ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మూడున్నరేండ్లుగా గోదాముల్లోనే 2 వేల క్వింటాళ్లు

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో సంక్షేమ హాస్టళ్లకు సరఫరా చేయాల్సిన సన్న బియ్యం మూడున్నరేండ్లుగా ఎంఎల్ఎస్ పాయింట్లలో మూలుగుతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ బియ్యం ముక్కిపోయి పిండిగా మారుతున్నాయి. ఎలుకలు, పందికొక్కుల పాలవుతున్నాయి. గతంలో స్కూళ్లలో మిడ్ డే మీల్స్​కు సంబంధించిన బియ్యాన్ని వేలం వేసిన అధికారులు హాస్టల్ బియ్యంపై నిర్లక్ష్యం వహిస్తున్నారు. లక్షల విలువైన బియ్యం కళ్ల ముందే పాడవుతున్నా ఎవరూ స్పందించడం లేదు. జిల్లా ఉన్నతాధికారులు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఓవైపు సంక్షేమ హాస్టళ్లలోని పిల్లలు సరైన తిండిలేక ఆర్ధాకలితో అలమటిస్తుంటే అధికారులు రూ. 90 లక్షల విలువైన బియ్యాన్ని వృథా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

జిల్లావ్యాప్తంగా 2 వేల క్వింటాళ్లు

జిల్లావ్యాప్తంగా సుమారు 2 వేల క్వింటాళ్ల సన్నబియ్యం మండల్ లెవల్ స్టాక్(ఎంఎల్ఎస్) పాయింట్లలో నిల్వ ఉంది. చివరగా ఇక్కడినుంచి బియ్యాన్ని సంక్షేమ హాస్టళ్లకు 2019 చివరలో సప్లై చేశారు. 2020 మార్చి నెలాఖరులో కొవిడ్ లాక్ డౌన్ విధించడంతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. దీంతో బియ్యం అలాగే ఉండిపోయాయి. అత్యధికంగా లక్సెట్టిపేట ఎంఎల్ఎస్ పాయింట్​లో 800 క్వింటాళ్లు, మంచిర్యాలలో 550, బెల్లంపల్లిలో 290, చెన్నూర్ 300, కోటపల్లిలో 27, తాండూర్లో 51 క్వింటాళ్ల బియ్యం నిల్వ ఉన్నాయి. కిలో రూ. 46 చొప్పున వీటి విలువ రూ.90 లక్షలకు పైమాటే. 

మూడున్నరేండ్లుగా పట్టించుకోవట్లే..

హాస్టళ్లకు సప్లై చేయాల్సిన సన్న బియ్యం ఎంఎల్ఎస్ పాయింట్లలో మూడున్నర సంవత్సరాలుగా మూలుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొవిడ్ లాక్ డౌన్​తో హాస్టళ్లను క్లోజ్ చేయడం వల్ల బియ్యం గోదాముల్లోనే ఉండిపోయాయి. తిరిగి హాస్టళ్లు తెరిచేటప్పటికే చాలావరకు ముక్క పట్టడంతో వాటిని ముట్టుకోలేదు. గవర్నమెంట్ స్కూళ్లలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన మూడు వేల క్వింటాళ్ల బియ్యం సైతం మిగిలిపోయాయి. విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాలతో ఆ బియ్యాన్ని నిరుడు వేలం వేశారు. అప్పటికే ఆలస్యమైనప్పటికీ అధికారులు మేల్కొని పాడైన బియ్యాన్ని వదిలించుకున్నారు. కానీ సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన బియ్యం గోదాముల్లోనే ఉండిపోయాయి. సన్నబియ్యం కిలో రూ.46 కాగా, ఇప్పుడు వేలం వేస్తే అందులో నాలుగోవంతు కూడా వచ్చే పరిస్థితి లేదు. మిడ్ డే మీల్స్ బియ్యం మాదిరిగా వేలం వేస్తే ప్రభుత్వానికి ఎంతో కొంత ఆదాయం వచ్చేది. కానీ పెద్ద ఎత్తున బియ్యం నిల్వ ఉన్నాయనే సంగతే ఎవరూ పట్టించుకోలేదు. 

హామీల అమలులో ప్రభుత్వం విఫలం

మంచిర్యాల, వెలుగు: ఎన్నికల హామీలను అమలు చేయడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​వు అన్నారు. నూతనంగా ఎన్నికైన మంచిర్యాల అసెంబ్లీ బూత్ అధ్యక్షుల సమావేశం శుక్రవారం వేంపల్లిలోని పద్మావతి గార్డెన్స్​లో జరిగింది. ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ 2014, 2018 ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను మర్చిపోయారన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు హామీలు ఇస్తూ అధికారంలోకి రాగానే ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు.

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అసమర్థత వల్లనే నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయిందన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ దిశగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేస్తూ ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. నాయకులు వెంకటేశ్వర్లుగౌడ్, పొనుగోటి రంగారావు, కృష్ణమూర్తి, మోటపలుకుల తిరుపతి, బొలిశెట్టి తిరుపతి, రమణారావు, కర్నే శ్రీధర్ పాల్గొన్నారు.

మార్లవాయిలో ట్రైనీ ఐఏఎస్​లు

జైనూర్, వెలుగు: జైనూర్​మండలం మార్లవాయి గ్రామాన్ని శుక్రవారం ట్రైనీ ఐఏఎస్​ఆఫీసర్లు సందర్శించారు. ఆదివాసీలు వారిని సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. వారితో కలిసి ఆఫీసర్లు నృత్యం చేశారు. అనంతరం హైమాన్​ డార్ఫ్​ దంపతుల విగ్రహాలకు నివాళి అర్పించారు. కార్యక్రమంలో పద్మశ్రీ  కనక రాజు, సర్పంచ్ కనక ప్రతిభా వెంకటేశ్వరరావు, ఎంపీడీవో ప్రభుదయ, వైస్ ఎంపీపీ చీర్లె లక్ష్మణ్, జంగాం సర్పంచ్ కుంరం శ్యామ్ రావు, ఉప సర్పంచ్ సావిత్ర ధర్మేందర్, రాయి సెంటర్ మేడి జూగ్నక దేవు తదితరులు పాల్గొన్నారు.

ఏళ్లు గడిచినా సమస్య పరిష్కరిస్తలె

బెల్లంపల్లి రూరల్, వెలుగు: తాండూర్​మండలం మాదారం పోలీస్​స్టేషన్​వెళ్లే దారి అధ్వానంగా మారింది. 13 ఏళ్ల క్రితం మాదారం పోలీస్​ స్టేషన్ ​కోసం ప్రభుత్వం 4.20 ఎకరాలు కేటాయించింది. ఇది ప్రైవేట్​భూమిని ఆనుకొని ఉంది. కొందరు బడాబాబులు ఖాళీ జాగ కబ్జాకు తెరలేపారు. అంతేకాదు ఏరియాలో మురికి నీరు నిలిచి దుర్వాసన వస్తోంది. అయినా పట్టించుకునే నాథుడు కరువయ్యారు. 

స్టాఫ్ 11 గంటలకు.. ఆఫీసర్లు 12 గంటలకు...

కాగ జ్ నగర్, వెలుగు: చింతలమానే పల్లి మండల ప్రజలకు ప్రభుత్వ అధికారుల సేవలు అందడంలేదు. శుక్రవారం కీలకమైన శాఖల్లోని ఆఫీసులకు ఉదయం 11 గంటలకు సిబ్బంది వస్తే, 12 గంటలకు ఆఫీసర్లు వచ్చారు. ఉదయం పదిన్నరకు ఎంపీడీవో ఆఫీస్​లో కాంట్రాక్ట్​అటెండర్​మాత్రమే కనిపించాడు. పక్కనే ఉన్న తహసీల్దార్​ఆఫీస్ లో ధరణి ఆపరేటర్ వంశీ కృష్ణ, వీఆర్ఏ మాత్రమే ఉన్నారు. ఈజీఎస్ ఆఫీస్ 11 గంటల వరకు తెరుచుకోలేదు. చివరకు 12 గంటల 15 నిమిషాల వరకు అందరు ఆఫీసులకు చేరుకోవడం గమనార్హం.

పునరావాసం కల్పించడం లేదని..అడవిని నరికిన గిరిజనులు

గ్రామస్తులపై కేసులు నమోదు

నిర్మల్ జిల్లా మైసంపేట్ లో ఆందోళన 

కడెం,వెలుగు: కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని నిర్మల్ జిల్లా కడెం మండలం మైసంపేటలో పునరావాసం కల్పించడం లేదని గిరిజనులు 40 ఎకరాల్లో అడవిని నరికి ఆందోళన చేశారు. దీంతో అటవీ శాఖాధికారులు మైసంపేట గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. మొదటి విడతలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్​పరిధిలో ఉన్న  మైసంపేట్, రాంపూర్ గ్రామాలను తరలించేందుకు నిర్ణయించుకున్నారు. వీరికి పునరావాసం కల్పించేందుకు కడెం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న మాసాయిపేట వద్ద ఇండ్ల స్థలాలు, సాగు భూములను చూశారు. ఇంటి స్థలంతో పాటు, సాగు భూమి తీసుకొని వారికి రూ.15 లక్షలు ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దీంతో పునరావాసం కోసం ఐదేండ్లుగా ఎదురుచూస్తున్నారు. అటవీ శాఖ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శుక్రవారం మైసంపేట శివారులోని అటవీ ప్రాంతంలో చెట్లను నరికి ఆందోళన చేశారు. తమను ఏ పనీ చేసుకోనివ్వకుండా అటవీ శాఖాధికారులు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఇప్పటివరకు పునరావాసం చూపకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  15 మంది గిరిజనులపై పలు కేసులు నమోదు చేసినట్లు ఎఫ్ డీ ఓ కోటేశ్వరరావు తెలిపారు.  

బసవేశ్వరుడి మార్గం అనుసరణీయం

ఎంపీ సోయం బాపూరావు

బోథ్,వెలుగు: బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలనిఎంపీ సోయం బాపూరావు కోరారు. శుక్రవారం బోథ్​ మండలం మర్లపెల్లి గ్రామంలో ఆయన కేఎస్ఆర్ ఫౌండేషన్​చైర్మన్, బీజేపీ స్టేట్ లీడర్​ కంది శ్రీనివాస్​రెడ్డితో కలిసి బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప‌ది వేల కోట్లతో వీర శైవ‌లింగాయ‌త్ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి రుణాలు అందించాల‌ని  వీర‌శైవ లింగాయ‌త్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీర శైవ‌లింగాయ‌త్ రాష్ట్ర గౌర‌వధ్యక్షుడు సంగమేశ్వర్, రైల్వే బోర్డు మెంబ‌ర్ జీవీ రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘పట్నం బస్సు’ ప్రారంభం

నిర్మల్, వెలుగు: ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన కథలను నుంచి సేకరించిన అంశాల ఆధారంగా నిర్మిస్తున్న ‘పట్నం బస్సు’ షార్ట్​ ఫిలిం షూటింగ్​ శుక్రవారం గెజిటెడ్​ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకుడు శ్యాం నాయక్ ప్రారంభించారు. నిర్మల్ నటరాజ్ నగర్ లోని ఉమామహేశ్వర ఆలయంలో షూటింగ్​ ప్రారంభమైంది. కార్యక్రమంలో నటులు ఎర్ర రవీందర్, కొట్టె శేఖర్, ప్రభుదాస్, రామ్ రమేశ్, అయిత రమణ, సాయి, రాజు కోటగిరి నరసయ్య పాల్గొన్నారు.

బాసరలో కట్టుదిట్టమైన భద్రత: ఏఎస్పీ ఖారే

బాసర,వెలుగు: దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బాసర క్షేత్రంలో భద్రత ఏర్పాట్లు పూర్తిచేశామని  ఏఎస్పీ కిరణ్ ఖారే తెలిపారు. శుక్రవారం ఆయన సరస్వతీ అమ్మవారిని దర్శించుకొని ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ముథో ల్ సీఐ వినోద్​ కుమార్, ఎస్సై మహేశ్​  ఉన్నారు.

పకడ్బందీగా దసరా ఉత్సవాలు

నిర్మల్,వెలుగు: నిర్మల్​బంగల్​పేట మహాలక్ష్మి ఆలయం వద్ద దసరా ఉత్సవాల నిర్వహణ కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్ తెలిపారు. శుక్రవారం ఆయన మహాలక్ష్మి ఆలయంలో కొలువుదీరిన దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఏర్పాట్లపై ఆఫీసర్లతో సమీక్షించారు. ఆలయ ప్రాంగణంలో పార్కింగ్, విద్యుత్ దీపాలు, శానిటేషన్ తదితర అంశాలపై చైర్మన్ సంబంధిత అధికారులు, స్థానికులతో చర్చించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్, డి.నాగేశ్వరరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, కౌన్సిలర్లు నవీన్, మహాలక్ష్మి ఆలయ కమిటీ చైర్మన్ కొడకల గంగాధర్, కౌన్సిలర్లు లక్కాకుల నరహరి, ఎడపల్లి నరేందర్, కోఆప్షన్ సభ్యుడు చిలుక గోవర్ధన్, యూత్ సెక్రెటరీ శ్రీకాంత్, అల్లం అశోక్, జల్ద గంగాధర్, సుధాకర్, సుదర్శన్, వీరార్జున్, రాందాస్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీరాంపూర్ ఏరియాలో100శాతం  బొగ్గు ఉత్పత్తి

నస్పూర్, వెలుగు: రక్షణతో కూడిన ఉత్పత్తి సాధించడమే లక్ష్యమని శ్రీరాంపూర్  జీఎం సంజీవ రెడ్డి  చెప్పారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఏరియాలో అందరి సహకరంతో గత నెలలో వందశాతం ఉత్పత్తి సాధించామన్నారు. కార్మికులకు సౌకర్యాల కల్పనలో వెనుకాడేది లేదని, రక్షణపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జీఎం తెలిపారు. సమావేశంలో ఎస్​వోటు జీఎం త్యాగరాజు, డీవైజీఎంలు గోవిందరాజు, చిరంజీవులు, సీనియర్​పీవో కాంతారావు తదితరులు పాల్గొన్నారు.

భవిష్యత్ తరాలకు ఉపయోగపడేలా మాస్టర్ ప్లాన్

మంచిర్యాల, వెలుగు: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్​లో అడిషనల్ కలెక్టర్ మధుసూదన్ నాయక్తో కలిసి జిల్లాలోని 5 ఐదు మున్సిపాలిటీల కమిషనర్లు, చైర్​పర్సన్​లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారం ప్రణాళికబద్ధంగా పట్టణాభివృద్ధికి పనులు చేపట్టాలన్నారు. వచ్చే 20 సంవత్సరాలకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. వచ్చే వారం ఎన్ఐఏ టీం క్షేత్రస్థాయి పరిశీలనకు వస్తుందని చెప్పారు. సోమవారంలోగా పూర్తిస్థాయి నివేదికలు అందించాలని ఆదేశించారు. 

పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాలి

ఆదిలాబాద్ టౌన్, వెలుగు: పత్తి కొనుగోళ్లు సజావుగా సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్​ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్​లో ఆఫీసర్లు, ట్రేడర్లతో రివ్యూ నిర్వహించారు. కొనుగోళ్ల సందర్భంగా అనుసరించాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఏఎస్పీ శ్రీనివాసరావు, ఆర్డీవో రమేశ్​ రాథోడ్, డీఎస్పీ ఉమేందర్, జేడీఏ పుల్లయ్య, విద్యుత్​శాఖ ఎస్​ఈ ఉత్తమ్​ జాడే పాల్గొన్నారు. 

పౌష్టికాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించాలి

పౌష్టికాహారం లోపం ఉన్న  ​పిల్లలను గుర్తించి పౌష్టికాహారం, వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్​ ఆదేశించారు. ఐసీడీఎస్​ పీడీ మిల్కా, డీఎంహెచ్​వో నరేందర్​ రాథోడ్, డీపీవో శ్రీనివాస్, అడిషనల్ డీఎంహెచ్​వో సాధన తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం వర్ధంతి ఏర్పాట్లు చేయండి

ఆసిఫాబాద్,వెలుగు: కెరమెరి మండలం జోడేఘాట్​లో ఈనెల 9న నిర్వహించనున్న కుమ్రంభీం వర్ధంతి నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్​లో నిర్వహణ కమిటీ సభ్యులతో కలిసి వర్ధంతి పోస్టర్​ను రిలీజ్​చేశారు. వర్ధంతి నాటికి జోడేఘాట్ లో పెండింగ్ పనులు పూర్తిచేస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, మ్యూజియం చుట్టూ గోడ పనులు పూర్తవుతాయన్నారు. కార్యక్రమంలో ఉత్సవ నిర్వహణ కమిటీ చైర్మన్​మోహన్, కన్వీనర్ రఘునాథ్, సలహాదారు చందన్ షావు, బొజ్జిరావు తదితరులు పాల్గొన్నారు.

దుర్గామాత సన్నిధిలో ఎమ్మెల్యే పూజలు

కాగజ్ నగర్,వెలుగు: కాగజ్ నగర్​లో దేవీ నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి.శుక్రవారం పట్టణంలోని సర్ సిల్క్ పార్క్ లైన్ లో దుర్గామాతను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సతీ సమేతంగా దర్శించుకున్నారు. వాసవీ కన్యకపరమేశ్వరి ఆలయంలో కొలువుదీరిన అమ్మవారికి ఈస్గాం శివమల్లన్న ఆలయం తరఫున ఆలయ కమిటీ అధ్యక్షుడు రాజేశ్వర్ రావు, అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. 

ఆడబిడ్డలకు కానుక బతుకమ్మ చీరలు 

నార్నూర్,వెలుగు: ప్రభుత్వం ఆడబిడ్డలకు కానుకగా బతుకమ్మ పండుగకు చీరలు అందజేస్తోందని ఎంపీపీ ఆడ చంద్రకళ రాజు చెప్పారు. శుక్రవారం గాదిగూడ  గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ జయవంత్ రావు తో కలిసి ఆమె మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ డిగంబర్, కార్యదర్శి ప్రవీణ్, శ్యామ్ రావు, ప్రభాకర్, మహిళలు పాల్గొన్నారు.

లంబాడాలను ఎస్టీల జాబితా నుంచి తొలగించాలి

ఆసిఫాబాద్/తిర్యాణి/బెల్లంపల్లి రూరల్,వెలుగు: ఎస్టీల జాబితా నుంచి లంబాడాలను తొలగించే వరకూ పోరాటం ఆగదని తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు కొట్నాక్ విజయ్ కుమార్ చెప్పారు. శుక్రవారం వాంకిడి మండలం మొఖాసిగుడ , గొయాగం గ్రామాల్లో నిరసన దీక్ష చేపట్టారు. ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తిర్యాణి లో తుడుందెబ్బ డివిజనల్ ప్రెసిడెంట్ వెడ్మ భగవంతుడు ఆధ్వర్యంలో దీక్ష నిర్వహించారు.  తాండూర్​ మండలం కిష్టంపేట, రేచిని, మాదారం, కాసిపేట మండలంలోని తాటిగూడ, సోనాపూర్, లక్ష్మీపూర్, సాలేగూడ, దేవాపూర్, కొండాపూర్, తంగల్లపల్లి మద్దిమాడ గ్రామాల్లో పటేల్, దేవారి మహజన్  ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు.

బసవేశ్వరుడి మార్గం అనుసరణీయం

 

ఎంపీ సోయం బాపూరావు

బోథ్,వెలుగు: బసవేశ్వరుడు చూపిన మార్గంలో ప్రతీ ఒక్కరు నడుచుకోవాలనిఎంపీ సోయం బాపూరావు కోరారు. శుక్రవారం బోథ్​ మండలం మర్లపెల్లి గ్రామంలో ఆయన కేఎస్ఆర్ ఫౌండేషన్​చైర్మన్, బీజేపీ స్టేట్ లీడర్​ కంది శ్రీనివాస్​రెడ్డితో కలిసి బసవేశ్వరుడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప‌ది వేల కోట్లతో వీర శైవ‌లింగాయ‌త్ కార్పొరేష‌న్‌ను ఏర్పాటు చేసి రుణాలు అందించాల‌ని  వీర‌శైవ లింగాయ‌త్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరప్ప డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వీర శైవ‌లింగాయ‌త్ రాష్ట్ర గౌర‌వధ్యక్షుడు సంగమేశ్వర్, రైల్వే బోర్డు మెంబ‌ర్ జీవీ రమణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

‘పట్నం బస్సు’ ప్రారంభం

నిర్మల్, వెలుగు: ప్రముఖ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్ రచించిన కథలను నుంచి సేకరించిన అంశాల ఆధారంగా నిర్మిస్తున్న ‘పట్నం బస్సు’ షార్ట్​ ఫిలిం షూటింగ్​ శుక్రవారం గెజిటెడ్​ ఆఫీసర్ల సంఘం రాష్ట్ర నాయకుడు శ్యాం నాయక్ ప్రారంభించారు. నిర్మల్ నటరాజ్ నగర్ లోని ఉమామహేశ్వర ఆలయంలో షూటింగ్​ ప్రారంభమైంది. కార్యక్రమంలో నటులు ఎర్ర రవీందర్, కొట్టె శేఖర్, ప్రభుదాస్, రామ్ రమేశ్, అయిత రమణ, సాయి, రాజు కోటగిరి నరసయ్య పాల్గొన్నారు.

గొలుసు కట్టు చెరువుల కబ్జాపై ఎంక్వైరీ చేయాలి

నిర్మల్,వెలుగు: నిర్మల్​జిల్లా కేంద్రంలోని గొలుసుకట్టు చెరువుల కబ్జాలపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ జిల్లా సహ ఇన్​చార్జి మహేశ్​డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బర్త్​డేను పురస్కరించుకొని నిర్వహిస్తున్న సేవా పక్షంలో భాగంగా శుక్రవారం చెరువుల శుద్ధి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ధర్మసాగర్ చెరువును లీడర్లు పరిశీలించారు. అనంతరం మహేశ్​మాట్లాడుతూ జిల్లాలోని చారిత్రక గొలుసు కట్టు చెరువులు ఆక్రమణకు గురవుతున్నా.. ఆఫీసర్లు పట్టించుకోవడంలేదన్నారు.

కబ్జాలవెనుక అధికార పార్టీ లీడర్ల హస్తం ఉందని ఆరోపించారు. అధికారులు డ్రైనేజీల నీటిని చెరవుల్లోకి మళ్లీస్తున్నారని ఫైర్​అయ్యారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శులు మెడిసెమ్మ రాజు, సామ రాజేశ్వర్​రెడ్డి, ప్రొగ్రాం కన్వీనర్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, జిల్లా ఉపాధ్యక్షురాలు అలివేలు మంగ, లీడర్లు కమల్ నయన్, ఒడిసెల అర్జున్, రాజేందర్, అల్లం భాస్కర్, రామోజీ నరేశ్, శ్రీనివాస్, రాజేందర్ ఉన్నారు.

స్కంద మాతగా అమ్మవారు

బాసర/ఆసిఫాబాద్/ఆదిలాబాద్​టౌన్, వెలుగు: ఉమ్మడి జిల్లాలో దేవీనవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఐదో రోజు అమ్మవారు స్కంద మాత అవతారంలో దర్శనమిచ్చారు. బాసరలోని అమ్మవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు  చేసినట్లు ఈవో సోమయ్య తెలిపారు. రెబ్బెన మండలం ఇంద్రానగర్ లోని అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జిల్లా కేంద్రంలోని హోలీ ట్రినిటీ ఆవరణలో శారద దేవిని టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి, జడ్పీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు అరిగెల నాగేశ్వర్​రావు దర్శించుకున్నారు. ఆదిలాబాద్ బొజ్జవార్​ ఆలయంలో మహిళలు కుంకుమార్చన చేశారు. పిట్టలవాడ దుర్గాదేవీకి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
పోడు భూముల సర్వే  పకడ్బందీగా నిర్వహించాలి

 

నిర్మల్,వెలుగు: పోడు భూముల సర్వే పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ ఆదేశించారు. శుక్రవారం మామడ మండలం దిమ్మదుర్తి గ్రామంలో సర్వేను పరిశీలించారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితుల ఆధారంగా సర్వే కొనసాగించాలన్నారు. కలెక్టర్ వెంట అడిషనల్ కలెక్టర్ హేమంత్ బోర్కడే, దిమ్మదుర్తి ఎఫ్ఆర్వో, ఎంపీడీవో, తహసీల్దార్ ఉన్నారు.

గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై సర్వే

నిర్మల్,వెలుగు: గల్ఫ్ కార్మికుల జీవనంపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ఆర్థిక, సామాజిక అధ్యయన కేంద్రం సభ్యులు శుక్రవారం సోన్ తదితర గ్రామాలలో పర్యటించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ సుదవేణి నరేశ్​ఆధ్వర్యంలోని సభ్యులు ప్రవాసీమిత్ర లేబర్ యూనియన్ సహకారంతో గల్ఫ్ కార్మికుల కుటుంబాలను కలిసి వారి స్థితిగతులు తెలుసుకున్నారు. సభ్యులు నాలుగు రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. కార్యక్రమంలో సోన్ సర్పంచ్ వినోద్ కుమార్, ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వదేశ్ పరికిపండ్ల, మాజీ సర్పంచ్ రామారావు, దస్తగిరి, శ్యాంప్రకాశ్​తదితరులు పాల్గొన్నారు.

డబుల్​ ఇంజిన్​ సర్కార్​ పక్కా

భైంసా,వెలుగు: తెలంగాణలో డబుల్​ఇంజిన్​సర్కార్​ఖాయమని ఆదిలాబాద్​ఎంపీ సోయం బాపూరావు చెప్పారు. శుక్రవారం భైంసాలోని హరియాలీ ఫంక్షన్​హాల్ లో నిర్వహించిన సమావేశంలో మండలంలోని బిజ్జూర్​ గ్రామానికి చెందిన ఇంటలెక్చ్వల్ ​ఫోరం ఫౌండర్, ప్రముఖ వ్యాపారవేత్త బద్దం భోజారెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు మోహన్ రావు పటేల్, సీనియర్ లీడర్​నారాయణ్​రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఎంపీ బాపూరావు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తుందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఇటీవల మంత్రి ఇంద్రకరణ్​ రెడ్డి దళిత మహిళలపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దళిత సమాజానికి మంత్రి క్షమాపణ చెప్పాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్​ పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు మెడిసెమ్మ రాజు, భూషణ్, లీడర్లు పోశెట్టి, గోపాల్ సార్డా, గంగాధర్​తదితరులు పాల్గొన్నారు.

ఇన్​స్పైర్ గడువు పొడిగింపు

మంచిర్యాల, వెలుగు: కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ఆదేశాల మేరకు ఇన్​స్పైర్​ నామినేషన్ల గడువును సెప్టెంబర్ 30 నుంచి ఈ నెల 15 వరకు పొడిగించినట్టు డీఈవో ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ప్రాజెక్టు రూపల్పన కోసం రూ.10వేలను కేంద్ర ప్రభుత్వం వారి అకౌంట్లలో జమ చేస్తుందన్నారు. జిల్లాలో ఇంకా 80 స్కూళ్లు ఇన్స్పైర్ నామినేషన్లను సమర్పించలేదన్నారు. గడువు సమీపించిందని హడావుడిలో ఒకటి రెండు నామినేషన్లు పంపిన స్కూళ్ల నుంచి తప్పనిసరిగా 5 నామినేషన్లు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. వివరాలకు జిల్లా సైన్స్ అధికారి మధుబాబు 9849550200ను సంప్రదించాలని సూచించారు. 

లాభాలు వచ్చే పంటలు సాగుచేయాలి

తిర్యాణి, వెలుగు: లాభాలు వచ్చే పంటలు సాగుచేయాలని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని పంగిడి మాదర గ్రామంలో ఆదివాసీ గిరిజనులతో సమావేశం ఏర్పాటు చేశారు. అధిక దిగుబడినిచ్చే సీఎస్​వీ29 రకం జొన్న విత్తనాలు పంపిణీ చేశారు. గిరిజన రైతులకు పెసర, కంది, నువ్వుల విత్తనాలు అందజేసి ఆర్థిక పురోగతి కోసం కృషిచేస్తామన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్లు  రాజేశ్వర్ నాయక్, కోట శివకృష్ణ, నాగరాజు, డాక్టర్ తిరుపతి, డాక్టర్ ఆదిత్య, ఐటీడీఏ ఆఫీసర్లు సీపీవో కృష్ణయ్య, ఏపీవో సుధీర్, ఏవో తిరుమలేశ్వర్, సర్పంచ్ జంగు, ఎంపీటీసీ కేశవరావు తదితరులు పాల్గొన్నారు.