- ఒక్క అగ్రంపహాడ్‌కే సుమారు 25 లక్షల మంది వచ్చే ఛాన్స్
- ఇప్పటివరకు ఎలాంటి ఏర్పాట్లు చేయని ఆఫీసర్లు
హనుమకొండ, వెలుగు : ఓరుగల్లు జిల్లాలో జాతర్ల సందడి మొదలుకానుంది. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారంలో సమ్మక్క సారలమ్మ మహా జాతర జరుగనుండగా, అదే టైంలో హనుమకొండ జిల్లాలోని మరో 12 చోట్ల సైతం మినీ మేడారం జాతర్లు జరగనున్నాయి. ఆయా జాతర్లకు టైం దగ్గర పడుతున్నప్పటికీ ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఓ వైపు మేడారం మహా జాతరకు సన్నద్ధమవుతూనే మిగిలిన జాతర ప్రదేశాల్లో ఏర్పాట్లు పూర్తి చేయడం, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టడం ఆఫీసర్లకు సవాల్‌గా మారింది.
అగ్రంపహాడ్... మినీ మేడారం
హనుమకొండ జిల్లాలో జరిగే సమ్మక్క- సారలమ్మ జాతర్లలో ఆత్మకూరు మండలం అగ్రంపహాడ్ జాతర ప్రధానమైనది. సమ్మక్క స్వగ్రామంగా చెప్పుకునే ఈ అగ్రంపహాడ్ జాతరకు ప్రతీసారి 25 లక్షల మందికి పైగానే భక్తులు వస్తుంటారు. భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు చేసేందుకు ప్రభుత్వం తరఫున రూ.59 లక్షలు మంజూరు చేశారు. ఈ నిధులతో తాగునీటి సౌకర్యం కల్పించడంతో పాటు క్యూ లైన్లు, రోడ్లు ఇతర పనులు చేయాల్సి ఉంది. అయితే జాతర మరో 20 రోజులే ఉండగా పనులు మాత్రం ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. మేడారం తర్వాత పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే జాతర కావడంతో పనులు స్పీడప్ చేయాలని పలువురు కోరుతున్నారు.
కమలాపూర్‌లో నాలుగు చోట్ల
కమలాపూర్ మండలంలో నాలుగు గ్రామాల్లో సమ్మక్క -సారలమ్మ జాతర జరగనుంది. ఇందులో ప్రధానంగా కమలాపూర్ మండల కేంద్రానికి సమీపంలోని కన్నూరుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ప్రజలు తరలివస్తుంటారు. జాతర జరిగే మూడు రోజుల్లోనే 50 వేల మందికి పైగా భక్తులు వచ్చి మొక్కులు సమర్పిస్తుంటారు. దీంతో పాటు మర్రిపెల్లిగూడెం, కమలాపూర్, గూనిపర్తి -మాదన్నపేట సమీపంలో కూడా సమ్మక్క జాతర్లు జరుగుతుంటాయి.
మొక్కులు సమర్పించే వారి సంఖ్య అన్ని చోట్లా వేలల్లోనే ఉంటుంది. ఈ నాలుగు గ్రామాల్లో ఎక్కడా కూడా ఇప్పటివరకు ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. గతంలో ఏర్పాటు చేసిన జాతర కమిటీలను రద్దు చేయగా, ఇప్పుడు కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తేనే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఇక్కడ సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రతీసారి భక్తులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు.
అంతటా ఫుల్ రష్
భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సమ్మక్క -సారలమ్మ జాతర ఘనంగా జరుగుతుంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సుమారు 2 లక్షల మందికి పైగా భక్తులు వస్తుంటారు. ఇదే టైంలో కొత్తకొండలోనూ జాతర జరగనుంది. ఇక హనుమకొండ జిల్లా కాజీపేట మండలంలో ఉర్సుగుట్ట వద్ద అమ్మవారిపేటలోనూ జాతర జరుగుతుంది. ఇక్కడ 1977 నుంచే జాతర జరుగుతోంది.
శాయంపేట మండలం పెద్దకోడెపాక రెవెన్యూ జోగంపల్లిలో జరిగే జాతరకు పరకాల, రేగొండ, శాయంపేట మండలాల నుంచి 60 వేల మందికిపైగా వస్తుంటారు. మరోవైపు నడికుడ మండలంలోని కంఠాత్మకూరు, పులిగిల్ల గ్రామాల్లో జరిగే జాతర్లకు లక్షకుపైగా భక్తులు వస్తుంటారు. వేలేరు మండలంలోని ఎర్రబెల్లి గ్రామంలో కూడా సమ్మక్క జాతర నిర్వహించనున్నారు.
సవాల్‌గా మారనున్న ఏర్పాట్ల నిర్వహణ
మేడారం మహాజాతర త్వరలోనే ప్రారంభం కానుండడంతో అక్కడికి వెళ్తే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రోడ్ల రిపేర్లు, సైన్ బోర్డులు, ఇతర భద్రతా చర్యలు చేపట్టేందుకు ఫిబ్రవరి 10 వరకు డెడ్‌లైన్ పెట్టడంతో ఇతర జాతర్లు ఆఫీసర్లకు సవాల్‌గా మారనున్నాయి. మేడారం జాతర ప్రారంభమైతే ఇక్కడి ఉన్నతాధికారులు, పోలీస్, మున్సిపల్
ఇతర శాఖల సిబ్బందికి కూడా మేడారంలోనే డ్యూటీ చేయాల్సి ఉంటుంది. దీంతో ఆ ప్రభావం మిగతా జాతర్లపై పడనుంది. ముందస్తు ఏర్పాట్లు లేకపోవడంతో ప్రతీసారి జాతర్ల టైంలో ఇబ్బందులు పడాల్సి వస్తోందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.