తెలంగాణలో సన్న బియ్యం మస్తు పిరం

హైదరాబాద్​/నెట్​వర్క్, వెలుగు:  రాష్ట్రంలో సన్న బియ్యం రేట్లు భగ్గుమంటున్నాయి. నిరుడితో పోలిస్తే రూ. వెయ్యికి పైగా ధరలు పెరిగిపోయాయి. గత నెలలోనే రూ. 400 దాకా పెరిగాయి. కొన్నేండ్లుగా మార్కెట్​లో సన్నబియ్యానికి మస్తు డిమాండ్​ ఉంది. కానీ, ఉత్పత్తి అంతంత మాత్రమే ఉంది. సర్కారు నుంచి ప్రోత్సాహం లేక రైతులు సన్నవడ్ల సాగును తగ్గించేశారు.  2020 వానాకాలం రాష్ట్రంలో ఉత్పత్తి అయిన వడ్లలో సుమారు 50 శాతంగా ఉన్న సన్నవడ్లు.. గతేడాది వానాకాలంలో 30 శాతానికి పడిపోయాయి. 

డిమాండ్​ను సొమ్ముచేస్కుంటున్నరు

బియ్యం రేట్లు పెరగకుండా కంట్రోల్​ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విదేశీ ఎగుమతులపై నిషేధం విధించింది. కానీ, దేశీయంగా సన్నవడ్ల సాగు పడిపోవడం, ఈ సారి దిగుబడులు 25 శాతానికంటే తక్కువకు పడిపోతాయనే అంచనాతో వ్యాపారులు నిల్వలను బ్లాక్​చేసి ఇష్టారాజ్యంగా రేట్లు పెంచుతున్నారు. సన్నవడ్లకు ఉన్న డిమాండ్​ను సొమ్ముచేసుకుంటున్నారు. గతేడాదితో పోలిస్తే అన్ని సన్నరకాలపై వ్యాపారులు ఈ ఏడాది వెయ్యి రూపాయలకుపైగా పెంచారు. గతంలో  బియ్యం రేట్లపై సర్కారుకు ఆజమాయిషీ ఉండేది. అందుకు తగ్గట్టుగానే ఫుడ్​గ్రెయిన్​ లైసెన్సులు జారీ చేసేవారు.  కానీ ఇప్పుడంతా ఓపెన్​ మార్కెట్​ కావడంతో మిల్లర్లు సిండికేట్​గా మారి, సన్న వడ్ల కొనుగోళ్లను పూర్తిగా తమ కంట్రోల్​లోకి తెచ్చుకున్నారు. మరోవైపు వడ్ల కొనుగోళ్లతో పాటు రాజకీయ అవసరాల రీత్యా మిల్లర్లపై ఆధారపడ్తున్న రాష్ట్ర సర్కారు.. వారిపై చర్యలకు వెనుకాడుతోంది. దీంతో బియ్యం రేట్లు సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి.

పెరిగిన వినియోగం.. పడిపోయిన ఉత్పత్తి

రాష్ట్రవ్యాప్తంగా సన్నబియ్యం వినియోగం పెరుగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్​ పరిధిలో సన్నబియ్యం వినియోగం గతేడాదితో పోలిస్తే  50 శాతం పెరిగిందని సికింద్రాబాద్​లోని ఓ హోల్​సేల్​ రైస్​ వ్యాపారి చెప్పారు. నిరుడు జీహెచ్​ఎంసీ పరిధిలో రోజుకు 70 వేల క్వింటాళ్ల నుంచి 80 వేల క్వింటాళ్ల సన్న బియ్యం వినియోగం కాగా, ప్రస్తుతం 80 నుంచి లక్ష క్వింటాళ్ల వరకు వినియోగిస్తున్నట్లు చెప్తున్నారు. ఇట్ల వినియోగం పెరగడం, ఆ మేరకు ఉత్పత్తి పెరగకపోవడం వల్లే  సన్నబియ్యం ధరలు పిరమవుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. 

ALSO READ:తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు 

సన్నవడ్ల సాగుకు సర్కారు ప్రోత్సాహమేది?

దొడ్డు వడ్లతో పోలిస్తే సన్నాల సాగుకు ఎకరాకు రూ.10 వేలు అదనంగా పెట్టుబడి పెట్టాల్సి వస్తున్నది. చీడపీడల వల్ల దిగుబడి కూడా తక్కువ వస్తున్నది. ఇది చాలదన్నట్లు కొనుగోలు కేంద్రాల ద్వారా సర్కారు దొడ్డు రకాలను మాత్రమే కొంటున్నది. దీంతో సన్న వడ్లు  సాగుచేసిన రైతులు మిల్లర్లకు అడ్డికి పావుశేరుకు అమ్ముకోవాల్సి వస్తున్నది. ఫలితంగా 2021 వానాకాలం సీజన్​తో పోలిస్తే క్రమంగా సన్నవడ్ల సాగు తగ్గుతూ వస్తున్నది. ఆ సీజన్​లో 52 లక్షల ఎకరాల్లో రైతులు వరి వేయగా.. 24 లక్షల ఎకరాల్లో సన్నాలు పండించారు. సుమారు 50 లక్షల క్వింటాళ్ల దాకా సన్నవడ్ల దిగుబడి వచ్చింది.

తమకు గిట్టుబాటు కావాలంటే రూ. 2,500 చొప్పున రేటు పెట్టాలని రైతులు డిమాండ్​చేసినా సర్కారు స్పందించలేదు. పైగా, కొనుగోలు సెంటర్లలో సన్నవడ్లు కొనకపోవడంతో ఇదే అదనుగా మిల్లర్లు సిండికేట్​గా మారి క్వింటాల్​కు రూ. 1,600 నుంచి 1,700 కే కొనడంతో రైతులు నష్టపోయారు. దీంతో 2022 వానాకాలం సీజన్‌‌ నుంచి  రైతులు సన్నాల సాగు తగ్గిస్తూ వస్తున్నారు. ఆ సీజన్​లో రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల ఎకరాల్లో, పోయిన వానాకాలం సీజన్​లో 63.55 లక్షల ఎకరాల్లో వరి సాగు చేసినా.. ఇందులో మూడో వంతు అంటే సుమారు 20 లక్షల ఎకరాలకు మించి సన్నవడ్లు సాగుచేయలేదు. దీంతో ఈ రెండు సీజన్లలోనూ సన్నవడ్ల దిగుబడి 30 లక్షల టన్నులకు పడిపోయింది. పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందంటే.. ప్రస్తుత వానాకాలం సీజన్​లో 20 శాతం మించి సన్నవడ్లు సాగయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఉదాహరణకు యాదాద్రి జిల్లాలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగుచేస్తే.. అందులో కేవలం 11,383 ఎకరాల్లోనే సన్నవడ్లు వేశారు. దీన్ని బట్టి సన్నవడ్ల సాగుపై రైతులు ఎంత నిరాసక్తతో ఉన్నారో అర్థం చేసుకోవచ్చు.

ఉత్పత్తి తగ్గడం వల్లే  ధరలు పెరుగుతున్నయ్​

రాష్ట్రంలో సన్నవడ్ల ఉత్పత్తి తగ్గడం వల్లనే సన్న బియ్యం ధరలు పెరుగుతున్నయ్. రైతుల నుంచి  ప్రభుత్వం సేకరించి ఇచ్చే బియ్యంలో సన్నాలు తక్కువగా ఉంటున్నయ్. సన్నవడ్ల ఉత్పత్తి పెరిగితే ధరలు తగ్గే చాన్స్​ ఉంది. 
‑ రాముని రామనాధం, అధ్యక్షుడు, రంగారెడ్డి, హైదరాబాద్​ రైస్​ మిల్లర్స్​ అసోసియేషన్