చూద్దామని చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్​పనులు మరింత ట్రాఫిక్​ను సృష్టిస్తున్నాయి. రోజూ కిలోమీటర్ల మేర ట్రాఫిక్​నిలుస్తోంది. ముఖ్యంగా ఉప్పల్​క్రాస్​రోడ్డు, నల్లచెరువు కట్ట, కట్టమైసమ్మ టెంపుల్​ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంటోంది. ఈ మార్గంలోనే హాస్పిటల్స్​ ఎక్కువగా ఉన్నాయి. వాటికి వచ్చే అంబులెన్సులు రోజూ ట్రాఫిక్​లో చిక్కుకుంటున్నాయి. ఉప్పల్ నుంచి బోడుప్పల్​కు 2  నుంచి 3 నిమిషాల్లో చేరాల్సి ఉండగా ప్రస్తుతం 15 నుంచి 20 నిమిషాలు పడుతోంది. పీక్​అవర్స్​లో 30 నిమిషాలకు మించుతోంది. పనుల కారణంగా మేడిపల్లి రింగ్​రోడ్డు ప్రాంతంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 

ఇప్పట్లో అయ్యేలా లేదు

ఎలివేటెడ్​కారిడార్​పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. మరో రెండేళ్లలో కూడా ప్రాజెక్టు పూర్తయ్యేలా కనిపించడం లేదు. మేడిపల్లి నుంచి ఉదయం, సాయంత్రం టైంలో ఉప్పల్​చేరుకోవడానికి గంట టైం పడుతోంది. ప్రాజెక్టు నిర్మాణంతో ట్రాఫిక్​సమస్య పోతుందనుంటే మరింత పెరిగింది. అధికారులు పనులన స్పీడప్​చేయాలి.   

మల్లికంటి వీరన్న, మేడిపల్లి
భూసేకరణను త్వరగా పూర్తిచేయాలి

ఫ్లైఓవర్​కోసం రోడ్లు తవ్వేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. వాహనాలు వెళ్లే టైంలో దుమ్ము రేగి స్థానికులు అస్వస్థతకు గురవుతున్నారు. కారిడార్​కు ఆనుకొని నిర్మిస్తున్న సర్వీసు రోడ్లకు అవసరమైన భూమిని త్వరగా సేకరించాలి. పనుల్లో వేగం పెంచి రోడ్లతోపాటు ఫ్లైఓవర్​ను అందుబాటులోకి తేవాలి.  

- చంద్రశేఖర్, ఉప్పల్