మోదీ ప్రభుత్వానికి బలం చిన్న పార్టీలే

మోదీ ప్రభుత్వానికి బలం చిన్న పార్టీలే

నరేంద్ర మోదీ మూడోసారి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు.. మీడియా మొత్తం చంద్రబాబు నాయుడు, నితీశ్ కుమార్‌‌‌‌లకు క్రెడిట్​ ఇచ్చింది. టీడీపీ, జేడీయూ ఈ రెండు పార్టీలకు 28 మంది లోక్‌‌‌‌సభ ఎంపీలు ఉండటంతో వారికి ఈ గుర్తింపు లభించింది.  రాజకీయపార్టీల కూటములు మార్చడంలో ప్రసిద్ధిచెందిన నితీశ్ కుమార్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఇప్పుడు మరోసారి అదే పని చేస్తారని మీడియాతోపాటు చాలామంది రాజకీయ నాయకులు ఊహాగానాలు చేయడం ప్రారంభించారు. 

ఈ నేతలిద్దరూ నమ్మశక్యంగా లేరని, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోతుందని కాంగ్రెస్ నేతలు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే.. చంద్రబాబు, నితీశ్ కుమార్ మోదీ సర్కారుకు కీలకమే. అయితే, అసలు హీరోలు బీజేపీతో ఉన్న చిన్న పార్టీలు. కానీ, నేటికీ ఇండియా కూటమి నాయకులు బీజేపీ ప్రభుత్వం చంద్రబాబు, నితీశ్ కుమార్‌‌‌‌లపై ఆధారపడి ఉందని, ఎన్డీఏ ప్రభుత్వంలో అనిశ్చితి ఉందని కామెంట్స్ చేస్తున్నారు.  

నిజానికి బీజేపీ కంటే నాయుడు, నితీశ్​కుమార్‌‌‌‌లే మోదీపై ఎక్కువగా ఆధారపడి ఉన్నారు.  మోదీ ప్రధాని కావాలంటే ఆయనకు తమ అవసరం ఉందని నాయుడుకు, నితీశ్​ కుమార్‌‌‌‌కు బాగా తెలుసు. అదేవిధంగా మోదీ వల్లనే తాము ఆంధ్రప్రదేశ్, బిహార్‌‌‌‌ రాజకీయాల్లో రాణించగలమని కూడా వారిద్దరికీ తెలుసు. బిహార్‌‌‌‌లో  మొత్తం 40 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి.  బీజేపీ సారథ్యంలోనే  ఎన్టీఏ కూటమి- 30 ఎంపీ స్థానాలను గెలుచుకుంది.  వీటిలో  నితీశ్ పార్టీ జేడీయూ 12 ఎంపీ స్థానాల్లో గెలుపొందింది.  బీజేపీ లేకుంటే తన పార్టీ ఎంపీల సంఖ్య జీరోకు వచ్చేదని నితీశ్‌‌‌‌కు బాగా తెలుసు. 
జితిన్ రామ్ మాంఝీ: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, దళిత నేత. 50 ఏండ్లు రాజకీయాల్లో ఉన్న మాంఝీ 1980లో బిహార్‌‌‌‌లో కాంగ్రెస్‌‌‌‌ మంత్రిగా పనిచేసి తరచూ పార్టీ మారుతూ వస్తున్నారు. మాంఝీ  బిహార్‌‌‌‌లోని ప్రతి ముఖ్యమంత్రి కేబినెట్​లో  మంత్రిగా ఉన్నారు. కీలకమైన దళిత పునాదిని కలిగి ఉన్నారు. బిహార్‌‌‌‌లో బీజేపీ విజయానికి మాంఝీ ఎనలేని సాయం చేశారు. 

చిరాగ్ పాశ్వాన్:   బిహార్​కు చెందిన  చిరాగ్ పెద్ద నాయకుడు, దివంగత  రామ్ విలాస్ పాశ్వాన్ కుమారుడు. చిరాగ్ పాశ్వాన్ విద్యావంతుడు.  2011లో  కంగనా రనౌత్  సరసన ఒక సినిమాలో కూడా నటించాడు. కానీ, చిరాగ్ సినిమాలను వదిలి 2014లో పార్లమెంటులో అడుగుపెట్టాడు. చిరాగ్‌‌‌‌కు  సొంతంగా చిన్న ఓటు బ్యాంకు ఉంది.  ఇతర పార్టీల నుంచి ప్రలోభపెట్టే ఆఫర్‌‌‌‌లు ఉన్నప్పటికీ వ్యక్తిగతంగా మోదీకి విధేయుడిగా ఉన్నారు. చిరాగ్ పాశ్వాన్ బీజేపీ కూటమికి బిహార్​లో 30 మంది ఎంపీలు 
గెలుపొందడంలో సహాయం చేశాడు. వీరిలో చిరాగ్​ పార్టీ ఎల్జేపీ (రామ్​విలాస్​) నుంచి గెలిచిన 5 మంది ఎంపీలు కూడా ఉన్నారు.
జయంత్ చౌదరి :  రాష్ట్రీయ లోక్​దళ్ (ఆర్ఎల్డీ) అధినేత జయంత్ చౌదరి. తన తాత, మాజీ ప్రధాని చరణ్ సింగ్ స్థాపించిన పార్టీ ఆర్ఎల్డీ.  ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ అంతటా జాట్‌‌‌‌లలో జయంత్ ప్రభావం చాలా ఉంది. ఉత్తరప్రదేశ్‌‌‌‌లో బీజేపీ ఆయనకు రెండు ఎంపీ సీట్లు కేటాయించగా విజయం సాధించింది. మోదీ 3.0లో జయంత్​ చౌదరి మంత్రి పదవిని పొందారు. 

అనుప్రియా పటేల్: అనుప్రియ తూర్పు ఉత్తరప్రదేశ్‌‌‌‌లో ప్రభావం చూపిన యూపీకి చెందిన కుర్మీ నాయకుడు సోనెలాల్​పటేల్​ కుమార్తె. ఆయన మరణానంతరం, అనుప్రియ అప్నాదళ్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారు. 2024 లోక్​సభ ఎన్నికల్లో  బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. అనుప్రియ 2019 నుంచి మోదీ కేబినెట్‌‌‌‌లో మంత్రిగా కొనసాగుతున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన అమె బీజేపీ ప్రభుత్వ ఏర్పాటులో తనవంతు సహాయం చేశారు.

కుమారస్వామి : కుమారస్వామి కర్నాటక మాజీ ముఖ్యమంత్రి. జేడీఎస్​ అధినేత, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు.  2024లో  బీజేపీతో  పొత్తు పెట్టుకుని ఎన్డీయే కూటమి విజయానికి సహకరించారు. కర్నాటకలో  మొత్తం 28 ఎంపీ స్థానాల్లో ఎన్డీఏ కూటమి 19స్థానాల్లో గెలుపొందింది. బీజేపీ అండతో జేడీఎస్​ రెండు స్థానాలు గెలుచుకుంది. సిద్దరామయ్య సీఎంగా కాంగ్రెస్​ పార్టీ అధికారంలో ఉన్నా..  బీజేపీ కూటమి ఇండియా కూటమిపై ఆధిక్యం సాధించింది. మోదీ మంత్రివర్గంలో కుమారస్వామికి కీలక మంత్రి పదవి లభించింది. 

ఏక్‌‌‌‌నాథ్ షిండే, అజిత్​ పవార్​: మహారాష్ట్రకు చెందిన ఏక్‌‌‌‌నాథ్ షిండే (శివసేన), అజిత్ పవార్ (ఎన్సీపీ) పొత్తుతో  మహారాష్ట్రలోని మొత్తం 48 ఎంపీ స్థానాలకుగాను, బీజేపీ కూటమి కేవలం 17 మంది ఎంపీ స్థానాలను మాత్రమే గెలుచుకుంది. కానీ,  షిండే, అజిత్ పవార్  లేకుంటే బీజేపీకి మెరుగైన ఫలితాలు వచ్చేవా అన్నది అనుమానమే.  ఏక్‌‌‌‌నాథ్ షిండే, అజిత్ పవార్  మహారాష్ట్రలో బీజేపీ స్థానాన్ని పదిలం చేశారు.

బీజేపీ బలాన్ని పెంచిన చిన్నపార్టీలు 

చిన్న పార్టీలను ఆకర్షించే విధానంలో ఓ పద్ధతి ఉంది. మొదట.. వారు బీజేపీ బలాన్ని పెంచుతారు.  రెండోది.. తమ కూటమిలోవారు ప్రత్యర్థుల వైపు వెళ్లకుండా బీజేపీ కూడా భరోసా ఇస్తుంది. చిన్న నాయకులు  లేకపోతే విజయం అంత సులభం కాదనేది వాస్తవం. కాగా, తెలంగాణలో సమస్య ఏమిటంటే, ఒవైసీతో సహా నాలుగు రాజకీయ పార్టీలు మాత్రమే కీలకంగా ఉన్నాయి.  చిన్న పార్టీలు ఎక్కువగా, క్రియాశీలకంగా ఉంటే  తెలంగాణ 
రాజకీయాలు మరింత  చైతన్యవంతంగా మారతాయి.

 2024 ఎన్నికలను పరిశీలిస్తే ఒక విషయం ఖచ్చితంగా బోధపడుతుంది. బీజేపీకి ఇంకా అనేక చిన్న పార్టీలు మిత్రపక్షాలుగా ఉండి ఉంటే అది మరింత మెరుగైన స్థానంలో ఉండేది.  పంజాబ్, రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్, తమిళనాడులో బీజేపీకి ఎక్కువసంఖ్యలో మిత్రపక్షాలు లేకపోవడంతో విఫలమైంది. భారత రాజకీయాల్లో చిన్న నాయకుడే కీలకం. చివరిగా ఒక్కమాట.. నితీశ్ కుమార్ బీజేపీ కూటమిని విడిచిపెడితే, ఆయన పార్టీకి చెందిన 12 మంది ఎంపీలు నితీశ్​ను డంప్ చేస్తారు.  ఎందుకంటే వారు తమ విజయానికి మోదీకి రుణపడి ఉంటారు, చంద్రబాబు నాయుడు బీజేపీని విడిచిపెట్టినట్లయితే, అప్పుడు పవన్ కల్యాణ్ లేకుండా చంద్రబాబు ప్రయాణించగలరా? జాతీయ మీడియా కీలకమైన ఈ వాస్తవాన్ని మరిచిపోయింది.

జగన్ ​బీజేపీతో పొత్తు పెట్టుకుంటే..

ఆంధ్రాలో..  చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగినంత మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది.  కానీ,ఏ పార్టీతో పొత్తు లేకుండా, జగన్ పార్టీ వైసీపీ 40% ఓట్లు సాధించింది. ఈ విషయం చంద్రబాబు నాయుడుకు బాగా తెలుసు. ఒకవేళ జగన్  బీజేపీతో పొత్తు పెట్టుకుంటే పరిస్థితి  ఏపీలో మరోవిధంగా ఉండేది. అయితే, వీరే కాకుండా తెరవెనుక నాయకులు మరికొందరు ఉన్నారు. వీరి  కారణంగా ఏపీలో బీజేపీ మెరుగైన ఫలితాలు సాధించింది.  ఈ చిన్న పార్టీలు బీజేపీ సర్కారు ఏర్పాటులో  కీలక సహకారం అందించినందుకే ప్రతిఫలం పొందాయి.

పవన్ కల్యాణ్: తెలుగు రాష్ట్రాల్లో జనాదరణ పొందిన పవన్ కల్యాణ్ లేకుంటే ఆంధ్రాలో బీజేపీ కూటమి లేదు. ఏపీలో బీజేపీ ఒంటరిగా పోటీచేస్తే ఓటమిపాలయ్యేది. పవన్ కల్యాణ్ చిన్న నాయకుడే అయినప్పటికీ, ఇతర చిన్న  లీడర్ పార్టీల మాదిరిగానే మోదీ, బీజేపీ విజయానికి సాయం చేశారు. జితన్‌‌‌‌రామ్‌‌‌‌ మాంఝీ, చిరాగ్‌‌‌‌ పాశ్వాన్‌‌‌‌,  కర్నాటకకు చెందిన కుమారస్వామి, జయంత్‌‌‌‌ చౌదరి, పవన్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌, మహారాష్ట్రకు చెందిన షిండే, అజిత్‌‌‌‌ పవార్‌‌‌‌, ఉత్తరప్రదేశ్‌‌‌‌కు చెందిన అనుప్రియా పటేల్‌‌‌‌లు లేకుంటే బీజేపీకి చాలా తక్కువ ఎంపీలు ఉండేవారు. ఒకరిద్దరు ఎంపీలు ఉన్న పార్టీల వారికి మంత్రి పదవులు ఎందుకు ఇచ్చారని పలువురు  ప్రశ్నించారు. దీనికి సమాధానం ఈ పార్టీలు చిన్నవి కావడమే కాకుండా బీజేపీకి పెద్దపీట వేయడమే.

- పెంటపాటి పుల్లారావు పొలిటికల్​ ఎనలిస్ట్