- చెత్త నిండగానే అలారం మోగుతది
- వెంటనే తరలించేలా ఏర్పాట్లు
- నాలుగేండ్ల కింద డస్ట్బిన్లు ఎత్తేసిన బల్దియా
- అయినా చెత్త వేస్తుండడంతో
- టెక్నాలజీతో పాత విధానం అప్డేట్
హైదరాబాద్ సిటీ, వెలుగు : గ్రేటర్లో నాలుగేండ్ల కింద డస్ట్బిన్లు తొలగించిన బల్దియా.. సమస్య పరిష్కారం కాకపోవడంతో పాత విధానానికే మొగ్గు చూపింది. కాకపోతే ఆ పద్ధతికి టెక్నాలజీని జోడిస్తూ కాస్త అప్డేట్అయ్యింది. చెప్పినా వినకుండా చెత్త వేస్తున్న ఏరియాల్లో స్మార్ట్డస్ట్బిన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఇవి ఇదివరకు ఉన్న డస్ట్ బిన్ల మాదిరిగా కాకుండా సెన్సార్లతో పని చేస్తాయి. ఈ బిన్లలో చెత్త నిండగానే ఖాళీ చేయండంటూ కంటైనర్ వాహనానికి సెన్సార్ ద్వారా అలారం వెళ్తుంది. ఒక్కో కంటైనర్ కు 25 డస్ట్ బిన్లను అటాచ్చేస్తారు. వారికి ఏ డస్ట్బిన్నిండింది..ఎక్కడి నుంచి అలారం వచ్చింది అన్నది క్లియర్గా తెలిసిపోతుంది కాబట్టి వెంటనే వెళ్లి ఖాళీ చేస్తారు. ప్రస్తుతం సిటీలో 25 డస్ట్ బిన్లను ఏర్పాటు చేయగా తీవ్రమైన సమస్య ఉన్న వెయ్యి చోట్ల బిన్లను ఏర్పాటు చేసే పనిలో బల్దియా సిబ్బంది ఉన్నారు.
సక్సెస్ కాలే..
డస్ట్ బిన్ లెస్ సిటీ పేరుతో నాలుగేండ్ల కింద నగరంలోని గార్భెజ్ వల్నరబులం పాయింట్ల(జీవీపీ) వద్ద డస్ట్ బిన్లను బల్దియా అధికారులు తొలగించారు. తర్వాత ఆ ప్రదేశాల్లో, రోడ్లపై చెత్త వేయకుండా చాలా ప్రయత్నాలు చేశారు. చెత్త వేసిన వారికి ఫైన్లు విధించడంతో పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. కొన్ని సందర్భాల్లో జీవీపీల వద్ద షిఫ్టుల వారీగా కార్మికులను కాపలా ఉంచారు. అయినా, ఆశించిన మార్పు రాలేదు.
ఇంటింటికీ వెళ్లి చెత్త సేకరించడానికి స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేయగా కొన్ని కాలనీల్లోకి ఆటోలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆటోలు వచ్చినా డబ్బులు ఇవ్వాల్సి రావడం, డబ్బులు ఇవ్వని చోటికి ఆటోలు పోకపోవడంతో ఆ చెత్తను తీసుకువచ్చి జీవీవీ పాయింట్ల వద్ద వేస్తున్నారు. 4500 స్వచ్ఛ ఆటోలు ఉన్నా వెయ్యి వరకు ఆటోలు ఫీల్డ్ లోకి వెళ్లడం లేదు. కొన్ని రిపేర్లకు రావడం, మరికొన్ని కేటాయించిన చోట కాకుండా వేరే చోట్లకు వెళ్లి చెత్తను సేకరిస్తున్నట్టు గుర్తించారు.
దీంతో కోటిన్నర జనాభాకు ఉన్న ఆటోలు సరిపోక సమస్య ఇంకా తీవ్రమైంది. పై కారణాలతో సమస్య తీవ్రత ఉన్న చోట డస్ట్బిన్లు ఏర్పాటు చేయడమే ఉత్తమమని బల్దియా కమిషనర్భావించారు. అయితే, స్మార్ట్డస్ట్బిన్లవైపే ఆయన మొగ్గు చూపారు. స్వచ్ఛ ఆటోలు కూడా కొనసాగుతాయని, చెత్త సమస్య తీవ్రంగా ఉన్నచోట మాత్రమే స్మార్ట్డస్ట్బిన్లు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్తున్నారు.
ఖర్చు చేస్తున్నా సమస్య తీరట్లే..
గ్రేటర్ లో రోజూ దాదాపు 7వేల టన్నుల చెత్త వస్తోంది. 2009 నుంచి చెత్త సేకరించడం, ప్లాంట్లకు తరలించడం, అక్కడ డిస్పోజ్చేయడం లాంటి పనులు చేసేందుకు రాంకీ అనే సంస్థకు అప్పగించింది. ఇందుకుగాను టన్నుకు రూ.2వేలు జీహెచ్ఎంసీ సదరు సంస్థకు చెల్లిస్తోంది. ఈ ఒప్పందం 2034 వరకు ఉంది. అయితే, ఎంత చేసినా సిటీలో చెత్త సమస్య మాత్రం తీరడం లేదు.
రాంకీ సంస్థ దీనికి బాధ్యత వహించాల్సి ఉన్నా ఏవేవో కారణాలు చెప్తూ తప్పించుకుంటోందన్న ఆరోపణలున్నాయి. దీంతో బల్దియా కమిషనర్ ఇలంబరితి చెత్త సమస్యపై ఫోకస్పెట్టి మళ్లీ డస్ట్ బిన్లు పెట్టాలన్న నిర్ణయం తీసుకున్నారు. అయితే, చెత్త నిండితే తెలియకపోవడం, దుర్వాసన రావడం, దోమలు చేరడం జరుగుతుండడంతో మునుపటిలా కాకుండా సెన్సార్ డస్ట్ బిన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అయితే, ఈ డస్ట్బిన్లను భూమిలో పెట్టి ఆపరేట్ చేయాలని అనుకోగా, కేబుల్స్ సమస్య ఉన్న చోట సమస్య ఎదురవుతుండడంతో అక్కడ పైననే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.