చిన్న రైతులు లక్షాధికారులైతరు

తెలంగాణలోని ఓ చిన్న పల్లెటూరు ముత్యంపేటలో ఓ రైతు కుటుంబంలో పుట్టిన నాకు పెద్ద రైతులకు ఉండే ప్రయోజనాలు, చిన్న రైతులు ఎదుర్కొనే సవాళ్లు గురించి అనుభవం ఉంది. అది వ్యవసాయం కావచ్చు లేదా ఉత్పత్తికి సంబంధించిన ఏదైనా వృత్తి కావచ్చు, వాటిలో సహజంగానే పెద్ద రైతులకు ప్రయోజనం ఉంటుంది. అయితే ఈ తేడా అలాగే ఉండాలని లేదు. ప్రాథమిక వ్యాపార లక్షణాలను అనుసరించడం ద్వారా ఈ ప్రతికూలతను తిప్పికొట్టవచ్చు. దీనికి అద్భుత ఉదాహరణ అమూల్. గుజరాత్లోని కైరాలో సన్నకారు పాడి రైతులంతా ఒక్కతాటిపై నిలిచి పాలు, పాల ఉత్పతులకు తిరుగులేని జాతీయ బ్రాండ్ అమూల్ను సృష్టించారు. స్వాతంత్ర్యానికి పూర్వం రోజుకు 1 లీటర్ లేదా 2 లీటర్లు మాత్రమే ఉత్పత్తి చేయగల పాడి రైతులకు తమ ఉత్పత్తులు సొంతంగా అమ్ముకునే వెసులుబాటు ఉండేది కాదు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం పాల వ్యాపారానికి ఒక కంపెనీని మాత్రమే ఎంచుకునే స్వేచ్ఛ కల్పించింది. గ్రామస్తులంతా సహకార సంఘంగా ఏర్పడి పాలు అమ్ముకోవాలని సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ సూచించారు. 1946లో  పాల సహకార సంఘం  రిజిస్టర్ అయింది. అప్పటి నుంచి అసామాన్య రీతిలో ఎదుగుతూ హెచ్ఎం దాలయ్య, డాక్టర్ వర్గీస్ కురియన్ నాయకత్వంలో లక్షలాది మంది చిన్న పాడి రైతులను లక్షాధికారులను చేసింది. అమూల్ ఓ కేస్ స్టడీ సమిష్టి సాగు, సంస్థాగత సాగు లేదా సహకార సాగు అనేది  చిన్న, సన్నకారు రైతులను ఎలా మార్చుతుందో తెలుసుకునేందుకు అమూల్ ఒక మంచి కేస్ స్టడీ.  చిన్న, సన్నకారు రైతులంతా సమిష్టిగా ఒక పెద్ద బృందంగా ఏర్పడటం ద్వారా ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు ఉత్పాదకతను పెంచుకోవచ్చు. దాంతో పాటు మంచి మార్కెటింగ్ విధానాలు అందిపుచ్చుకుంటూ మార్కెట్లోకి ప్రవేశించి తమ ఉత్పత్తులకు ఎలా మంచి లాభాలు పొందుతున్నారో ఈ కేస్ స్టడీ వివరిస్తుంది. పాడి రైతులు తమ ఉత్పత్తి సామర్థ్యాన్ని అనుబంధ రంగాలకు విస్తరిస్తూ ప్రత్యామ్నాయ ఆదాయం పొందేలా అమూల్ కృషి చేస్తోంది. దీని వలన ప్రతికూల ఆర్థిక పరిస్థితులను ఎదుర్కోవడమే కాదు తమ పనికి మరింత విలువను అదనంగా పొందగలుగుతున్నారు. రైతులను ఓటు బ్యాంక్ గానే చూశారు ఈ తరహా విధానాన్ని దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోని వరి, గోధుమ, ఇతర  పంటలు పండించే రైతులు ఎందుకు అనుసరించడం లేదనే విషయం నేను ఎదుగుతున్న కొద్ది నన్ను తొలిచివేసేది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ ఇంకొన్ని రాష్ట్రాల్లో సహకార వ్యవసాయం విజయవంతంగా సాగుతున్నా.. ఈ సమిష్టి సాగు జాతీయస్థాయి నమూనాగా ఎందుకు కాలేకపోయింది? చాలా రాష్ట్రాలు వ్యవసాయ సహకార వ్యవస్థ, సమిష్టి సాగును ఎందుకు ప్రోత్సహించడం లేదు? భారత వ్యవసాయ సమాజంలో ఇప్పటికీ 85%  మంది చిన్న, సన్నకారు రైతులుగానే ఎందుకు మిగిలారు? వాణిజ్యపరంగా తమకున్న అతి తక్కువ పొలంలో పండే ఉత్పత్తి గిట్టుబాటు కాదని తెలిసి రైతులు సొంతంగా ఎందుకు సాగు చేస్తున్నారు? ఇలా ఎందుకు జరుగుతుందో నాకు కాలక్రమంలో అర్థమైంది. దేశంలో “వ్యవస్థీకృత రైతు సంఘాలు” అన్నవి కాంగ్రెస్, దాని ప్రాంతీయ తోక పార్టీల రాజకీయ అజెండాకు సరిపోదనే విషయం నేను గ్రహించాను. పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్న రైతులు సాధికారత పొంది, చదువుకొని, సంపన్నులుగా మారితే తమ పప్పులు ఉడకవనే విషయం ఆ పార్టీలకు తెలుసు కాబట్టి సాధికార కల్పన పేరుతో రైతులను నిర్భాగ్యులుగా ఉండేలా చేశారు. దేశ జనాభాలో చిన్న, సన్నకారు రైతులు దాదాపు 85 కోట్ల మంది ఉంటారు. అతి పెద్ద ఓటర్ల సమూహం కాబట్టి ఎవరూ వారిని విస్మరించలేరు. రైతు సమాజం సాధికారత పొంది సంపన్నులుగా మారితే పొరపాటున తమను ఎన్నుకోరని కాంగ్రెస్, దాని మిత్రపక్షాల భయం. వ్యవసాయ రంగం వాస్తవ సామర్థ్యాన్ని గుర్తించలేదు తప్పనిసరి పేదరికం, ప్రభుత్వంపై ఆధారపడటం, ఉచిత కానుకల వంటివే రైతుల సమస్యలకు పరిష్కారమనే ముసుగుతో దేశ ఎన్నికల రాజకీయాలు దశాబ్దాలుగా సాగాయి. వాస్తవానికి అవి గాయానికి బ్యాండ్ ఎయిడ్ వంటి పరిష్కారం కూడా కాదు. 70 ఏండ్లుగా ఈ విఫల సోషలిస్టు విధానాలు అనుసరిస్తున్నందున దేశంలో రైతు ఆత్మహత్యలు, పేదరికం పెరుగుతూనే ఉన్నాయి. 85 కోట్ల మంది రైతులకు స్వీయ-జీవనోపాధి లేదు. ఏండ్లుగా అనుసరిస్తున్న ఈ ఎన్నికల తంత్రాల కారణంగా కోట్లాది మంది రైతులు ఇప్పటికీ నిరక్షరాస్యులుగా ఉంటూ ప్రభుత్వం అందించే ఉచిత పథకాలే ఆధారమని నమ్ముతున్నారు. వ్యవసాయ సహకార వ్యవస్థ ఏర్పడి, రాణించకపోవడమన్నది చాలా ప్రాంతీయ పార్టీల స్వార్థ రాజకీయ సంకుచితతత్వాన్ని తెలియజేస్తుంది. ఒకవేళ అలాంటి వ్యవస్థ ఏర్పడి ఎదిగేందుకు ప్రయత్నిస్తే ఈ పార్టీలు వాటిని తమ రాజకీయ, ధనబలంతో  అణచివేస్తాయి. భారీగా సాగు చేసేందుకు మెలకువలు, అనుభవ పరిజ్ఞానంతో పాటు శారీరకంగా శ్రమించేతత్వం మన రైతులకు ఉంది. పుష్కలమైన సాగునీరు, సారవంతమైన నేల కలిగిన భౌగోళిక పరిస్థితులు బహుళ పంటలకు అనుకూలం. స్వావలంబన సాధించడమే కాదు వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ కేంద్రంగా మారి మొత్తం ప్రపంచానికి వ్యవసాయ ఉత్పత్తులు ఎగుమతి చేయగల సత్తా మనకు ఉంది.  దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మన రైతులు, వ్యవసాయరంగ వాస్తవ సామర్థ్యాన్ని ఇంత వరకు పైపైన కూడా స్పృశించడం లేదు. సమిష్టి సాగు ఒక్కటే పరిష్కారం వ్యవసాయం అన్నది ఇతర వ్యాపారాల తరహాలో ఉండదు. అనియంత్రిత వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తిని ప్రభావితం చేసే ఇతర ఒడిదుడుకుల కారణంగా అనిశ్చితి ఉంటుంది. ఆ కారణంగా పూర్తిగా ఆధారపడే పరిస్థితి ఉండదు. అయితే ఇవన్నీ కూడా పంట బీమా ద్వారా సంరక్షించవచ్చు. అంతే కాదు ముప్పు నుంచి సాంత్వన పొందేందుకు కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే లాభాలపై విశ్వసనీయతను పెంచుకోవచ్చు.పరిస్థితులన్నీ అనుకూలించినా చిన్న, సన్నకారు రైతులు మంచి లాభాలు పొందుతారని లేదు. అకాల వర్షాలు, వరదలు, ప్రతికూల వాతావరణ పరిస్థితులు మాత్రమే కాదు వారిని ఇబ్బందులకు గురిచేయడం లేదు. లాభాలు రాకపోవడానికి కారణం స్థాయి. వ్యాపారంలో ప్రతీది స్థాయిపైనే ఆధారపడి ఉంటుంది. అది వ్యవసాయ ఉత్పత్తికి కూడా వర్తిస్తుంది. సమిష్టి సాగు ద్వారా పెద్ద పొలాలుగా మారడం వలన అధిక స్థాయిలో ఉత్పత్తి సాధించే వెసులుబాటు లభిస్తుంది. చిన్న రైతులు తమ పొలాలను సమీకరించుకొని వాటి స్థాయి పెంచుకోవడం ద్వారా భారీ స్థాయిలో సాగు చేసుకోవచ్చు.చిన్న తరహా సాగులో ఉండే అనిశ్చితిని తొలగించేందుకు ఇంతకు మించిన పరిష్కారం లేదు. ముప్పును పెద్ద వ్యాపారికి బదిలీ చేసి తమ ఆదాయాన్ని పలు రెట్లు పెంచుకోవడానికి మించిన మార్గం చిన్న రైతులకు ఉంటుందా? వ్యవసాయాన్ని వ్యాపారంగా చూడాలి వ్యవసాయం లేదా సాగు అన్నది సామాజిక సేవ కానప్పటికీ అది ఆహార సరఫరా ద్వారా సమాజం స్వావలంబన సాధించేలా చూస్తుంది. దేశంలో 50% మందికి ఈ రంగం ఉపాధి చూపుతున్నా దీన్ని వ్యాపారంగా చూడటంలేదు. తయారీ, సేవా రంగాల్లో వచ్చే పెట్టుబడులతో పోల్చితే వ్యవసాయ రంగంలోకి వచ్చే ప్రైవేట్  పెట్టుబడులు అతి తక్కువ. పూర్తిస్థాయి పనివాళ్లు(రైతులు) శ్రమించి ఉత్పత్తిని తయారు చేసే పని దీర్ఘకాలం నిలదొక్కుకోవాలంటే లాభాలు ఆర్జించాల్సిందే. అస్థిరమైన, లాభాలు లేని పనుల వలన ఆ పని కొనసాగేందుకు వెసులుబాటు ఉండదు. వ్యవసాయ రంగానికి పూర్తిస్థాయి పెట్టుబడులు అంటే పరిశోధన మొదలు ఇన్పుట్, ఉత్పత్తి, ఔట్పుట్, స్టోరేజ్, ప్రాసెసింగ్, రవాణా, మార్కెటింగ్, ఎగుమతులు సహా అన్ని రంగాలకు అవసరం. కానీ గడిచిన 70 ఏండ్లుగా ఈ రంగపు మానవవనరులకు(రైతులు) అందిన ప్రయోజనం శూన్యం. 24/7 శ్రమించి పంట పండించే రైతులు, పంట చేతికి వచ్చిన తర్వాత తమకు లాభం వస్తుందో రాదో అనే అనిశ్చితి ఉండకూడదు. ఈ రంగం కొనసాగాలంటే సందిగ్థతకు తావుండరాదు. వ్యవసాయాన్ని వృత్తిగా రైతులు భావిస్తే ఖర్చులు తగ్గించేందుకు, ఉత్పత్తి పెంచుకునేందుకు, ఉత్పత్తితో మంచి లాభాలు పొందేందుకు అన్ని చర్యలు తీసుకోవచ్చు. మార్పు తీసుకొచ్చేందుకే కొత్త చట్టాలు వ్యవసాయ రంగంలో భారీ సంస్కరణలను ప్రధాని మోడీ ఎంతో సాహసోపేతంగా చేపట్టారు. అసంపూర్ణ, అర్థహృదయంతో చేసే పాక్షిక సరళీకృత సంస్కరణల ద్వారా అటు వ్యవసాయ రంగానికి, ఇటు రైతులకు ఎలాంటి ప్రయోజనం కలగదనే విషయం ఆయన అర్థం చేసుకున్నారు. రైతుకు విముక్తి కల్పించి ప్రభుత్వపరంగా ఎలాంటి జోక్యం లేకుండా వారు సాధికారత సాధించేలా ప్రభుత్వం వ్యవసాయ సంస్కరణలు చేపట్టింది. వ్యవసాయ రంగంలో అవసరమైన మార్పును తీసుకువచ్చే మూడు చట్టాలపై కొన్ని రైతు సంఘాలు సవాల్ చేస్తున్నాయి. ఇన్నాళ్లు రైతుల ఎదుగుదలను అడ్డుకున్న కొన్ని పార్టీల తప్పుడు మాటలు వారు వింటుండటం దురదృష్టకరం. నిర్ణయాత్మక శక్తి ద్వారానే సమృద్ధి కొన్ని స్వార్థ రాజకీయ శక్తులు దశాబ్దాలుగా చిన్న రైతులను పేదరికంలోనే మగ్గేలా చేశాయి.  ఈ ప్రపంచంలో చిన్నది ఏదైనా అణిచివేతకు గురవుతుందని నేను నమ్ముతున్నాను. కాబట్టి చిన్న వాళ్లంతా ఒక్కటై పెద్దగా మారితే అణిచివేతకు ఆస్కారం లేకుండా పోతుంది. ప్రధాని మోడీ తెచ్చిన మూడు కొత్త చట్టాలు దీనికి సాయపడతాయి. చిన్న, సన్నకారు రైతులు అనేవారు లేకుండా చేస్తాయి. సమిష్టి సాగు ద్వారా లాభదాయకమైన ఫలితాలు పొందేందుకు చిన్న రైతులంతా ఒక్కటై పెద్ద బృందాలుగా ఏర్పడి బలాన్ని పెంపొందించుకొని, తమ శక్తియుక్తులను స్థిరపరుచుకోవాలి. అలా చేస్తే చిన్న రైతులంతా సంపన్నులుగా మారుతారు. కానీ, దాని కోసం వారిని విముక్తిపథంలో నడిపేందుకు రూపొందించిన మూడు కొత్త చట్టాలను వారు విశ్వసించాలి.     -కె. కృష్ణసాగర్ రావు ,బీజేపీ రాష్ ట్ర ముఖ్య అధికార ప్రతినిధి