పెద్దోళ్లతో పోటీకి సై.. చిన్న ఎఫ్​ఎంసీజీ కంపెనీల విస్తరణ బాట

పెద్దోళ్లతో పోటీకి సై.. చిన్న ఎఫ్​ఎంసీజీ కంపెనీల విస్తరణ బాట

న్యూఢిల్లీ: చిన్న/ప్రాంతీయ ఎఫ్​ఎంసీజీ కంపెనీలు పెద్ద ఎఫ్​ఎంసీజీ (ఫాస్ట్​మూవబుల్​ కన్జూమర్​ గూడ్స్​)లకు ధీటుగా విస్తరిస్తున్నాయి. గత రెండు క్వార్టర్లలో ఇవి రెండంకెల అమ్మకాల వృద్ధిని సాధించి జాతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లకు మరింత గట్టి పోటీనిస్తున్నాయి. అమ్మకాలు పెరుగుతుండటం, ధరల భారం (ఇన్​ఫ్లేషన్​) తగ్గుముఖం పట్టడం వల్ల  ప్రాంతీయ ఎఫ్​ఎంసీజీ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు వేగంగా ఎదుగుతున్నాయి. 

రుంగ్తా టీ, బాలాజీ వేఫర్‌‌‌‌‌‌‌‌లు, మారియో రస్క్,  బోవోంటో సాఫ్ట్​డ్రింక్స్​ వంటి ప్రాంతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు జనంలోకి చొచ్చుకుపోవడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నాయి. కరోనా తరువాత వీటికి ఎదురులేకుండా పోయింది.  ఉత్తరప్రదేశ్, రాజస్థాన్,  బీహార్‌‌‌‌‌‌‌‌ సహా పలు మార్కెట్లలో సత్తా చాటుతున్న రుంగ్తా టీ... చాయ్ పాయింట్,  చాయోస్‌‌‌‌‌‌‌‌ ల మాదిరిగానే టీ పార్లర్‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేస్తోంది. మార్కెట్​ను అంచనా వేయడానికి ఇదొక ఈ–కామర్స్ బృందాన్ని కూడా నియమించింది. 

 ప్రస్తుత మార్కెట్‌‌‌‌‌‌‌‌లలోని అనేక జాతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌ల కంటే వేగంగా అభివృద్ధి చెందుతున్నామని,  పంపిణీదారులతో,  కస్టమర్‌‌‌‌‌‌‌‌లతో బలమైన సంబంధాలు ఉన్నాయని రుంగ్తా టీ మేనేజింగ్ డైరెక్టర్ గిరిజేశ్​ రుంగ్తా చెప్పారు.  టీ పార్లర్‌‌‌‌‌‌‌‌లతో, ఈ–కామర్స్‌‌‌‌‌‌‌‌తో తదుపరి స్థాయికి వెళుతున్నామని, అదే సమయంలో నాణ్యత, ఇనోవేషన్లకు ప్రాధాన్యం ఇస్తున్నామని వివరించారు.

 ప్రాంతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు గత ఏప్రిల్– ఈ ఏడాది ఏప్రిల్ మధ్య కాలంలో 12.7శాతం వృద్ధి చెందాయని, జాతీయ బ్రాండ్‌‌‌‌‌‌‌‌లు 8.2శాతం పెరిగాయని కాంటార్​ వరల్డ్​ ప్యానెల్​ ఇటీవల విడుదల చేసిన రిపోర్టులో వెల్లడించింది. రీజనల్​ బ్రాండ్ల డిస్ట్రిబ్యూషన్​, ఇన్నోవేషన్​ పెరగడం ఇందుకు కారణమని పేర్కొంది. 

వాల్యూ ఫర్​ మనీ..

రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌కు చెందిన స్నాకింగ్ సంస్థ బాలాజీ వేఫర్స్.. పెప్సికో  ఇంద్రా నూయి,  ఇతర పెద్ద స్నాక్స్ కంపెనీలను ఆకర్షించేస్థాయికి వెళ్లింది. ఇది ఉత్తర భారతదేశంలో తన మొదటి ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను లక్నోలో ఏర్పాటు చేస్తోంది. "మా ప్లాన్​ ఏమిటంటే భారతదేశం అంతటా విస్తరించడం. గుజరాత్ దాటి మేం అన్ని ప్రాంతాలకూ వెళ్తాం.  వాల్యూ ఫర్​ మనీ వ్యూహాన్ని ఇక నుంచి కూడా కొనసాగిస్తాం”అని బాలాజీ ఫౌండర్​ చందూభాయ్ విరానీ చెప్పారు.  

చిరుతిళ్లు, టీ, బిస్కెట్లు, డిటర్జెంట్లు, సబ్బులు,  టూత్‌‌‌‌‌‌‌‌పేస్ట్‌‌‌‌‌‌‌‌లు వంటి సెగ్మెంట్లలో ప్రాంతీయ ఎఫ్​ఎంసీజీ కంపెనీలు జాతీయస్థాయికి వెళ్లే పోకడ కనిపిస్తోందని ఈ రంగానికి చెందిన నిపుణులు అంటున్నారు.  "ఈ విషయంలో యాజమాన్యం కీలకమైనది. ఆపరేషన్స్​లో నేరుగా పాల్గొనే ప్రాంతీయ ఎఫ్​ఎంసీజీ కంపెనీల ఫౌండర్లు వేగంగా విస్తరిస్తున్నారు”అని ట్రెడిషనల్​ ట్రేడ్​ డిస్ట్రిబ్యూషన్​ ప్లాట్​ఫారమ్​ వీట్రాక్ ఎక్స్‌‌‌‌‌‌‌‌టెండ్‌‌‌‌‌‌‌‌ రీచ్ కో–ఫౌండర్​ సుమిత్ అగర్వాల్ అన్నారు. 

హిందుస్థాన్​ యూనిలీవర్​(హెచ్​యూఎల్​) వంటి పెద్ద కంపెనీల మాదిరిగా ప్రాంతీయ ఎఫ్​ఎంసీజీలు అన్ని కేటగిరీలపై ఒకేసారి దృష్టి పెట్టడం లేదని, ఒక్కొక్కదానిని టార్గెట్​ చేసుకుంటూ వెళ్తున్నాయని చెప్పారు. చిన్న కంపెనీలు కాబట్టి కస్టమర్​కు అధిక ప్రయోజనం చేకూర్చగలవని చెప్పారు.  

బొవాంటో సాఫ్ట్​డ్రింగ్స్​ తమిళనాడు,  ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని ప్రధాన మార్కెట్‌‌‌‌‌‌‌‌లకు తన ఆరెంజ్,  అల్లం, ఆలే ఫిజ్జీ డ్రింక్స్ వంటి ఉత్పత్తులను తీసుకువెళ్లే ప్రయత్నాల్లో ఉంది. మారియో రస్క్ తన మొదటి బ్రాండ్ అంబాసిడర్‌‌‌‌‌‌‌‌గా నటుడు,  సింగర్​ దిల్జిత్ దోసాంజ్‌‌‌‌‌‌‌‌ను నియమించుకుంది.