- మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో శరవేగంగా పనులు
- మే28లోగా కంప్లీట్ చేయాలని టార్గెట్
- వైఎస్ హయాంలో ప్రారంభం, బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంతో ఆగిన పనులు
- ఐదు మండలాల్లో 45 వేల ఎకరాలకు సాగునీరు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: పదేళ్ల కింద ఆగిపోయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనుల్లో మళ్లీ కదలిక మొదలైంది. 45 వేల ఎకరాలకు సాగు నీరందించాలన్న ఉద్దేశంతో వైఎస్‌ఆర్ హయాంలో ప్రాజెక్ట్ నిర్మాణాన్ని స్టార్ట్ చేశారు. కొంత మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత బీఆర్‌ఎస్ అధికారంలోకి రావడంతో ప్రాజెక్ట్ మూలకు పడింది. ఇప్పుడు మంత్రి శ్రీధర్‌బాబు చొరవతో పనులు మొదలయ్యాయి. మే 28 లోగా పనులను కంప్లీట్ చేయాలన్న లక్ష్యంతో పనులు చేస్తున్నారు.
45 వేల ఎకరాలకు సాగు నీరివ్వడమే లక్ష్యంగా..
పాత కరీంనగర్, ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలో గోదావరి తీరం వెంట ఉన్న రైతులు సాగునీటి కోసం అనేక పోరాటాలు చేశారు. పక్కనే గోదావరి పారుతున్నా చుక్క నీటిని వినియోగించుకోలేకపోతున్నామంటూ ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టారు. దీంతో 2008లో అప్పటి సీఎం వైఎస్. రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేసింది. ఇందులో భాగంగా రెండు పంప్‌హౌజ్‌లను నిర్మించి, 4.5 టీఎంసీల గోదావరి నీటిని లిఫ్ట్ చేసి, 5 మండలాల్లో 13 చెరువులను నింపాలని ప్లాన్ చేశారు. భూగర్భ పైప్‌లైన్స్, గ్రావిటీ కెనాల్స్ ద్వారా 45 వేల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా కాటారం మండలంలో 26,815 ఎకరాలు, మహాదేవ్‌పూర్, పలిమెలలో 10,077, మహాముత్తారంలో 6,762, మల్హర్‌రావు మండలంలో 1,626 ఎకరాలకు సాగునీరు అందనుంది. పెద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ప్రధానమైన కన్నెపల్లి పంప్‌హౌజ్‌కు 3 కిలోమీటర్ల దిగువన గోదావరి నదిపై బీరసాగర్ వద్ద పంప్‌హౌజ్ నిర్మించారు. రూ.571 కోట్లకు టెక్నికల్ శాంక్షన్ ఇవ్వగా రూ.499.23 కోట్లకు టెండర్లు ఫైనల్ చేశారు. ఐవీఆర్‌సీఎల్, కేబీఎల్, మెయిల్ (మేఘా) కంపెనీలు జాయింట్‌గా పనులు దక్కించున్నాయి. మేఘా కంపెనీ పనులు చేస్తోంది.
పదేళ్ల తర్వాత మొదలైన పనులు
చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో పదేళ్ల కింద ఆగిపోయిన పనులు ఇటీవల మళ్లీ మొదలయ్యాయి. ప్రాజెక్ట్ పనులు చేపట్టాలని సర్కార్ ఆదేశించడంతో కలెక్టర్ భవేశ్ మిశ్రా ఇప్పటికే రెండు సార్లు ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ పరిధిలో నిర్మించిన రెండు పంప్‌హౌజ్‌లను పరిశీలించారు. రెవెన్యూ, ఇరిగేషన్ ఆఫీసర్లతో కలిసి కాటారం మండలంలోని చింతలచెరువు, కొత్త చెరువు, మందిరం చెరువు, ఎర్ర చెరువులను, మహాదేవపూర్ వద్ద ఆగిపోయిన పైప్‌లైన్ పనులను కూడా పరిశీలించారు. భూమిలోంచి పైప్‌లైన్లు వేస్తున్నందున రక్షణగా హద్దులు ఏర్పాటు చేయాలని సూచించారు. మిగిలిన 2,060 ఎకరాల భూసేకరణకు సంబంధించి పనులు కంప్లీట్ చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. మహదేవ్‌పూర్ మండలంలోని బీరసాగర్ పంప్‌హౌజ్ వద్ద ఇరిగేషన్ ఇంజినీర్లు పనులు చేస్తున్నారు. గోదావరి నుంచి పంప్‌హౌజ్‌లోకి వాటర్ వచ్చే గ్రావిటీ కెనాల్ పనులు సైతం చేయిస్తున్నారు. పంప్‌హౌజ్‌లో ఇప్పటికే అమర్చిన మోటార్లకు రిపేర్లు చేయిస్తున్నారు.
బీఆర్‌ఎస్ సర్కార్ నిర్లక్ష్యం
చిన్న కాళేశ్వరం పనులను దక్కించకున్న కాంట్రాక్ట్ సంస్థ సివిల్ వర్క్స్‌ను కంప్లీట్ చేసింది. బీరసాగర్, కాటారంలో పంప్‌హౌజ్‌లను నిర్మించి 8.5 మెగావాట్ల కెపాసిటీ గల ఏడు మోటార్లను బిగించారు. స్టేజీ ‒1లో 44.04 కిలోమీటర్ల పైప్‌లైన్ నిర్మాణానికి 43.85 కిలోమీటర్లు, స్టేజ్ – 2లో 22.67 కిలోమీటర్లకుగానూ 16.42 కిలోమీటర్ల దూరం పైప్‌లైన్ వేశారు. బీరసాగర్ వద్ద 132/11 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌ను కూడా నిర్మించారు. గోదావరి నది నుంచి పంప్ హౌజ్‌లోకి నీరు వచ్చేందుకు అప్రోచ్ కెనాల్ తవ్వి ఫోర్‌బే నిర్మించారు. చిన్న, చిన్న పనులు మినహా ఎలక్ర్టికల్, ఇంజినీరింగ్ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేశారు. మొత్తం నిధుల్లో రూ. 325 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఆ తర్వాత బీఆర్‌ఎస్ సర్కార్ అధికారంలోకి రావడం, ఈ ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించకపోవడంతో భూ సేకరణ జరుగక కాల్వల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇంకా 2,060 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాజెక్ట్ పనులు ఎక్కడికక్కడే ఆగిపోయాయి.
స్థానిక రైతులకు తొలి ప్రాధాన్యం
కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో రూ. లక్ష కోట్లు ఖర్చు చేసి భూపాలపల్లి జిల్లా నుంచి గోదావరి నీళ్లను లిఫ్ట్ చేసి సిద్దిపేట, గజ్వేల్ జిల్లాలకు తరలించిన బీఆర్‌ఎస్ సర్కార్ స్థానిక రైతులను విస్మరించింది. ఇక్కడ ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదు. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే భూపాలపల్లి జిల్లా రైతులకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని భావించింది. దీంతో మంత్రి శ్రీధర్‌బాబు చొరవ తీసుకొని సీఎం రేవంత్‌రెడ్డి, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడి చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. 65 శాతానికిపైగా పనులు పూర్తై పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్న ప్రాజెక్ట్‌ను కంప్లీట్ చేయించేందుకు అవసరమైన నిధులు కేటాయించేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు.
రెండు నెలల్లో నీరందిస్తాం
భూపాలపల్లి జిల్లాలో ఆగిపోయిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను తిరిగి ప్రారంభించి రెండు నెలల్లో సాగు నీరందించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. వచ్చే వానాకాలం పంటకు నీరివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే ఇరిగేషన్ ఇంజినీర్లు, రెవెన్యూ ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించాం. క్షేత్రస్థాయిలో పెండింగ్‌లో ఉన్న పనులను స్వయంగా పరిశీలించి రిపేర్లు చేయాలని ఆదేశాలు జారీ చేశాం.
-భవేశ్ మిశ్రా, భూపాలపల్లి కలెక్టర్