- అమెరికాలో మార్కెట్లోకి తేనున్న బయోఫైర్ కంపెనీ
- ఫేసియల్, ఫింగర్ ప్రింట్ టెక్నాలజీతో రానున్న తొలి బయోమెట్రిక్ గన్ ఇదే
- ధర రూ. 1.25 లక్షలుగా ఖరారు
న్యూయార్క్ : అమెరికాలో పెరిగిపోతున్న గన్ కల్చర్‌కు చెక్ పెట్టేలా బయోఫైర్ అనే కంపెనీ వినూత్న ఆవిష్కరణతో ముందుకొచ్చింది. గన్ను కేవలం ఓనర్ మాత్రమే వాడేలా.. ఆయుధాలు మిస్యూజ్ కాకుండా ఉండేందుకు ఫేసియల్, ఫింగర్‌ప్రింట్ రికగ్నైజేషన్‌తో పనిచేసే తొలి బయోమెట్రిక్ స్మార్ట్ గన్ ను తయారుచేసింది. ఇందులో రీచార్జెబుల్, రిమూవెబుల్, హైఎండ్యూరెన్స్ లిథియం బ్యాటరీలను వినియోగించింది. ఈ బ్యాటరీలు యావరేజ్ వాడకంతో నెలపాటు పనిచేస్తాయని కంపెనీ తెలిపింది. తమ మొదటి బయోమెట్రిక్ 9 ఎంఎం హ్యాండ్గన్లను మార్చి నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదల చేస్తామని కంపెనీ పేర్కొన్నది. మొదటి బ్యాచ్ గన్లు పెట్టుబడిదారులు, స్నేహితులు, కంపెనీ అంతర్గత సర్కిల్లోని వారికి.. ఆ తర్వాత మొదటి చెల్లింపు కస్టమర్లకు గన్లను సరఫరా చేస్తామని చెప్పింది.
ప్రత్యేక పర్పస్ కోసమే స్మార్ట్ గన్
మార్కెట్లో ముందుండాలనే లక్ష్యంతో కాకుండా ఓ ప్రత్యేక పర్పస్ కోసమే ఈ స్మార్ట్ గన్ను బయోఫైర్ కంపెనీ తయారుచేసింది. ఈ గన్ను అనధికార వ్యక్తులు ముఖ్యంగా పిల్లలు వినియోగించకుండా ఉండేలా రూపొందించారు. ఇందులో వైఫై, బ్లూటూత్, జీపీఎస్ లేకున్నా కేవలం బయోమెట్రిక్ డాటాతోనే ఇతరులు దీన్ని ఉపయోగించకుండా తయారుచేసినట్టు కంపెనీ వెల్లడించింది. యజమానులు తమ రక్షణ కోసం మాత్రమే దీన్ని వినియోగించేలా రైట్, లెఫ్ట్ హ్యాండ్ మాడల్స్‌లో రూపొందించినట్టు తెలిపింది. ఇందులో కస్టమైజెబుల్ గ్రిప్స్ ఆప్షన్ కూడా ఉన్నదని చెప్పింది. దీని ధర 1, 499 డాలర్లు(రూ. 1.25 లక్షలు)గా ప్రకటించింది. ఇది ప్రజా భద్రతలో కొత్త శకానికి నాంది అవుతుందని కంపెనీ తెలిపింది.