- అసంపూర్తి పనులతో జనం ఇబ్బందులు
- ప్రాజెక్టును పొడగించిన తర్వాత ముందుకు సాగని పనులు
- రూ.287 కోట్ల విలువైన 22 పనులు పెండింగ్ లోనే
- కొత్త కమిషనర్ దృష్టి సారించాలంటున్న పబ్లిక్
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీని అన్ని వసతులతో కూడిన అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన స్మార్ట్ సిటీ పనులు నత్తనడకన నడుస్తున్నాయి. అసలు పనులను చకచకా పూర్తి చేసిన అధికారులు..కొసరు పనులను పట్టించుకోవడంలేదు. అసంపూర్తిగా నిలిచిపోయిన అభివృద్ధి పనులతో సిటీ జనం ఇబ్బందులు పడుతున్నారు. 2017లో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికైన కరీంనగర్ సిటీలో 47 రకాల ప్రాజెక్టుల పూర్తికి రూ.934.35 కోట్లు మంజూరయ్యాయి.
ఇందులో రూ.647 కోట్లతో కరీంనగర్ సిటీలో రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఫుట్‌పాత్‌లు, అంబేద్కర్ స్టేడియంలో స్పోర్ట్స్ కాంప్లెక్స్, స్ట్రీట్ లైట్స్, మెయిన్ సెంటర్లలో ఫ్లడ్ లైట్లు, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్, కమాండ్ కంట్రోల్ రూమ్, ప్రధాన కూడళ్లలో ఫ్రీ వైఫై, డిజిటల్‌స్క్రీన్లు తదితర 25 రకాల సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ పనులు పూర్తి చేసేనాటికే స్మార్ట్ సిటీ ప్రాజెక్టు గడువు ఈ ఏడాది జూన్ 30తో ముగిసింది. దీంతో మిగతా నిధుల వినియోగం ఎలా అనే అంశంపై గందరగోళం నెలకొంది.
ఈ క్రమంలోనే స్మార్ట్ సిటీ పనుల గడువును 2025 మార్చి 30 వరకు పెంచుతూ కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయినా పెండింగ్ పనులపై దృష్టి సారించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొత్త కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ అయినా పనులు పూర్తి చేయాలని సిటీ పబ్లిక్ కోరుతున్నారు.
ఏడు నెలల్లో పూర్తయ్యేనా..?
కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ప్రకారం.. కరీంనగర్ సిటీలో రూ.287 కోట్ల విలువైన 22 పనులను పూర్తి చేయడానికి మరో ఏడు నెలల మాత్రమే సమయం ఉంది. రూ.27 కోట్లలో మున్సిపల్ సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌కు టెండర్‌పిలవాల్సి ఉండగా.. ఆ ప్రక్రియ మొదలుపెట్టలేదు. బాలసదనం భవన నిర్మాణానికి రీ టెండర్‌నిర్వహించాల్సి ఉంది. మిగతా 20 రకాల పనుల్లో కొన్ని పునాది దశలో ఉండగా.. మరికొన్ని సగం మాత్రమే జరిగాయి.
కశ్మీర్‌గడ్డ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పనులను పునాది కోసం కందకం తవ్వి వదిలేశారు. టవర్‌సర్కిల్‌లో ఆధునికీకరణ పనులు అధ్వాన్నంగా మారాయి. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదుట ఐలాండ్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఫుట్ పాత్ లపై వేసిన టైల్స్ ఊడిపోతున్నా వాటిని తీసేసి కొత్తవి వేయడం లేదు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఏర్పాటు చేసిన స్ట్రీట్ లైట్స్ ను కొన్ని చోట్ల ఆన్ చేయడం లేదు. దీంతో ఆయా రోడ్లు చీకటిగా మారుతున్నాయి.
రెయిన్ డ్రెయిన్ పనులు అంతంతే..
కట్టరాంపూర్‌లో లోయర్ మానేరు డ్యాంకు వెళ్లే దారిలో రెండేళ్ల క్రితం డ్రైనేజీ కోసం కాల్వ తవ్వి వదిలేశారు. దీంతో నీరంతా ఒక దగ్గర నిలిచిపోతుంది. కరీంనగర్ లోని శ్రీనగర్‌కాలనీ నుంచి గోదాంగడ్డ ఎస్‌బీహెచ్ ఫంక్షన్‌హాల్ వరకు రెయిన్ డ్రైయిన్ నిర్మించాల్సి ఉండగా అసంపూర్తిగా వదిలేశారు. దీంతో వరద నీరు వెనక్కి వస్తోంది. గణేశ్‌నగర్ బైపాస్‌లోనూ రెయిన్ డ్రెయిన్ పనులను ఆపేశారు. ఉస్మాన్‌పుర, అహ్మద్‌పుర, అశోక్‌నగర్‌ప్రాంతాల్లో రోడ్లు, డ్రైనేజీలు ఆగిపోయాయి.