- ఆర్ఎన్ఆర్ క్వింటాల్‌కు 3,100.. జై శ్రీరాం కు 3 వేలు
- రూ.2,800 నుంచి 3 వేల రేటుతో కొనుగోళ్లు
- బియ్యం ఎగుమతులపై కేంద్రంనిషేధం ఎత్తివేతతో భారీ డిమాండ్
- 10 రోజుల్లో మారిన సీన్..రైతుల వద్దకే వచ్చి కొంటున్న వ్యాపారులు
కరీంనగర్/నల్గొండ, వెలుగు: రాష్ట్రంలో సన్న వడ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మొన్నటి వరకు ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లర్ల చుట్టూ రైతులు తిరిగితే.. ఇప్పుడు సన్న వడ్లు ఉన్న రైతుల దగ్గరికే వ్యాపారులు వచ్చే పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ జిల్లాలో ఆర్ఎన్ఆర్ రకం వడ్లు క్వింటాల్ కు రూ.3,100 ధర పలికితే.. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో జై శ్రీరాం (చింట్లు) కు రూ.3000కుపైగా ధర పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మిన రైతులకు ప్రభుత్వం రూ.500కు బోనస్ ఇస్తుండడంతో.. మిల్లర్లు, వ్యాపారులు అంతకుమించి రేటు పెట్టేందుకు ముందుకొస్తున్నారు. బియ్యం ఎగుమతులపై కేంద్రం ఆంక్షలు ఎత్తివేయడంతో దేశంలో బియ్యానికి మరింత డిమాండ్ పెరుగుతుందనే ఉద్దేశంతో వ్యాపారులు వడ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నట్టు తెలుస్తున్నది.
బోనస్ ప్రకటనతో పెరిగిన సన్నాల సాగు
రాష్ట్రంలో నిరుడు వానాకాలంలో 25.05 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాలకు బోనస్ ప్రకటనతో వీటి సాగు విస్తీర్ణం అమాంతం పెరిగింది. ఈ వానాకాలంలో 40.44 లక్షల ఎకరాల్లో సన్న రకం వడ్లను రైతులు సాగు చేశారు. అంటే ఒక్కసారిగా 15 లక్షల ఎకరాలకుపైగా సాగు పెరిగింది. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో 5,27,536 ఎకరాల్లో సన్న వడ్లు సాగు చేయగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 3 లక్షల ఎకరాలకుపైగా సన్నొడ్లు పండించారు. మొదట్లో కొనుగోళ్లు ఆలస్యం కావడం, తేమ శాతం ఎక్కువగా ఉండడం, బోనస్ అమౌంట్ రాకపోవడంతో రైతులు మిల్లుల బాట పట్టారు. దీన్ని ఆసరాగా చేసుకున్న మిల్లర్లూ సిండికేట్ గా మారి సన్న వడ్లకు రేట్ తగ్గించేశారు.
పది రోజుల్లో మారిన సీన్..
గత 10 రోజుల నుంచి ఒక్కసారిగా సీన్ మారింది. ప్రభుత్వం రైతులకు రూ.500 బోనస్ డబ్బులు జమ చేస్తుండడంతో ఇప్పుడు ఆ ప్రభావం మిల్లులపై పడింది. తేమ శాతాన్ని అడ్డం పెట్టుకొని మద్దతు ధరకు తక్కువగా కొనుగోలు చేసిన మిల్లర్లు ఇప్పుడు వడ్లు రాకపోవడంతో ఒక్కసారిగా ధర పెంచేశారు. మరోవైపు విదేశాలకు సన్నబియ్యం ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తివేయడంతో వివిధ దేశాలకు రాష్ట్రం నుంచి ఎగుమతి చేసే అవకాశం ఏర్పడింది. దీంతో వ్యాపారులు, మిల్లర్లు రైతుల నుంచి ధాన్యం కొని, బియ్యంగా మార్చి విదేశాలకు ఎగుమతి చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో సన్నవడ్లకు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది.
సన్నాల ధర రూ.3వేలకు పైనే
సన్న వడ్లకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో మిల్లర్లు దళారులను పెట్టి కొనుగోలు చేస్తుండడంతో రేట్లు పెరిగాయి. మిర్యాలగూడ రైస్ మిల్లుల్లో కావేరీ చి౦ట్ల రకానికి రూ.2,600– రూ. 2,750 వరకు ధర పలుకుతుండగా.. సూర్యాపేట అగ్రికల్చర్ మార్కెట్ లో చి౦ట్ల రకానికి రూ.3 వేలకుపైగా ధర పెడుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ఏరియాలో ఆర్ఎన్ఆర్ రకం వడ్లను కొందరు మిల్లర్లు రూ.3,100 పెట్టి కొనుగోలు చేస్తున్నారు. ః
సాంబమసూరి రూ.3000కు క్వింటాల్ అమ్మిన
నాకు మూడెకరాల పొలం ఉంది. సన్నాలకు ప్రభుత్వం రూ.500 బోనస్ ఇస్తామనడంతో రెండున్నర ఎకరాల్లో బీపీటీ (సన్న రకం) వడ్లు పండించిన. 67 క్వింటాల్ వడ్లను మా ఊరికి వచ్చిన వ్యాపారులకు క్వింటాకు రూ.3000 చొప్పున అమ్మిన. మార్కెట్ కు, ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లే బాధతప్పింది. మంచి ధర పలికింది. మా గ్రామంలో వ్యాపారులు ఆర్ఎన్ఆర్ రకం వడ్లు పెట్టిన రైతుల దగ్గర క్వింటాకు రూ.3,100 ధర పెట్టి కొంటున్నరు.
–భాషబోయిన సమ్మయ్య, పెద్ద పాపయ్యపల్లి, హుజూరాబాద్