- ఐడీసీ నిర్వీర్యంతో ఎండుతున్న ఆయకట్టు
- 643 లిఫ్ట్ స్కీమ్‌ల కింద 4,69,138 ఎకరాల ఆయకట్టు
- పనిచేయకుండాపోయిన309 లిఫ్ట్‌లు
- వాటి కింది 1,72,811ఎకరాలకు నీరందని వైనం
- ఖమ్మం జిల్లాలో అత్యధికంగా75 లిఫ్ట్ లు పనిచేయట్లే
- ఉమ్మడి రాష్ట్రంలో లిఫ్టుల నిర్వహణకు రూ.250 కోట్ల గ్రాంట్ ఇచ్చిన నెదర్లాండ్స్
- మరోసారి గ్రాంట్స్ తీసుకురావాలనే యోచన
- అధికారులతో స్టడీ చేయించనున్న కార్పొరేషన్
హైదరాబాద్, వెలుగు: రైతులకు మేలు జరగాలన్న ఉద్దేశంతో నిర్మించిన చిన్న తరహా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు.. గత సర్కారు నిర్లక్ష్యం వల్ల పనికిరాకుండా పోయాయి. ఉన్న లిఫ్టుల్లో సగం నిరుపయోగంగా మారాయి. మిగతా వాటిలోనూ చాలా వరకు పాక్షికంగానే పనిచేస్తున్నాయి. గత సర్కారు లిఫ్టులను పట్టించుకోకపోవడం.. వాటి నిర్వహణను చూసే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఐడీసీ)ను నిర్వీర్యం చేయడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత బీఆర్ఎస్ సర్కారు చేసిన తప్పుతో లిఫ్టుల కింద వేలాది ఎకరాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. గతంలో కనీస పర్యవేక్షణ కూడా చేపట్టకపోవడంతో లిఫ్టుల కోసం ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్లు, సామగ్రిని దొంగలు ఎత్తుకెళ్లిన ఘటనలూ ఉన్నాయి. ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లెక్కల్లోనే ఈ విషయాలు బయటపడ్డాయి.
ఇదీ లిఫ్టుల పరిస్థితి
రాష్ట్రంలో మొత్తంగా 643 చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు ఉన్నాయి. అయితే వాటిలో 309 లిఫ్టులు పనిచేయకుండా పోయాయి. అందులో 180 లిఫ్టులు పూర్తిగా పాడైపోతే.. మరో 129 లిఫ్టులు గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో పడావు పడ్డాయి. మిగిలిన వాటిలో 221 పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయి. మరో 113 లిఫ్టులు పాక్షికంగా నడిపించాల్సిన పరిస్థితిలో ఉన్నాయి. అత్యధికంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని లిఫ్టులే పనిచేయడం లేదు. ఖమ్మం జిల్లాలో 56 లిఫ్టులు పాడైపోగా.. 19 లిఫ్టులను నిర్లక్ష్యం చేశారు. ఆ జిల్లాలో మొత్తం 135 లిఫ్టులుంటే.. 75 పనిచేయడం లేదు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 124 లిఫ్టులకుగానూ 30 పనిచేయట్లేదు. ఆదిలాబాద్ జిల్లాలో 54 లిఫ్టులుంటే 26 పనిచేసే పరిస్థితిలో లేవు. మరో 17 లిఫ్టులు నిర్లక్ష్యం కారణంగా పనికిరాకుండా పోయాయి. నల్గొండ జిల్లాలో 37 లిఫ్టులుంటే 21 పాడయ్యాయి. సూర్యాపేట జిల్లాలో 54 లిఫ్టులకు 21 పనిచేయడం లేదు. జగిత్యాల జిల్లాలో 30 లిఫ్టులకు 24, మంచిర్యాలలో 21 లిఫ్టులకుగానూ 15 పనిచేయట్లేదు.
నిధుల కోసం వేట
పాడైపోయిన లిఫ్టులను బాగు చేసి పునరుద్ధరించాలంటే రూ.400 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, బడ్జెట్లో కార్పొరేషన్‌కు ఇప్పటికే ప్రభుత్వం రూ.250 కోట్లను కేటాయించింది. ఈ నేపథ్యంలోనే నిధుల కోసం సర్కారుకు కార్పొరేషన్ లేఖ రాయనున్నట్టు సమాచారం. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో నెదర్లాండ్స్ ప్రభుత్వం గ్రాంట్ కింద రూ.250 కోట్ల సాయం చేసింది.
ఇప్పుడు కూడా అలాంటి మార్గాలపై కార్పొరేషన్ దృష్టి సారించింది. ఒకప్పుడు లిఫ్టుల మెయింటెనెన్స్ కోసం రైతుల నుంచి ఎకరాకు రూ.500 వరకు నీటి తీరువాను వసూలు చేసేవారు. అందుకోసం అప్పట్లో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేశారు. ఆ సాగునీటి సంఘాలకు ఎన్నికలూ నిర్వహించేవారు. అయితే, రాష్ట్ర ఏర్పాటు తర్వాత సాగునీటి సంఘాలు రద్దయిపోయాయి. ఈ నేపథ్యంలోనే నెదర్లాండ్స్ లాంటి దేశాల నుంచి గ్రాంట్స్‌ను తీసుకొచ్చే విషయంపై అధికారులతో ఓ స్టడీ చేయించాలని కార్పొరేషన్ భావిస్తున్నది.
ఆయకట్టుకు నీరందుతలేదు
లిఫ్టులు పనిచేయకపోవడం వల్ల వాటి పరిధిలోని ఆయకట్టుకు నీరు అందడం లేదు. రాష్ట్రంలోని 643 లిఫ్టుల కింద 4,69,138 ఎకరాలకు నీళ్లివ్వాల్సి ఉంది. కానీ, వాటిలో చాలావరకు పనిచేయని కారణంగా 1,72,811 ఎకరాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడింది. దీంతో రైతులు అక్కడ ప్రత్యామ్నాయాలను చూసుకుంటున్నారు. పాక్షికంగా పనిచేస్తున్న లిఫ్టుల కింద 1,29,855 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నా.. పొలాలకు కొంత వరకే అందుతున్నదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వాటిని రన్ చేసినప్పుడు నీళ్లు వస్తున్నాయే తప్ప.. ఆ తర్వాత అందడం లేదని అంటున్నారు. పూర్తి స్థాయిలో పనిచేస్తున్న లిఫ్టులతోనే కొంతమేర ఆయకట్టుకు నీరు అందుతున్నది. 221 లిఫ్టుల ద్వారా 1,66,472 ఎకరాలకు నీళ్లు పారుతున్నట్టుగా అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి.