గ్రేటర్​ ఆర్టీసీ బస్సుల్లో స్మార్ట్​ టిమ్స్ మెషీన్స్​

  • క్రెడిట్ కార్డు​ సైతం స్వైప్ చేసుకునేలా వెసులుబాటు
  •  పాత మెషీన్లు మొరాయిస్తుండడంతో కొత్తవి ఆర్డర్ చేసిన అధికారులు
  • ప్రయోగాత్మకంగా బండ్లగూడ, దిల్​సుఖ్​నగర్ ​డిపోల్లో అమలు
  • దశలవారీగా 2,800 బస్సుల్లో ప్రవేశపెట్టనున్న ఆర్టీసీ    

హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్​పరిధిలో బస్సు ప్రయాణికులను తరచూ వేధించే సమస్యల్లో ఒకటి చిల్లర, రెండు ఆలస్యంగా టికెట్లు ఇష్యూ చేయడం. టికెట్లు కొట్టే మెషీన్లు మొరాయిస్తుండడంతో కండక్టర్లు తిప్పలు పడాల్సి వస్తున్నది. కొన్నిసార్లు మొత్తానికే పని చేయకపోవడంతో ప్యాసింజర్లను బస్సు దింపి వేరే బస్సుల్లో పంపించాల్సి వస్తున్నది. ఇలాంటి ఘటనలు సిటీలో తరచూ జరుగుతుండడంతో ‘స్మార్ట్​ టిమ్స్’ మెషీన్స్​కొనుగోలు చేసేందుకు ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది.

ఈ మెషీన్లలో యూపీఐ యాప్​ల నుంచి డబ్బులు చెల్లించవచ్చు. అలాగే క్రెడిట్, డెబిట్​కార్డులను స్వైప్​చేసే వెసులుబాటు కూడా ఉంటుంది. ప్రస్తుతం బండ్లగూడ, దిల్​సుఖ్​నగర్ ​డిపోల్లో అమలు చేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో ఆశించిన ఫలితాలు వస్తుండడంతో దశలవారీగా గ్రేటర్​లోని అన్ని డిపోల్లో ఇంప్లిమెంట్​చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.  

2,800 బస్సులు.. 3500 టిమ్స్​

ప్రస్తుతం గ్రేటర్​పరిధిలో ఆర్టీసీ 2,800 బస్సులు నడుపుతోంది. ఒక్కో బస్సులో రోజుకు వెయ్యి నుంచి రెండువేల వరకు ప్యాసింజర్లు ప్రయాణిస్తున్నారు. వీరికి టికెట్లు ఇవ్వడానికి ఆర్టీసీ దాదాపు 3,500 టిమ్స్​ కొనుగోలు చేసింది. ఒకసారి కొన్న మెషీన్​ మూడేండ్ల పాటు సమస్యలు లేకుండా పని చేస్తుంది. కానీ, ప్రస్తుతం ఉన్న మెషీన్లు మూడేండ్లకు మించినవి కావడంతో మొరాయిస్తున్నాయి. 

కొన్ని సందర్భాల్లో మొరాయిస్తున్న మెషీన్​ స్థానంలో మరొకటి తీసుకునేందుకు తిరిగి డిపోలకు వెళ్లాల్సి వస్తోందని కండక్టర్లు చెప్తున్నారు. దీంతో సంస్థ ఆదాయం తగ్గడంతో పాటు  ప్రయాణికుల సమయం వృథా అవుతోంది. తాను తరచూ శామీర్​పేట నుంచి సికింద్రాబాద్​కు ప్రయాణిస్తుంటానని, ఎన్నోసార్లు టిమ్స్​ మొరాయించడంతో బస్సును నిలిపి వేరే బస్సులో పంపించారని తెలంగాణ పేద ప్రజల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎ. సత్తిరెడ్డి తెలిపారు.

త్వరలో అందుబాటులోకి ‘స్మార్ట్​ టిమ్స్​’

మొరాయిస్తున్న టిమ్స్​ స్థానంలో త్వరలోనే ‘స్మార్ట్​ టిమ్స్​’ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఆర్టీసీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్​ టెక్నాలజీతో పనిచేసే ఈ స్మార్ట్​ టిమ్స్​తో చాలా సులభంగా టికెట్లను జారీ చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకూ ప్రతి బస్సులో డబ్బులు ఇస్తేనే టికెట్​ఇస్తున్నారు. కొన్ని సందర్భాల్లో చిల్లర కూడా పెద్ద సమస్యగా మారుతోంది.

స్మార్ట్​టిమ్స్​అందుబాటులోకి వస్తే డెబిట్​కార్డు, పేటీఎం, గూగుల్​పే, ఫోన్​ పే ద్వారా కూడా చెల్లించే అవకాశం ఉంటుందని  అధికారులు తెలిపారు. దీనివల్ల చిల్లర సమస్య కూడా పరిష్కారమవుతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా బండ్లగూడ, దిల్​సుఖ్​​నగర్​ డిపోల పరిధిలో స్మార్ట్​టిమ్స్​తో టికెట్ల జారీ చేస్తున్నామని, దీనికి ప్రయాణికుల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. త్వరలోనే గ్రేటర్​లోని అన్ని డిపోల పరిధిలో అమలు చేస్తామన్నారు.