- కొత్తగా 9 నెలల పర్మిషన్ తెచ్చి.. రూ.281 కోట్లిచ్చినా పనులు కావట్లే
- వరంగల్‌లో 108 పనులకు పూర్తయింది 54 పనులే..
- 23 పనులు ఇంకా టెండర్ స్థాయిలోనే !
- కరీంనగర్‌లో 48 పనులకు ఇంకా 21 పనులు పెండింగే..
- మార్చిలో ముగియనున్న గడువు
- పనులు కాకుంటే బిల్లులకు తప్పని తిప్పలు
వరంగల్/కరీంనగర్, వెలుగు: వరంగల్, కరీంనగర్ స్మార్ట్ సిటీ పనులు ఎన్కబడ్డాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఈ రెండు నగరాలు ఎంపికై దాదాపు ఏడేండ్లు గడుస్తున్నా పనులు మాత్రం పూర్తి కాలేదు. పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్ సర్కార్ కేంద్ర ప్రభుత్వంతో సమానంగా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోగా.. కనీసం కేంద్ర నిధులతో చేసిన పనుల లెక్కలు కూడా చెప్పలేదు. ఎక్కడి పనులు అక్కడ ఉండగానే 2024 జూన్‌తో స్మార్ట్ సిటీ స్కీం కోసం కేంద్రం ఇచ్చిన గడువు కూడా ముగిసింది.
దీంతో సీఎం రేవంత్‍రెడ్డి ఢిల్లీ వెళ్లినప్పుడు సంబంధిత కేంద్రమంత్రిని కలిసి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు మరో ఏడాది సమయం ఇవ్వాలని కోరడంతో 2025 మార్చి నెలాఖరు వరకు గడువు ఇచ్చారు. అంతటితో ఆగకుండా బీఆర్ఎస్ పెండింగ్ పెట్టిన సగం మ్యాచింగ్ గ్రాంట్‌ను సైతం అందజేసింది. సెప్టెంబర్ కల్లా పనులు పూర్తిచేసి బిల్లులు పెడ్తే మిగిలిన గ్రాంట్ కూడా చెల్లిస్తామని చెప్పింది. తీరా మరో మూడు నెలల్లో గడువు పూర్తి కానుండగా, స్మార్ట్ సిటీ పనుల్లో సగం కూడా పూర్తికాకపోవడం, ఇంకా కొన్ని పనులకు టెండర్లు కూడా నిర్వహించకపోవడం కలవరపెడ్తోంది.
వరంగల్‍కు రాష్ట్ర వాటా కింద రూ.179 కోట్లు
వరంగల్ నగరం 2016లో స్మార్ట్ సిటీ లిస్ట్‌లో ఎంపికైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా చెరో రూ.100 కోట్ల చొప్పున ఐదేండ్లలో రూ.500 కోట్లు ఇస్తే.. రూ. 944.67 కోట్ల పనులు చేపట్టాల్సి ఉంది. కేంద్రం మొదట్లోనే తన వాటాగా రూ.200 కోట్లు ఇవ్వగా.. నాడు అధికారంలో ఉన్న బీఆర్‍ఎస్ ప్రభుత్వం కేంద్రంతో సమానంగా రాష్ట్ర వాటా కేటాయించకుండా.. ఎన్నికలు వస్తున్నాయన్న పేరుతో చివర్లో కొంత బడ్జెట్ ఇచ్చింది. దీంతో ఏడెనిమిదేండ్లుగా పనులు సాగుతూనే ఉన్నాయి. కనీసం చేసిన పనులకు లెక్కలు, బిల్లులు పంపాలని స్మార్ట్ సిటీ ఆఫీసర్లు కోరినా ఇక్కడి నుంచి అవి కూడా పంపలేదు.
ఈ క్రమంలో రాష్ట్రంలో ప్రభుత్వం మారగా, ఈ ఏడాది జూన్‌తో స్మార్ట్‌సిటీ పథకం ముగిసింది. సీఎం రేవంత్‍రెడ్డి చొరవతో పనులకు మరో తొమ్మిది నెలల గడువు ఇచ్చారు. అయితే ఇక్కడి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయడానికి అదనంగా రూ.358 కోట్లు అవసరం అవుతాయని భావించగా.. రాష్ట్ర ప్రభుత్వం అందులో సగం తన వాటాగా రూ.179 కోట్లు సైతం మంజూరు చేసింది. కావాల్సిన నిధులున్నా.. తొమ్మిది నెలల గడువే ఉందని తెలిసినా ఆపీసర్లు ఇప్పటివరకు కేవలం 50 శాతంలోపు పనులు మాత్రమే పూర్తి చేశారు. రూ.944.67 కోట్ల పనుల్లో రూ.427.13 కోట్ల పనులు మాత్రమే పూర్తిగా కాగా మరో రూ.517.55 కోట్ల పనులు పురోగతిలో ఉన్నట్లు చెప్తున్నారు.
అన్నింటికీ మార్చి 31 డెడ్‌లైన్
రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు నగరంలో చేపట్టే స్మార్ట్‌సిటీ పనులు పూర్తి చేయడానికి కేంద్రం 2025 మార్చి 31 వరకు చివరి అవకాశంగా గడువు పెట్టింది. అయితే ఆ గడువుకు ముందుస్తుగానే పనులు పూర్తి చేయాల్సిన ఆఫీసర్లు మార్చి 31నే డెడ్‌లైన్‌గా పెట్టుకున్నారు. ఇందులో ఏండ్ల తరబడి కొనసాగుతున్నవీ, కొత్తవి కూడా ఉన్నాయి.
భద్రకాళి చెరువు బండ్ వద్ద రూ.37.2 కోట్ల రోడ్డు పనులు, వడ్డేపల్లి బండ్ వద్ద రూ.34.05 కోట్ల అభివృద్ధి పనులు, హంటర్ రోడ్డు ఉర్సుగుట్ట వద్ద రూ.15.23 కోట్లు, హనుమకొండ రాజాజీనగర్, వరంగల్ పోతన రోడ్‌తో పాటు మరో మూడు చోట్ల రూ.22.6 కోట్లతో నాలాలు, కల్వర్టులు, రూ.25.04 కోట్లతో ప్రెసిడెన్సీ స్కూల్ నుంచి నయీంనగర్ బ్రిడ్జి వరకు నాలా, రిటైనింగ్ వాల్ నిర్మాణం, రూ.27.5 కోట్లతో కరీమాబాద్ ఫ్లైఓవర్ నుంచి గవిచర్ల రోడ్ జంక్షన్ వరకు ప్రధాన రోడ్డు, రూ.10 కోట్లతో సిటీలోకి ఎంట్రెన్స్ ద్వారం, రూ.46 కోట్లతో 05 స్మార్ట్ రోడ్స్ ఇంప్రూవ్‍మెంట్, రూ.36 కోట్లతో రాంపూర్ వద్ద బయోమైనింగ్ ట్రీట్‌మెంట్ డంప్ ప్లాంట్..
ఇలా ఏండ్ల తరబడి సాగుతున్న మరెన్నో పనులకు మొక్కుబడిగా స్మా్ర్ట్ సిటీ గడువు చివరిరోజునే డెడ్‌డైన్‌గా పెట్టుకున్నారు. నగరంలో 22 ప్రధాన రోడ్ల పనులు ఉండగా 19 పనులు ఇంకా అసంపూర్తిగా ఉన్నాయి. మరో 23 పనుల్లో కొన్ని టెండర్ల స్థాయిలో, మరికొన్ని టెండర్లు పిలవనివే ఉన్నాయి.
మూడు నెలల్లో పూర్తయ్యేనా ?
రూ.10 కోట్లతో నిర్మిస్తున్న కశ్మీర్‌గడ్డ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనుల్లో పునాది కోసం కందకం తవ్వి వదిలేశారు. రూ.7 కోట్లతో చేపట్టిన లైబ్రరీ బిల్డింగ్ పనులు 40 శాతం మేర పూర్తయ్యాయి. రూ.7 కోట్లతో చేపట్టిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పనులు సగం వరకే పూర్తయ్యాయి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచాయి. రూ.16 కోట్లతో చేపట్టిన బయోమైనింగ్ రెండేళ్లు దాటినా 40 శాతం కూడా కంప్లీట్ కాలేదు. స్మార్ట్ సిటీ నిబంధనల ప్రకారం గడువులోపు పనులు పూర్తయితేనే బిల్లులు మంజూరవుతాయి. ప్రస్తుత పరిస్థితి చూస్తే మూడు నెలల్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు.
కరీంనగర్‍లో 48 పనుల్లో 23 పెండింగ్
కరీంనగర్ సిటీ 2017లో స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కింద ఎంపికవగా 47 రకాల పనుల పూర్తికి రూ.934.35 కోట్లు మంజూరు అయ్యాయి. ఇందులో రూ.647 కోట్లతో కరీంనగర్ సిటీలో రోడ్లు, డ్రైనేజీలు, పార్క్‌లు, ఫుట్‌పాత్‌లు, అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్ట్రీట్ లైట్స్, మెయిన్ సెంటర్లలో ఫ్లడ్ లైట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, ప్రధాన కూడళ్లలో ఫ్రీ వైఫై, డిజిటల్ స్క్రీన్లు వంటి 25 రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా రూ.287 కోట్ల విలువైన 23 రకాల పనులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో రెండింటికి టెండర్లే పిలవలేదు.
రూ.24 కోట్లతో చేపట్టాల్సిన సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుకు స్థలం దొరక్క టెండర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఏరోజు చెత్తను అదే రోజు శుద్ధి చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం కాగా తొలుత కరీంనగర్ రూరల్ మండలం ముగ్దుంపుర వద్ద ప్రభుత్వ భూమిని ఎంపిక చేయగా స్థానికులు వ్యతిరేకించడంతో ఆ ఆలోచనను విరమించుకున్నారు. స్థలం దొరికితే తప్ప ఈ ప్రాజెక్టు ప్రారంభయ్యేలా లేదు. ఇదే జరిగితే రూ.24 కోట్లు వృథా కానున్నాయి. స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్‌ల వద్ద రూ.40 లక్షలతో సైన్‌బోర్డుల ఏర్పాటుకు టెండర్లు పిలవాల్సి ఉంది.