చూపులేని వాళ్ల కోసం ఏదైనా చేయాలనుకున్నాడు అంకురిత్. ఆ ఆలోచన నుండి పుట్టిందే ‘స్మార్ట్ సెన్సర్ షూ.’
అస్సాంలో కరీంగంజ్ జిల్లాకు చెందిన 14 ఏండ్ల అంకురిత్ కర్మాకర్ తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పటినుండే ఏవేవో కనిపెడుతుండేవాడు. కొత్తగా ఆలోచించేవాడు. పేపర్‌లో, టీవీలో అలాంటి వాటి గురించి వచ్చే వార్తలను ఫాలో అయ్యేవాడు. ఇంటర్నెట్‌లో సెర్చ్ చేసి వాటి వివరాలు తెలుసుకునేవాడు. అలా ఇప్పుడు చూపులేని వారి కోసం ప్రత్యేకంగా స్మార్ట్ సెన్సర్‌ను తయారుచేశాడు. వాళ్లు నడిచేటప్పుడు ప్రమాదాల బారిన పడకుండా ఇది సాయపడుతుంది.
ఎలా పనిచేస్తుందంటే...
ఈ సెన్సర్‌ను ఎలా డిజైన్ చేసాడంటే... మొదట షూను ఒకపక్క కత్తిరించాడు. దాంట్లో సెన్సర్‌ను పెట్టాడు. షూ ముందుభాగంలో ఉండి, చూడ్డానికి రెండు కళ్లలా ఉంటుంది. ఇది బ్యాటరీతో పని చేస్తుంది. షూ వేసుకున్న వ్యక్తి నడుస్తున్నప్పుడు అడ్డుగా ఏదన్నా వస్తే ఆ సెన్సర్ సైరన్‌లా మోగుతుంది. దాంతో ఆ వ్యక్తి అలర్టై ప్రమాదం బారిన పడకుండా తప్పుకోవచ్చు.