
- కుదేలవుతున్న చిరు వ్యాపారులు
- మరింత కష్టతరంగా శ్రామికుల జీవితం
హుస్నాబాద్, వెలుగు: ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎండలు మండిపోతున్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలతో జనం అల్లాడుతున్నారు. మండుటెండల్లో శ్రామికులు తల్లడిల్లుతుండగా, చిరు వ్యాపారులు కుదేలవుతున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో బతుకు జీవుడా అంటూ చిరు వ్యాపారులు జీవితం ఎల్లదీస్తున్నారు. మాడు పగిలే ఎండలో చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవన సమరం సాగిస్తున్న అలాంటి వారి వెతలు ఇవీ..
బతుకు బండి లాగుతూ..
పున్న కొమురయ్య వయసు 67 ఏండ్లు. హుస్నాబాద్‌లో ఎన్నో ఏండ్ల నుంచి తోపుడు బండిని లాగుతున్నాడు. మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నప్పటికీ ఆయనకు అది తప్ప ఇంకో మార్గం లేదు. తోపుడు బండి లాగడం ఆగిపోతే తన కుటుంబం గడవదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఆయనకు ముగ్గురు ఆడపిల్లలు కాగా, ఒక అమ్మాయి చనిపోయింది. కూలి పని చేస్తూ చేదోడుగా ఉండే ఆయన భార్యకు ఓ ప్రమాదంలో చేయి విరిగి మంచం పట్టింది.
దీంతో ఎర్రటి ఎండలో బతుకు బండిని లాగుతున్నారు. ఈ బాధలు శారద, స్వరూప, కొమురయ్య ఒక్కరివే కాదు. చిరువ్యాపారుల చేసుకునే అందరి పరిస్థితి దాదాపు ఇదే. వ్యవసాయం, భవన నిర్మాణ రంగం, ఉపాధి హామీ, ఇతర కాయకష్టం చేసుకునే వారి కష్టాలు ఇంకా వర్ణనాతీతం. ‘‘హీట్ వేవ్స్ ఉన్నాయి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు అత్యవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు చెబుతున్నారు. కానీ పనిచేయకుంటే తమకు ముద్ద పెట్టేవారు ఎవరు?” అని శ్రామికులు వాపోతున్నారు.
కూరగాయలే ఆ కుటుంబానికి ఆధారం
హోల్‌సేల్ మార్కెట్ నుంచి తీసుకొచ్చి శారద కూరగాయలు అమ్ముతుంటుంది. ఎండ కారణంగా అవి వాడిపోకుండా ఉండేందుకు నిరంతరం నీటిని చల్లుతూనే ఉంటుంది. అయినప్పటికీ విపరీతమైన వేడితో పాడవుతున్నాయి. హుస్నాబాద్‌లో మార్కెట్ నిర్మిస్తామని బీఆర్ఎస్ నాయకులు పదేండ్లుగా చెబుతున్నా ఇంకా పూర్తికాలేదు. దీంతో మార్కెట్ బిల్డింగ్లేకపోవడంతో ఎన్నో ఏండ్లుగా మహిళలు ఇలా పోలీస్ స్టేషన్ పక్కన రోడ్డుపై ప్యాపారం చేసుకుంటున్నారు. ఇంతలా తన సరుకు నష్టపోవడం ఇదే తొలిసారని శారద చెబుతోంది. తన కుటుంబానికి కూరగాయల దుకాణమే ఆధారమని, పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్ ఏంటని ఆందోళన చెందుతోంది.
ఎండలో ఎదురీత..
చేపలను తాజాగా ఉంచడమే భారంగా మారిందని స్వరూప వాపోయింది. “చేపలను తాజాగా ఉంచాలంటే ఐస్ కావాలి. నేను సంపాదించే దానిలో ఎక్కువ భాగం ఐస్ కోసమే ఖర్చు చేస్త. ఒక్కోరోజు రూ.500 విలువ చేసే చేపలు పాడవుతున్నాయి. ఇన్నేండ్లలో ఎప్పుడూ కూడా ఇంత నష్టం రాలేదు” అని తెలిపారు. ఐస్ ధరలు కూడా పెరిగిపోవడంతో ఆమెలా చేపలు అమ్ముకునేవారు రెండు వైపులా ఈ భారాన్ని మోయాల్సి వస్తోంది.